ఏనుగుల మావటి షబ్నా సులైమాన్‌

25 Aug, 2020 02:28 IST|Sakshi

దేశమంతా గణనాథుడు కొలువై ఉండే రోజులివి. నిమజ్జనం వరకూ వినాయకుడి వేడుకలే. ఏనుగు ఆయన ప్రతిరూపం. వినాయకుణ్ణి సృష్టించిన పార్వతి శక్తి స్వరూపం. కాని–  ఏనుగుల మావటీలు ఎప్పుడూ మగవారే. దేశంలో ఒకరిద్దరు మహిళా మావటీలు ఉన్నారు. కాని ముస్లిం మావటి మాత్రం షబ్నా సులైమానే. ఏనుగులతో ఆమె స్నేహం వినూత్నం. విశేషం.

గౌహతికి చెందిన పార్బతి (65) భారతదేశంలో తొలి మహిళా మావటి. 14 ఏళ్ల వయసు నుంచే ఆమె ఏనుగులను అదుపు చేయడం నేర్చుకుంది. గౌహతిలో డిగ్రీ చదువుకుని, ఒక బ్యాంకు అధికారిని పెళ్లి చేసుకుని పిల్లల సంరక్షణ చూసుకునే తల్లిగా ఉంటున్నా ఆమె ఏనుగులతో తన అనుబంధాన్ని మానుకోలేదు. చాలా కాలం అడవుల్లోనే ఉండటానికి ఇష్టపడుతుంది. వెంట తన కుమార్తెలను కూడా తీసుకెళుతుంది. కీకారణ్యాల్లో ఏనుగును ఎక్కి షికారు చేస్తుంది. అందుకే ఆమెను ‘ఏనుగుల రాకుమారి’ అని ఆ ప్రాంతంలో పిలుస్తారు. కేరళ సంగతి వేరు. అక్కడ కూడా ఏనుగులే. కాని మావటీలు వందశాతం పురుషులే. చాలా అరుదుగా ఒకరిద్దరు మహిళా మావటీలు ఉన్నారు. అయితే షబ్నా సులైమాన్‌ మాత్రం అక్కడ విశేషంగా వార్తలు సృష్టించింది. దానికి కారణం దుబాయ్‌లో మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఏనుగుల సారధిగా ఉండటానికి ఈ సంవత్సరం మొదలులో కేరళ వచ్చి దానికి సంబంధించిన ట్రైనింగ్‌ తీసుకోవడమే.

పుస్తకం రాద్దామని బయలుదేరి
27 ఏళ్ల షబ్నా సులైమాన్‌ది కేరళలోని కొజికోడ్‌ సమీపాన కడలుండి. దుబాయ్‌లో వైద్య సిబ్బంది విధులతో ఉపాధి పొందుతున్న షబ్నాకు ఏనుగుల మీద ఒక పుస్తకం రాయాలనిపించింది. వెంటనే ఏనుగులకు సంబంధించిన పుస్తకాలు చదవడం మొదలెట్టింది. కాని అంధులకు స్పర్శ ద్వారా ఏనుగు పూర్తి స్వరూపం ఎలా అర్థం కాదో దూరంగా ఉండి పుస్తకాలను చదవడం ద్వారా కూడా ఏనుగుల గురించి ఏమీ అర్థం కాదని షబ్నాకు అనిపించింది. కేరళ వెళ్లి మావటీగా తర్ఫీదు పొందడమే దీనికి సరైన మార్గం అని నిశ్చయించుకుంది. అయితే మావటి కావడం అంత సులువా?

కుటుంబం మద్దతు
షబ్నా నిర్ణయం విని కుటుంబం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే షబ్నా వాళ్ల తాతకు ‘గ్రేట్‌ మలబార్‌ సర్కస్‌’ పేరుతో సర్కస్‌ కంపెనీ ఉండేది. ఇది కేరళలో తొలి సర్కస్‌. అయితే షబ్నా వాళ్ల చిన్నాన్నను సర్కస్‌లోని పులి పొరపాటున చంపేయడంతో మనసు విరిగిన తాత సర్కస్‌ను అమ్మేశాడు. కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినా ఆ కుటుంబానికి మూగ జీవాల పట్ల ప్రేమ పోలేదు. మావటీగా ఏనుగుల సారథ్యాన్ని నేర్చుకుంటానని షబ్నా చెప్పినప్పుడు తండ్రి సులైమాన్‌ అంగీకరించారు. అయితే ముస్లిం కుటుంబం నుంచి ఒక మహిళ ఇలా మావటి పని నేర్చుకోవడాన్ని ఎలా చూడాలో ఒకరిద్దరు మత పెద్దలకు వెంటనే అర్థం కాలేదు. ‘మనమ్మాయికి ఇది అవసరమా’ అని అడిగారు. వారికి కుటుంబం సర్ది చెప్పింది. మావటీ పని నేర్చుకోవడానికి పచ్చజెండా ఊపింది.

