ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు!

5 Dec, 2020 08:22 IST|Sakshi

‘ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు. చిత్తశుద్ధితో పాటు శ్రద్ధ, ఎప్పుడూ ‘ది బెస్ట్‌’ ఇవ్వాలనే సదాశయం ఉంటే చాలు. ఉద్యోగం ఓ క్రీడా మైదానం. ఎంత పోటీ పడితే అంత ముందంజలో ఉంటాం’ అంటున్నారు శ్యామ్లీ హల్దార్‌. భారతదేశ మొట్టమొదటి మహిళా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ జనరల్‌గా నియమితులైన శ్యామ్లీని ఆ స్థానానికి ఎదిగేలా చేసింది కేవలం ఆమె కృషి, నిబద్ధతలే.  

ఎంచుకున్న పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో నిర్వర్తించగల సత్తా మహిళకే ఉందని మరోసారి చాటారు శ్యామ్లీ హల్దార్‌. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ జనరల్‌గా ఈ మంగళవారం కోల్‌కతాలో నియమితులైన శ్యామ్లీ మొన్నటి వరకు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా విమానం కదలికలను పర్యవేక్షించేవారు. ఇప్పుడు కోల్‌కతాలోని 300 ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల బృందాన్ని పర్యవేక్షించే బాధ్యతను చేపట్టారు. మూడు దశాబ్దాల క్రితం అలహాబాద్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ కాలేజీ నుండి ట్రైనింగ్‌ పొందిన శ్యామ్లీ 1991లో కోల్‌కతాలో మొదటి పోస్టింగ్‌ తీసుకున్నారు. 

మానసిక బలం
‘‘నేను నా ఇంటి పనిని ఆఫీసుకు తీసుకు వెళ్లను. ఆఫీసు పనిని ఇంటికి తీసుకు వెళ్లిందీ లేదు. చేతిలో ఉన్న ఉద్యోగానికి నా ఉత్తమమైన పని ఇవ్వడానికే ఎప్పుడూ ప్రయత్నించాను. నా కూతురు, నా ఉద్యోగం నా జీవితానికి సమాంతర అంతఃశక్తులు. మన దేశంలో మహిళలు కుటుంబ విషయాల్లో ఎదుర్కొనే ఒత్తిళ్లతో పాటు రకరకాల సంఘర్షణలపై దృష్టి సారించడం సహజంగానే వస్తుంది. ఉద్యోగానికి కండ బలం అక్కర్లేదు. మహిళలు ఇదో క్రీడా మైదానంగా తన పోరాట పటిమను చూపించవచ్చు. నేను మానసికంగా బలవంతురాలిని. విధి నిర్వహణలో ఎప్పుడూ నా ఉత్తమమైన పనినే ఇచ్చాను. నేను చెప్పే మాట మీకు వింతగా అనిపించవచ్చు. కానీ, నేను ఏదో ఒక రోజు ఈ హోదాలో ఉండితీరుతాను అని ముందే ఊహించాను’’ అని బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సగర్వంగా తెలిపారు శామ్లీ హల్దార్‌. (చదవండి: పెళ్ళి ఛాందసమా, సదాచారమా!!)

పనితో సమాధానం
1989లో మొదటి ఎయిర్‌ బ్యాచ్‌ కంట్రోలర్లలో శ్యామ్లీ హల్దార్‌ కూడా ఉన్నారు. అప్పుడు మగ్గురు మహిళలను ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లుగా ఎంపిక చేశారు. కోల్‌కతాలో అధికారిగా మాత్రం శామ్లీ ఒక్కరే నియమితులయ్యారు. అలహాబాద్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ కాలేజీలో శిక్షణ పొందిన శామ్లీ పురుషాధిపత్య వృత్తిలో విధి నిర్వహణ ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఒంటరి తల్లిగా జీవిస్తున్న శామ్లీ ఓ వైపు ఉద్యోగాన్ని, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఎదిగారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా