అగ్గిపెట్టె కళ.. ప్రపంచ చరిత్ర చూపుతూ

24 Feb, 2021 10:17 IST|Sakshi

చీకటింట వెలుతురుకు జన్మనివ్వడమే కాదు గత వైభవ కాంతినీ కళ్లకు కడుతుంది అగ్గిపెట్టె. నమ్మకం కుదరకపోతే అఖంఢ భారతావనితో పాటు ఖండాంతర ఖ్యాతిని కళ్లకు కట్టే ఈ మ్యాచ్‌ బాక్స్‌ లోగోలను ఒకసారి తిలకించండి. అమితాబ్‌ బచ్చన్‌ కూలీ సినిమా నుంచి టాటా నానో వరకు ఆసక్తి కథనాలను మ్యాచ్‌బాక్స్‌ లోగోలతో పరిచయం చేస్తాను రండి.. అంటూ ఆహ్వానిస్తోంది శ్రేయ కాటూరి. సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభించిన ‘ఆర్ట్‌ ఆన్‌ ఎ బాక్స్‌’ శ్రేయకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. మ్యాచ్‌ బాక్స్‌ ద్వారా ప్రపంచ చరిత్రను విశ్లేషణాత్మకంగా చూపుతూ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

అగ్గిపెట్టె కథలు
ఢిల్లీలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల శ్రేయ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా అనుకోకుండా వివిధ దేశాల ప్రసిద్ధ సంస్కృతులకు సంబంధించి ఒక ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా వినూత్నంగా తను అప్పటికే అలవాటుగా అప్పుడప్పుడు సేకరించిన మ్యాచ్‌బాక్స్‌లపై ఆమె దృష్టి పడింది. ఆ దృష్టి కోణం ఆమెను వినూత్నంగా ఆలోచింపజేసింది. ఆ ఆసక్తి వివిధ దేశాలకు సంబంధించిన 5,000 మ్యాచ్‌ బాక్స్‌ లోగోలను సేకరించి, శోధించి, విశ్లేషించేంతగా మారింది. అగ్గిపెట్టెల లోగో రూపకల్పనలో ఉన్న కథలను తెలుసుకుంటున్నకొద్దీ ఆమెకెన్నో విషయాల మీద అవగాహన పెరిగింది. ఈ విషయాలను పంచుకోవడానికి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సరైన వేదికగా భావించింది. ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ‘ఆర్ట్‌ ఆన్‌ ఎ బాక్స్‌’ పేరుతో అగ్గిపెట్టెల కథలు మొదలుపెట్టింది.

రంగురంగుల లేబుళ్ల సాక్ష్యం..
ప్రిన్స్‌ చార్లెస్‌ పెళ్లి వంటి ముఖ్యమైన చారిత్రక సంఘటనను స్మరించుకునే అగ్గిపెట్టె లేబుల్‌ కూడా శ్రేయ సేకరణలో ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత త్రివర్ణ పతాకం, అశోకచక్రం వంటి జాతీయ చిహాలు, స్వాతంత్య్ర సమరయోధులను కూడా మ్యాచ్‌బాక్స్‌లపైన చిత్రీకరించినవి ఉన్నాయి. ఆమె పరిశోధన అక్కడితో ఆగలేదు. అగ్గిపెట్టెల లోగోల కళను అర్థం చేసుకోవడంపై మరింతగా దృష్టి సారించింది.

‘‘సామాజిక దృక్కోణంలో  అగ్గిపెట్టెల గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. మతం, లింగ భేదం, దేశం ఇలా మూడు డొమైన్‌లను కేంద్రంగా ఉపయోగించి మ్యాచ్‌బాక్స్‌ల వెనుక ఉన్న కథలను పునర్నిర్మించాను. అందులో లేబుళ్లదే అసలైన ప్రాధాన్యత’’. అంటుంది.

సంస్కృతుల అవగాహన
ఈ పరిశోధన పూర్తి చేయడానికి ఏడాదికి పైగానే పట్టింది. చాలా ఆసక్తిగా అనిపించింది.  వేల మ్యాచ్‌బాక్స్‌లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలవీ నా దగ్గర ఉన్నాయి. భారతదేశంలో అగ్గిపెట్టెలను అధ్యయనం చేసిన తరువాత, మతపరమైన చిహ్నాలను దైవిక ఐకానోగ్రఫీ రూపంలో ఉపయోగించడంలో నిరంతరం కృషి జరిగిందని తెలుసుకున్నాను. స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చినవి, జాతీయవాద స్ఫూర్తిని పెంచినవి.. ఒక్కోటి తెలుసుకుంటూ వెళితే ఆ ప్రయాణం అత్యంత అద్భుతంగా అనిపించింది

