Shyam Karri: భావోద్వేగమైన ఆవిష్కరణ.. అంతర్జాతీయ గుర్తింపు.. ఆ ప్రదేశాలకే ఎక్కువగా ఎందుకు వెళ్తానంటే!

4 Feb, 2022 13:39 IST|Sakshi

తాను కెరీర్‌ ఎంపిక చేసుకునే సమయంలో ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియడం లేదు. ఆ సమయంలో  జిడ్డు కృష్ణమూర్తి ‘థింక్‌ ఆన్‌ దిస్‌ థింగ్స్‌’ పుస్తకం దారి చూపింది. తనను ప్రతిభావంతుడైన వాటర్‌ కలర్‌ ఆర్టిస్ట్‌గా మార్చింది... 

పుడుతూనే పోలియో బారిన పడ్డాడు శ్యాం. విశాఖలో జన్మించిన శ్యాం దాదాపు ఐదేళ్ల వరకు నడవగలడో లేదో అనే ఆందోళన అందరిలో. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని నేలపై తొలి అడుగులు వేయించింది. కొద్దికాలానికి అతని అడుగులు స్కూల్‌ వైపు సాగాయి. స్కూల్‌లో డ్రాయింగ్‌ నేర్పించే ఉమా టీచర్‌  ప్రభావంతో శ్యాంకు పెయింటింగ్‌ అంటే ఇష్టం ఏర్పడింది.

ఇంజినీరింగ్‌ చదివేందుకు శ్యాంకు ఎన్‌ఐటీ తిరుచ్చిలో సీటు రావడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంజినీరింగ్, ఫిలిం మేకింగ్, పెయింటింగ్‌... ఇలా ఏ రంగంలో రాణించాలా? అనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే చివరిగా ప్రకృతికి హాని కలిగించని అంశాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో జిడ్డు కృష్ణమూర్తి రాసిన ‘థింక్‌ ఆన్‌ దిస్‌ థింగ్స్‌’ పుస్తకం శ్యామ్‌కు మార్గం చూపింది.   

అంతర్జాతీయ వాటర్‌ కలర్‌ చిత్రకారులు మిలింద్‌ ముల్లిక్, రాజ్‌కుమార్‌ స్తబథేలు తాను అభిమానించే గురువులుగా చెప్పుకునే శ్యాం సహజత్వం, భావోద్వేగమైన ఆవిష్కరణతో పలు వేదికలపై వారి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. 

‘‘నా పెయింటింగ్స్‌లో నిత్యం ప్రయోగాలకే ప్రాధాన్యమిస్తాను. ప్రతి పెయింటింగ్‌ను నా తొలి పెయింటింగ్‌గా ఫీలవుతాను. పెయింటింగ్‌ వేసే ముందు ప్రకృతితో మమేకమయ్యేందుకు తాపత్రయపడతాను. అందుకే పెయింటింగ్స్‌ వేసేందుకు మా ప్రాంతంలో ఆకర్షణీయ స్థలాలతోపాటు హంపి, కొడైకెనాల్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ఎక్కువగా వెళతాను.

కొన్ని ప్రాంతాల్లో వాటర్‌లోని సాల్ట్, ఫ్లోరిన్‌ శాతాలను బట్టి పెయింటింగ్స్‌లో అద్భుత ఆవిష్కరణ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. నా పెయింటింగ్స్‌లో ఎక్కువగా యానిమల్స్‌ ఎమోషన్స్‌ కనిపిస్తాయని అభిమానులు చెబుతారు. అందుకే వాటికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌  ద్వారా నా పెయింటింగ్స్‌ కోసం ఆర్డర్లు వస్తున్నాయి’’ అంటున్నాడు శ్యాం.
– పలివెల రవీంద్ర, ఎంవీపీ కాలనీ, సాక్షి, విశాఖపట్టణం 

చదవండి: Nishitha Rajput: అనుమానాలు.. అవమానాలు.. అయినా 3 కోట్ల రూపాయలు సేకరించి.. చదువులమ్మా.. నువ్వు చల్లంగుండాల!
ఇది కూడా చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! పిస్తాతో పాటు వీటిని తింటే..

మరిన్ని వార్తలు