8 మందికి శ్రీశక్తి పురస్కారం

17 Jan, 2021 12:27 IST|Sakshi

స్టార్టప్‌ ఉమెన్‌

కరోనా వచ్చి ఒక విషయాన్ని రుజువు చేసి వెళ్లింది! కరోనా వెళ్లిందా? నిజంగానే వె..ళ్లి.. పోయిందా?! ఆగండాగండి. కరోనా వెళ్లిందా, నిజంగానే వెళ్లిపోయిందా అని కాదు.. కరోనా ఏం రుజువు చేసిందన్నది పాయింట్‌. మహిళలు ఎంత శక్తిమంతులో కరోనా చూపించింది! ప్రతి స్త్రీ.. గృహిణిని, ఉద్యోగి, వైద్యురాలు, పారిశుధ్య కార్మికురాలు, అంగన్‌వాడీ కార్యకర్త.. ఎవరైనా గానీ.. ఒక శక్తి స్వరూపిణిగా ఈ కష్టకాలంలో మానమాళిని కడుపులో పెట్టుకుని చూసింది. వీళ్లతో సమానంగా బిజినెస్‌ ఉమన్‌! అవును. బిజినెస్‌ ఉమెన్‌ తమ స్టార్టప్‌లతో కరోనాకు కళ్లెం వేశారు. వ్యాప్తిని నిరోధించారు. నివారించారు. అందుకే ఐక్యరాజ్య సమితి యు.ఎన్‌. ఉమెన్‌ ఆసియా–పసిఫిక్‌ సంస్థ.. బిజినెస్‌ ఉమన్‌కు నమస్కరిస్తోంది. వారి స్టార్టప్‌ శక్తి సామర్థ్యాలను కొనియాడుతోంది.

‘కోవిడ్‌–19 శ్రీ శక్తి ఛాలెంజ్‌’, ‘ప్రామిసింగ్‌ సొల్యూషన్స్‌’ అనే రెండు కేటగిరీలలో భారతదేశం నుంచి ఎనిమిది మంది మహిళల్ని విజేతలుగా ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం.  గాయత్రీహేల, రోమితాఘోష్, అంజనా రామ్‌కుమార్, అనూషా అశోకన్‌ ఈ నలుగురూ యు.ఎన్‌. ఉమెన్‌ ‘శ్రీ శక్తి చాలెంజ్‌’ విజేతలుగా ఎంపికయ్యారు. వాసంతీ పళనివేల్, శివి కపిల్, జయ పరాశర్, అంకితా పరాశర్‌ ఈ నలుగురు ‘ప్రామిసింగ్‌ సొల్యూషన్స్‌’ విజేతలుగా నిలిచారు. శ్రీ శక్తి విజేతకు 5 లక్షల రూపాయల్ని, ప్రామిసింగ్‌ సొల్యూషన్స్‌ విజేతకు 2 లక్షల రూపాయలను ప్రైజ్‌ మనీగా ఇస్తోంది యు.ఎన్‌. ఉమెన్‌. 
సమస్యను ఎదుర్కోవడంలో, సమస్యకు పరిష్కారాలు వెదకడంలో ఈ ఎనిమిది మంది మహిళలు కనబరిచిన అసమాన ప్రతిభా నైపుణ్యాలు ఎనిమిది బంగారు కిరీటాలతోనైనా వెలకట్టలేనివి.