స్త్రీని వస్తువుగా చూపిన కాలం
90 లలో లోగోలు బ్రాండ్ల వంటి వినియోగదారు ఉత్పత్తులను బట్టి మ్యాచ్‌బాక్స్‌ లేబుల్స్‌ మార్చారు. మరొకటి లింగ ప్రాతినిధ్యం పరంగా ఉంది. ఇది పితృస్వామ్య ఆధిపత్య శ్రేణులదని గమనించాను. నేను చూసిన ఒకే ఒక లేబుల్‌ పి.టి. ఉష మాత్రమే. ఎప్పుడూ పెళ్లికూతురు, బాలీవుడ్‌ ప్రముఖ తారల బొమ్మలు. మహిళలను ఎలా చిత్రీకరిస్తారనే దానిపైన నిర్వచనం సంవత్సరాలుగా మారనేలేదని స్పష్టమైంది. సాంకేతిక పరంగా చూస్తే మైక్రోసాఫ్ట్, ఆపిల్, కింగ్‌ఫిషర్‌ వంటి బ్రాండ్లు ఎలా అభివృద్ధి చెందాయో అగ్గిపెట్టెల లోగోలు చూపాయి. సాధారణ ఇతివృత్తాలు జంతువులు, మొక్కలు, పక్షులు, రేడియోలు, కార్లు .. వంటివి మ్యాచ్‌బాక్స్‌లలో ఉన్నాయి. 

నా స్థాయిలో నేను నా ప్రాజెక్ట్‌ ద్వారా ప్రజలను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు కొన్ని విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. అగ్గిపెట్టె కళ ద్వారా మహిళల చిత్రాల చిత్రణ నిర్వచనాన్ని మార్చలేమా? అన్నదే నా ప్రశ్న. మహిళల చిత్రాలను రైతులు, ఉపాధ్యాయులు లేదా వ్యోమగామిగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది స్ఫూర్తిదాయకమైన మహిళలు వివిధ రంగాలలో అసాధారణమైన ప్రతిభ కనబరుస్తున్నారు. 

దేశాల మధ్య వైరుధ్యం

వివిధ దేశాల నుండి అగ్గిపెట్టెల నమూనా లో ఖచ్చితంగా పెద్ద తేడా ఉంది. నేను సేకరించిన మ్యాచ్‌బాక్స్‌ల గరిష్ట సంఖ్య అమెరికా, భారత్‌. అమెరికాలోని బార్లు, రెస్టారెంట్ల నుండి కొన్ని సేకరించాను. వాటి డిజైన్‌ బ్రాండ్‌ ఆధారితమైనవి. అమెరికా మ్యాచ్‌బాక్స్‌లు అక్కడి చరిత్రలో 60 నుంచి 80 ల మధ్య కాలంలో ప్రత్యేకంగా ప్రింటింగ్‌ కంపెనీలు, హోటళ్ళు, రెస్టారెంట్ల కోసం ప్రకటనల సాధనంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జాతీయవాద భావాలను ప్రేరేపించడానికి బాగా ఉపయోగ పడ్డాయి. ఇతర దేశాల విషయానికొస్తే స్వీడన్‌ అగ్గిపెట్టెల డిజైన్‌ భిన్నంగా ఉంటుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, రష్యా, చైనా అగ్గిపెట్టెలు కొన్ని ఉన్నాయి.

సమాజాన్ని మార్చేవిధంగా లోగో..
మిగతా కాలాలతో పోల్చితే 90ల కాలంలోనే కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఆ వ్యత్యాసాన్ని అధ్యయనం చేయడం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. సిండ్రెల్లా, చోటా భీమ్‌ చిత్రాలు కూడా ఆ లోగోల్లో ఉన్నాయి. చూడటానికి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అగ్గిపెట్టెలు ప్రధానంగా ఎరుపు, పసుపు, నారింజ రంగులను ఒక నమూనాగా ఉపయోగించారు. ఇవి అగ్నిని సూచించడమే కారణం. ఈ కళలో ప్రఖ్యాత మహిళల చిత్రాలను, సమాజం భావనను మార్చేవిధంగా, మహిళల ప్రస్తుత ఆత్మస్థైర్య చిత్రాలను మార్చాలని కోరుకుంటున్నా’’  అని వివరిస్తుంది శ్రేయ.

మరిన్ని వార్తలు