షాపర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం

22 Feb, 2023 01:56 IST|Sakshi

తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్‌సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్‌గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్‌ ‘షాపర్‌టైన్‌మెంట్‌’ను ఇష్టపడుతున్నారు.వెబ్‌సైట్లలో వన్‌సైడ్‌ కమ్యూనికేషన్‌ ఇష్టపడని వారికి లైవ్‌ కామర్స్‌ యాప్‌లు దగ్గరయ్యాయి.

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్‌ ఆన్‌లైన్‌ షాపర్‌. రియల్‌ టైమ్‌ షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం లైవ్‌ స్ట్రీమింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్‌టైన్‌మెంట్‌. 

‘షాపర్‌టైన్‌మెంట్‌లో షాప్‌కు వెళ్లి సరదాగా షాపింగ్‌ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్‌స్టిక్‌ నుంచి ఐ షాడోస్‌ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక.

నాసిక్‌లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్‌–జెడ్, మిలీనియల్స్‌ రియల్‌ టైమ్‌ షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ‘షాపర్‌టైన్‌మెంట్‌’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్‌గా కూడా మారింది. చైనీస్‌ డిజిటల్‌ మార్కెట్‌లో పుట్టిన ‘షాపర్‌టైన్‌మెంట్‌’ (కాంబినేషన్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్‌) ట్రెండ్‌ ఇప్పుడు మన దేశంలోనూ హల్‌చల్‌ చేస్తోంది.చైనాలో ‘షాపర్‌టైన్‌మెంట్‌’ అనేది పాపులర్‌ ట్రెండ్‌గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘టవ్‌భావ్‌’ షాపర్‌టైన్‌మెంట్‌కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. 

‘ఇది కేవలం మరో మార్కెటింగ్‌ ట్రెండ్‌ కాదు. రిటైల్‌ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్స్‌ దౌయిన్, క్లైష్‌ ‘షాపర్‌టైన్‌మెంట్‌’ ట్రెండ్‌ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్‌టైన్‌మెంట్‌’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ప్లాట్‌ఫాం ‘మింత్రా’ లైవ్‌ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ లాంచ్‌ చేసింది. 2026 కల్లా ‘షాపర్‌టైన్‌మెంట్‌’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇ–కామర్స్‌ ప్రపంచంలో కస్టమర్‌ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్‌ (కేరళ)

వెబ్‌సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్‌గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై

మరిన్ని వార్తలు