డాక్టర్‌ పి. గాయత్రీహేల
డాక్టర్‌ హేల ‘రసేదా లైఫ్‌ సైన్సెస్‌’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌. బెంగళూరులోని ఆ సంస్థ.. పర్యావరణహితమైన సూక్ష్మ క్రిమి సంహారిణులను ఉత్పత్తి చేస్తుంటుంది. ఆల్కాహాల్‌ లేని శానిటైజర్‌ అనే మాట ఇప్పుడు కదా మనకు వినిపిస్తోంది. హేలకు 2003 లోనే ఈ ఆలోచన వచ్చింది. ‘సార్స్‌’ వైరస్‌ విజృంభించిన ఆ సమయంలో ఏడాది వయసున్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఆల్కాహాల్‌ లేని శానిటైజర్‌ని కనిపెట్టడం కోసం రోజంతా ల్యాబ్‌లో గడిపారు హేమ.  కోవిడ సమయంలోనూ ఆమె సంస్థ.. హానికరం కాని గృహ, వ్యవసాయ అవసరాల కోసం క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లను మట్టుపెట్టే రసాయన రహిత సంహారాలను తక్కువ ధరకే మార్కెట్‌ చేసింది. తనకొచ్చే ప్రైజ్‌ మనీతో ల్యాబ్‌ను మరింతగా ఆధునీకరించి పరిశోధనలను విస్తృతం చేయబోతున్నారు హేల. 

రోమితా ఘోష్‌
న్యూడిల్లీలోని మెడికల్‌ టెక్నాలజీ కంపెనీ ‘మెడ్‌సమాన్‌’ (ఐహీల్‌ హెల్త్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) సీఈవో రోమితా ఘోష్‌. కరోనా పీపీఇ కిట్‌లను, మాస్క్‌లను క్రిమి రహితంగా చేసే అల్ట్రా వైలెట్‌ స్టెరిలైజేషన్‌ బాక్సులను మెడ్‌సమాన్‌ విస్తృతంగా అందుబాటులోకి తేగలిగింది. ఘోష్‌కి బాల్యంలో బ్లడ్‌ క్యాన్సర్‌. తల్లిదండ్రులు సంపన్నులు కావడంతో ఖరీదైన చికిత్సతో ఆ చిన్నారిని కాపాడుకోగలిగారు. అప్పుడే ఆమె అనుకున్నారు. ప్రాణాంతకమైన జబ్బులతో బాధపడుతున్నవారికి ఆరోగ్య సేవల్ని అందించాలని. కోవిడ్‌ వ్యాప్తిని అదుపు చేయడం కోసం ఆమె ఆధ్వర్యంలో మెడ్‌సమాన్‌ సంస్థ యువి–సి స్టెబిలైజర్‌లను సమృద్ధిగా, సకాలంలో, తక్కువ ధరకు సరఫరా చేయగలిగింది. ప్రధానంగా ఆసుపత్రులకు. తనకొచ్చే నగదు బహుమతిని ఘోష్‌ మరింత తరళతరమైన పీపీఇ కిట్‌ల తయారీకి వెచ్చించనున్నారు. అవసరాన్ని సొమ్ము చేసుకోడానికి డిమాండ్‌ సృష్టించుకోవడం రోమితా ఘోష్‌ పూర్తిగా ఇష్టం లేని పని. 

డాక్టర్‌ అంజనా రామ్‌కుమార్, డాక్టర్‌ అనూషా అశోకన్‌
ఎర్నాకుళంలోని ‘తన్మత్ర లైఫ్‌ ఇన్నొవేషన్స్‌’ ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ అంజన. ఆ కంపెనీ సహవ్యవస్థాపకురాలు, డైరెక్టర్‌ అనూష. ఎలాంటి మామూలు వస్త్రాన్నయినా యాంటీ వైరల్‌ మాస్క్‌గా మార్చే లిక్విడ్‌ మాస్క్‌ (స్ప్రే)ను తన్మత్ర కనిపెట్టడంతో అంజనా, అనూష ఫ్రంట్‌ లైన్‌ యోధులుగా గుర్తింపు పొందారు. ఇద్దరూ హెల్త్‌ కేర్‌ నిపుణులే కావడంతో కరోనా సమయంలో తమను తాము కాపాడుకోవడంతో పాటు అనేక మందిని కరోనా ప్రభావానికి దూరంగా ఉంచగలిగారు. సురక్షితమైన, శక్తిమంతమైన మాస్క్‌ల తయారీతోనే వీరు కరోనాను కట్టడి చేయగలిగారు. వీళ్ల విజయ రహస్యం ఒక్కటే. కర్చీఫ్‌ని కూడా వీళ్లు తమ యాంటీమైక్రోబియల్‌ సొల్యూషన్‌ స్ప్రేతో క్షణాల్లో యాంటీ వైరల్‌గా మాస్క్‌గా మార్చే ఫార్ములాను కనిపెట్టడం. పేదవారికి కూడా అందుబాటులో ఉండే వినూత్న ఆరోగ్య రక్షణ సాధనాలను ఆవిష్కరించేందుకు ప్రైజ్‌ మనీ ఉపయోగిస్తామని అంజన, అనూష అంటున్నారు. 

