షరారా శారీ.. చూపు తిప్పుకోలేరు మరి!

30 Jul, 2021 18:30 IST|Sakshi

లంగా ఓణీ వేసుకున్న కళ రావాలి.. 
చీరకట్టుకున్న హుందాతనం కళ్లకు కట్టాలి..
ఇండోవెస్ట్రన్‌ లుక్‌ అనిపించాలి.. పూర్తి ట్రెడిషనల్‌ అని మార్కులు కొట్టేయాలి
వీన్నింటికీ ఒకే ఒక సమాధానం షరారా శారీ డ్రెస్‌.

నవతరం అమ్మాయి అయినా సంప్రదాయ వేడుకలకు తగినట్టుగా తయారు కావాలని కోరుకుంటుంది. అందుకు తగిన డ్రెస్‌ను ఎంపిక చేసుకుంటుంది. కానీ, సంప్రదాయ చీరకట్టులో సౌకర్యం ఉండదనుకునేవారికి స్టైల్‌గా సమాధానం చెబుతోంది షరారా శారీ. 

వందల ఏళ్ల ఘనత
షరారాను ఘరారా అని కూడా అంటారు. ఇది పూర్తిగా సంప్రదాయ లక్నో డ్రెస్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్‌ పుట్టినిల్లుగా ఉత్తరప్రదేశ్‌ నవాబ్‌ల ఇంట 19, 20 శతాబ్దాలలో డెయిలీ డ్రెస్‌గా పేరొందింది. టాప్‌గా షార్ట్‌ కుర్తీ, బాటమ్‌గా షరారా ప్యాంట్‌ ధరించి దుపట్టాను తల మీదుగా తీసుకుంటూ భుజాలనిండా కప్పుకుంటారు. నడుము నుంచి మోకాలి వరకు ఫిట్‌ గా ఉంటూ, మోకాలి నుంచి కింద వరకు వెడల్పుగా, కుచ్చులతోనూ ఉంటుంది. అయితే, ఈ స్టైల్‌ లోనే చిన్న మార్పు చేసి దుపట్టాను పవిటలా ధరించి లంగా ఓణీ స్టైల్, ఇంకొంచెం ముందుకు వెళ్లి శారీ స్టైల్‌లో తీసుకువస్తున్నారు. చాలా వరకు ఈ షరారా సూట్స్‌ సిల్క్‌ బ్రొకేడ్‌తో డిజైన్‌ చేసినవి ఉంటాయి. ఈ డ్రెస్‌ ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా పండగలు, వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

ఇలా స్టైలిష్‌ లుక్‌
► మన సంప్రదాయ చీరకట్టు స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకోవడానికి షరారా శారీ అమ్మాయిలకు సరైన ఎంపిక అవుతుంది. 

► సాయంకాలాలు గెట్‌ టు గెదర్‌ వంటి పార్టీలకైతే ప్రిల్స్, ఫ్లోరల్, టాప్‌ టు బాటమ్‌ సేమ్‌ కలర్‌ షరారా శారీ సెట్‌ బాగా నప్పుతుంది. వీటికి పెద్దగా ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. 

► సంప్రదాయ పండగలు ఎరుపు, పసుపు షరారా డ్రెస్‌ సరైన ఎంపిక.

► వివాహ వేడుకలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సంప్రదాయ ఆభరణాల ఎంపిక సరైన అందాన్ని తీసుకువస్తాయి.

► శరీరాకృతి ఫిట్‌గా ఉన్నవారు ఈ తరహా స్టైల్‌ను ఎంపిక చేసుకుంటే వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. 

► టాప్‌గా షార్ట్‌ కుర్తా వేసుకుంటే ఒక స్టైల్, ఎంబ్రాయిడీ బ్లౌజ్‌ లేదా స్లీవ్‌లెస్‌ ట్యునిక్‌ వేసుకుంటే మరో స్టైల్‌తో ఆకట్టుకుంటుంది షరారా సూట్‌.

► షరారా ప్యాంట్‌లా కాకుండా కుచ్చులు ఎంత ఎక్కువగా ఉన్నది ఎంచుకుంటే అంత అందంగా, అచ్చు శారీ కట్టుకున్న విధంగా కనిపిస్తారు. ప్యాంట్‌ స్టైల్‌ కావడం, దానికి బెల్ట్‌ జత చేయడంతో సౌకర్యంగానూ ఉంటుంది.

మరిన్ని వార్తలు