Til Ki Barfi And Sesame Veg Salad: నువ్వులతో ఆరోగ్యం.. తిల్‌ కీ బర్ఫీ, సెసెమీ వెజ్‌ సలాడ్‌ తయారీ ఇలా!

2 Sep, 2022 11:33 IST|Sakshi
తిల్‌ కీ బర్ఫీ, ఏషియన్‌ సెసెమీ వెజ్‌ సలాడ్‌

Til Ki Barfi And Sesame Veg Salad Recipes: వర్షం... పడిశం కలిసి వస్తాయి. చలి... కీళ్ల నొప్పులు ఒకదాని వెంట మరొకటి వస్తాయి. వర్షాకాలం... చలికాలాల్లో... ఆహారంలో ‘నువ్వు’ ఉంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. అందుకే... మన ‘వంటిల్లు’లో ‘నువ్వుల వంటలు’.. 

తిల్‌ కీ బర్ఫీ 
కావలసినవి:
►నువ్వులు– ఒక కప్పు
►నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్‌
►కోవా– అర కప్పు
►చక్కెర – కప్పు
►నీరు –  కప్పు.

తయారీ:
►మందపాటి బాణలిలో నువ్వులను సన్నమంట మీద చిటపటలాడే వరకు వేయించి బాణలిని స్టవ్‌ మీద నుంచి దించాలి.
►స్టవ్‌ మీద మరొక బాణలి పెట్టి అందులో నెయ్యి, కోవా వేసి బాగా కలుపుతూ సన్నమంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి.
►ఇప్పుడు స్టవ్‌ మీద నుంచి దించి వెంటనే వేయించిన నువ్వులను వేసి కలిపి వేడి తగ్గేవరకు పక్కన ఉంచాలి.  
►మరొక పాత్రలో చక్కెర, నీరు కలిపి చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు గరిటతో కలుపుతూ మరిగించాలి.
►తీగపాకం రాగానే ముందుగా సిద్ధం చేసిన నువ్వులు, కోవా మిశ్రమాన్ని వేసి కలపాలి.

►ఒక ప్లేటుకు నెయ్యి రాసి అందులో పై మిశ్రమాన్ని వేసి సమంగా సర్దాలి.
►కొద్దిగా వేడి తగ్గిన తర్వాత నచ్చిన ఆకారంలో కట్‌ చేసి చల్లారే వరకు పక్కన ఉంచాలి.
►చల్లారిన తర్వాత బర్ఫీలను గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం– పది రోజుల వరకు తాజాగా ఉంటాయి.
►భోజనం తరవాత ఒక బర్ఫీ తింటే దేహానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. 

ఏషియన్‌ సెసెమీ వెజ్‌ సలాడ్‌
కావలసినవి: 
►నువ్వులు – ఒక టేబుల్‌ స్పూన్‌ (దోరగా వేయించాలి)
►లెట్యూస్‌ లేదా క్యాబేజీ ఆకులు – ఒక కప్పు
►సన్నగా నిలువుగా తరిగిన బాదం పప్పు – ఒక టీస్పూన్‌
►తోటకూర లేదా చుక్కకూర –  అరకప్పు.

డ్రెసింగ్‌ కోసం: 
►ఆలివ్‌ ఆయిల్‌ – ఒక టీ స్పూన్‌
►సోయాసాస్‌ – ఒక టీ స్పూన్‌
►నువ్వు పప్పు నూనె – పావు టీ స్పూన్‌
►ఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంత.

తయారీ:  
►ఒక పాత్రలో నువ్వులు, లెట్యూస్, బాదం పప్పు, ఆకుకూరలను వేసి కలపాలి. 
►మరొక పాత్రలో డ్రెసింగ్‌ కోసం తీసుకున్నవన్నీ వేసి చిలికి పైమిశ్రమంలో వేసి సర్వ్‌ చేయాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్‌రూట్‌ బజ్జీ ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి!
Corn Palak Pakoda Recipe: స్వీట్‌ కార్న్‌, పాలకూర.. కార్న్‌ పాలక్‌ పకోడి

మరిన్ని వార్తలు