ఆశాజనక పరిష్కర్తలు
వాసంతీ పళనివేల్‌ 
సెరాజెన్‌ బయోథెరపటిక్స్‌ సహ–వ్యవస్థాపకురాలు, సీఈవో. ఈమె నేతృత్వంలోనే సెరాజెన్‌ వైద్య పరిశోధకుల బృందం శ్వాసకోశాల అస్వస్థతకు ప్లాస్మా చికిత్సను కనిపెట్టింది. మహిళల్లో సంతాన సాఫల్యతపై శాస్త్ర అధ్యయనాలను జరుపుతుండే సెరాజెన్‌.. కరోనా చికిత్సలో వినూత్న వైద్య పరిష్కారాలను అధిక ప్రాధాన్యం ఇచ్చి మంచి ఫలితాలు సాధించింది. వాసంతి సైంటిస్ట్, రిసెర్చర్‌. ప్రైజ్‌ మనీని పల్మనరీ, ఫైబ్రోసిస్‌ చికిత్సలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఉపయోగిస్తానని అంటున్నారు. సెరాజెన్‌ చెన్నైలో ఉంది.

శివి కపిల్‌
‘ఎంపథీ డిజైన్‌ ల్యాబ్స్‌’ సీఈవో. బెంగళూరు లోని ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ రంగానికి అవసరమైన పరిష్కారాలను అన్వేషిస్తుంది. గర్భిణులు తమ ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోడానికి అనువైన వేరబుల్‌ మోనిటరింగ్‌ డివైజ్‌ ‘క్రి య’ను రూపొందించడం ఎనిమిదిన్నర ఏళ్ల ఎంపథీ ప్రస్థానంలో ఒక మలుపు. క్రియ వెనుక ఉన్న స్ఫూర్తి, ప్రేరణ శివినే. కోవిడ్‌ తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నప్పుడు  ‘కరోనా వల్ల మాకేమైనా అవుతుందా.. మీరేమైనా సహాయపడగలరా?’ అని గర్భిణుల నుంచి ‘ఎంపథీ’కి అసంఖ్యాకంగా మెయిల్స్‌ వచ్చాయి. అప్పుడు కనిపెట్టిందే ‘క్రియ’.

జయా పరాశర్, అంకితా పరాశర్‌
రోగుల ఆరోగ్య సంరక్షణను తమ చేతుల్లోకి తీసుకునే రోబోలను సృష్టించిన సంస్థ ‘స్ట్రీమ్‌ మైండ్స్‌’. ఆ సంస్థ ఆవిర్భావం ఈ తల్లికూతుళ్ల ఆలోచనే. జయ తల్లి. అంకిత కూతురు. ఇద్దరూ స్ట్రీమ్‌ మైండ్స్‌కి కో–ఫండింగ్‌ డైరెక్టర్‌లు. ఆరోగ్యానికే కాదు, పిల్లల చదువుకు అవసరమైన రోబోటిక్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌లను వీళ్లు రూపొందిస్తున్నారు. అంతే కాదు, ఆసుపత్రులలో నర్సులా సేవలు అందించే ‘డోబోట్‌’కు రూపకల్పన చేశారు. నగదు బహుమతిని రోబోల మార్కెటింగ్‌కి, విక్రయాలకు అవసరమైన వ్యూహాలకు ఉపయోగించనున్నారు.  

మరిన్ని వార్తలు