మా నాన్న కలెక్టర్‌.. ఆయనే మా ధైర్యం

14 Sep, 2020 06:28 IST|Sakshi

‘అమ్మలేదంటూ బెంగపడవద్దు.. అయినవారెవ్వరూ లేరనే చింత అసలే వద్దు.. నాన్నగా ధైర్యమై మీ వెంటే ఉంటాను’ అంటూ  జిల్లా కలెక్టర్‌ అనాథలైన ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆండగా నిలుస్తున్నారు.  కలెక్టర్‌ నాన్నగా అందరి మదిని గెలుచుకుంటున్నారు. 

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో చదువుకునే పిల్లలకు అక్కడ వసతి సదుపాయం కూడా ఉంది. ఆ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు రాధా, రాధికలు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. పదవ తరగతి పూర్తి అవుతూనే అందరు పిల్లలు వారి వారి ఇండ్లకు వెళ్లిపోయారు. ‘మేం ఎక్కడికి వెళ్లాలి?!’ ఈ ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి తమ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు.

దీంతో డీఈవో ఇద్దరు పిల్లలను తీసుకొని జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి వెళ్లారు. అక్కడ అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఈ ఇద్దరు కవలల ఆడపిల్లల స్థితి చూసి చలించిపోయారు. వారి కష్టాలు నేరుగా విని చెమ్మగిల్లిన కళ్లతో అప్పటికప్పుడే ఇద్దరి పేరున చెరొక లక్ష రూపాయలను బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. అదే సమయంలో దసరా పండుగ రావడంతో ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పారు. వెంటనే జిల్లా స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులను పిలిచి వారికి ఆశ్రయం కల్పించాలని అదేశించారు. 

విషయమేంటంటే...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలోని బంగారం పనిచేసుకుంటూ జీవించే వెంకటేశం, పార్వతిలకు రాధా, రాధికలు కవల పిల్లలు. భార్య ఆరోగ్యం సక్రమంగా ఉండకపోవడంతో ఇద్దరు ఆడపిల్లల భారం తానే మోయాల్సి వస్తుందని తండ్రి వెంకటేశం చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తల్లి వారు ఏడవ తరగతి చదువుతుండగానే ఆరోగ్యం క్షీణించి మరణించింది. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. పిల్లలు దగ్గరకు వస్తే ఆ భారం తమమీద పడుతుందనే భయంతో బంధువులు చిన్నారులను సూటిపోటి మాటలతో దూరంగా ఉంచారు.

దీంతో గ్రామస్తులు అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయుల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాలలో ఇన్నాళ్లూ చదువుకున్న పిల్లలకు దేవుడే వారి బాధ్యతను తీసుకునే నాన్నను వరంగా ఇచ్చాడు. కష్టాల కడలిలో ఉన్న ఆ ఇద్దరి జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి వారికి నాన్నయ్యాడు.  

నాటి నుండి పర్యవేక్షణ.. 
రోజూ తమ వద్దకు వచ్చే వందలాది అర్జీలను తీసుకొని పరిష్కరించి మర్చిపోతారు. కానీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మాత్రం ఈ రాధా, రాధికలను తానే దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. తనకు వీలునప్పుడల్లా ఆ పిల్లల బాగోగులను స్వయంగా పర్యవేక్షించడం లేదా వారినే తన కార్యాలయానికి, ఇంటికి పిలిపించుకొని యోగ క్షేమాలు తెలుసుకోవడం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పిల్లలకు ప్రతీ పుట్టినరోజు, పండుగలకు కొత్త బట్టలు తేవడం, ఇతర పిల్లలతో పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా పెరిగిన పిల్లలు ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
 
కలెక్టర్‌ బిడ్డలు.. 
‘మీరు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు. మీకు ఎవ్వరూ లేరనే దిగులే అవసరం లేదు. మీ నాన్న జిల్లా కలెక్టర్‌. మీకు ఏం కావాలన్నా డిమాండ్‌గా అడగచ్చు’ అని చెప్పి మరీ పిల్లలకు మనోధైర్యం కల్గిస్తున్నారు. ‘ఎక్కడా తక్కువ కాకుండా సంతోషంగా ఉండండి. బాగా చదువుకోండి. మీ చదువుల బాధ్యతే కాదు, పెళ్లిళ్లు చేసి మిమ్మల్ని ఓ ఇంటివారిని చేసే బాధ్యత కూడా తండ్రిగా నాదే’ అంటున్నారు ఈ కలెక్టర్‌. మనసున్న కలెక్టర్‌గా అందరిచేత అభినందనలు అందుకుంటున్నారు. 
– ఈరగాని భిక్షం, సాక్షి, సిద్దిపేట

నాన్నే మా ధైర్యం
అమ్మ ఆరోగ్యం బాగున్నన్ని రోజులు మాకే ఇబ్బందులు రాలేదు. తర్వాత అన్నీ కష్టాలే. ఆకలికి తట్టుకోలేక ఎన్నో రోజులు బాధలు పడ్డాం. ఇప్పుడు మాకు దేవుడే నాన్నగా వచ్చాడు. మాకే లోటు లేకుండా చూసుకుంటున్నారు. మా నాన్న కలెక్టర్‌. మా నాన్న మా ధైర్యం. మాకు స్ఫూర్తి. బాగా చదువుకొని నాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా