Stretches for Neck and Shoulder Pain: తరచూ మెడ, భుజం నొప్పి వస్తుందా ? ఇలా చేయండి..

20 Nov, 2021 12:09 IST|Sakshi

Possible Causes of Neck and Shoulder Pain: సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూడటం, ముఖ్యంగా సిస్టమ్‌ మీద ఎక్కువగా పని చేయడం వల్ల వస్తున్న సమస్యలలో మెడనొప్పి, భుజం నొప్పి ముఖ్యమైనవి. వీటితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగా ఈ విధంగా ప్రయత్నించి చూడండి. 

మెడనొప్పితో బాధ పడుతూ ఉంటే మీరు చెయ్యవలసిన మొదటి పని తలను ముందుకు వంచకుండా ఉండడం. తల ఎత్తుకుని తిరగడం మొదలు పెట్టాలి. పడుకునేటపుడు తల దిండుకు బదులు గుండ్రంగా చుట్టిన పలుచటి దుప్పటి లేదా టవల్‌  మెడ కింద పెట్టుకోండి. స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సప్‌ మెస్సేజ్‌లు చూసేటప్పుడు తలను ముందుకు వంచడం మానండి.

చెయ్యవలసిన ఎక్సర్‌సైజ్‌లు
►రెండు చేతులనూ ముందుకు చాపి వేళ్ళను మాత్రమే ముడిచి తెరుస్తూ ఉండండి. ముడిచినపుడు వేళ్ళు కణుపుల వరకూ మాత్రమే ముయ్యాలి. తెరిచినపుడు వేళ్ళ మధ్య ఖాళీలు ఎక్కువ ఉండేటట్టు తెరవాలి. ఊపిరిని పీలుస్తూ తెరవండి. విడుస్తూ ముయ్యండి.
►తరువాత మీ చేతి బొటన వేళ్ళను లోపలి పెట్టి దానిపై మిగిలిన వేళ్ళతో వత్తిడి కలిగిస్తూ్త గుప్పిళ్ళను ముయ్యాలి.  ఊపిరి పీలుస్తూ గుప్పిళ్ళను తెరవాలి.
►చేతులను భుజాల వరకు చాపి ఉంచి మోచేతి వద్ద మడుస్తూ అరచేతులు భుజాల వద్ద పెట్టాలి. మళ్ళీ చేతులను చాపాలి. ఇలా చెయ్యడం వలన మోచేతి జాయింట్‌ ఫ్లెక్సిబుల్‌ గా తయారవడమే కాదు. చేతులలోకి రక్త ప్రసరణ బాగా జరిగి స్పొండిలోసిస్‌ వలన కలిగే మొద్దుబారడం తగ్గుతుంది. చేతి వేళ్ళను దగ్గరగా చేర్చి, భుజాలపై పెట్టుకుని మోచేతులతో పెద్ద సున్నాలు చుట్టండి. వెనుకకు వెళ్ళేటపుడు బాగా దూరంగా ఉండేలా, ముందుకు వచ్చినపుడు చాతీ దగ్గర మోచేతులు కలిసిపోయేలా ఈ సున్నాలు చుట్టాలి.

చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు... ఎలాగంటే..

►అర చేతులను మోకాళ్ళపై పెట్టుకుని, భుజాలను గుండ్రంగా ముందుకు సున్నాలు చుట్టండి. తరువాత వెనుకకు చుట్టండి. ఇది భుజాల నొప్పులను పోగొడుతుంది.
►రెండు చేతులనూ పైకి ఎత్తి, కుడి చేత్తో ఎడమ చేయి మణికట్టు వద్ద ఎడమ చే తితో కుడి మణికట్టు వద్ద పట్టుకుని, చేతులను తల వెనుక వైపుకు తీసుకు వెళ్లి, ఎడమ చేతిని దిగువకు లాగుతూ, కుడి మోచేయి తల పై భాగం లోకి వచ్చేలా చేసి తలతో చేతులను వెనుకకు నెట్టండి. ఇది ఫ్రోజెన్‌ షోల్డర్‌కి కూడా పనిచేస్తుంది. రివర్స్‌లో కూడా చెయ్యండి.
►అరచేతి వేళ్ళను ఇంటర్‌ లాక్‌ చేసి, తల వెనుకగా పెట్టి చేతులతో తలను ముందుకు నెడుతూ తలతో చేతులను వెనుకకు నెట్టండి. ఇపుడు చేతులను ముందు నుదురు మీద పెట్టి, వెనుకకు ప్రెషర్‌ ఇవ్వండి. అలాగే ఎడమ చేతిని ఎడం వైపు కణత మీద పెట్టి కుడి వైపుకు ప్రెషర్‌ ఇవ్వండి. అనంతరం కుడి చేతిని కుడి కణత మీద పెట్టి ఎడమ చేతి వేపు నెట్టండి. తలతో రెసిస్ట్‌ చెయ్యండి.
►ఊపిరి పీలుస్తూ తలను కుడి వైపుకు తిప్పి గడ్డం కుడి భుజాన్ని తాకేలా ఊపిరి విడుస్తూ ముందుకు తీసుకు రండి. ఎంత తిప్పగలిగితే అంత తిప్పండి. అలాగే ఎడమ వైపుకు కూడా చెయ్యండి. కానీ కిందకు మాత్రం చెయ్యకూడదు. 
►కళ్ళను గుండ్రంగా తిప్పండి. పైకి, కుడికీ, దిగువకూ, ఎడమ వైపుకూ ..తిరిగి రివర్స్‌లో తిప్పండి.

ఈ వ్యాయామాలు మెడనొప్పిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరమైనవి. 

చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్‌ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..

మరిన్ని వార్తలు