గురు హరిదాస్‌ దగ్గర...
ప్రతి చదువుకీ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ ఉన్నట్టే మావటీ విద్యకు కూడా కేరళలో ప్రత్యేకమైన ఆస్థానాలు ఉన్నాయి. పాలక్కాడ్‌లోని ఒట్టపాలెంటలో మానిశ్శేరి హరిదాస్‌ మావటీల గురువు. అతని సొంతానికి మూడు ఏనుగులు ఉన్నాయి. దేవాలయ ఉత్సవాలకు వాటిని అద్దెకు తిప్పుతుంటాడు. షబ్నా అతడిని కలిసి మావటీ విద్య నేర్పమని చెప్పింది. అలా ఒక మహిళ అందునా ముస్లిం మహిళ వచ్చి అతణ్ణి ఎప్పుడూ అడగలేదు.‘ఇది ఆడవాళ్లకు అంత సులువుగా అబ్బే విద్య కాదు. అయినా చూద్దాం’ అని అతడు నిరాకరించక తన ఏనుగుల్లోని రాజేంద్రన్‌ అనే ఏనుగును ఆమెకు అప్పజెప్పాడు. అంతే కాదు మూడు దశల్లో ఉండే మావటీ విద్యను బోధించడం మొదలుపెట్టాడు. షబ్నా కేవలం ఐదడుగుల ఎత్తు ఉంటుంది. కాని నెల రోజుల మొదటి దశలోనే ఆమె రాజేంద్రన్‌ను తన అదుపులోకి తీసుకోగలిగింది. కూర్చోమన్నప్పుడు కూర్చునేలా చేయడం, వెనక్కు తిరగమన్నప్పుడు వెనక్కు తిరిగేలా చేయడం, తొండం ఎత్తమన్నప్పుడు తొండం ఎత్తేలా చేయడం మావటీ సామర్థ్యానికి గుర్తు. రాజేంద్రన్‌ ఈ మూడు కమేండ్స్‌ను షబ్నా దగ్గర స్వీకరిస్తోంది. చేసి చూపిస్తోంది.

పెరిగిన డిమాండ్‌
షబ్నా మావటీ విద్యను అభ్యసిస్తోంది అని ఆ నోటా ఈ నోటా కేరళ దేవాలయాలకు తెలిశాక దేవాలయ ఉత్సవాలకు రాజేంద్రన్‌ను, మావటీగా షబ్నాను పిలవాలని నిశ్చయించుకున్నారు. వీరిరువురు ప్రత్యేక ఆకర్షణ కాగలరని వారి భావన. ‘దేవాలయ ఉత్సవాల్లో అంత సమూహం మధ్య ఏనుగును కంట్రోల్‌ చేయడమే ఏ మావటీకైనా సవాల్‌. ఆ సవాల్‌ను ఎదుర్కొనగలననే అనుకుంటున్నాను’ అని షబ్నా అంది. ఈ కరోనా రాకపోయి ఉంటే ఈసరికి మనం దేవాలయ ఉత్సవాల్లో షబ్నా ఏనుగు మీద కూచుని ఉన్న ఫొటోను చూసి ఉండేవాళ్లం. కనీసం ఈ వినాయ చవితి వేడుకల్లో అయినా చూసి ఉండేవాళ్లం. ఈ సంవత్సరం కరోనాకు వదిలిపెట్టిన వచ్చే సంవత్సరం షబ్నాదే. – సాక్షి ఫ్యామిలీ
భారతదేశ తొలి మహిళా మావటి అస్సాంకు చెందిన పార్బతి

మరిన్ని వార్తలు