ఉప్పుతో కలిగే ముప్పు తెలుసుకోవాలా .. అయితే ఇది మీకోసమే!

11 Apr, 2021 21:37 IST|Sakshi

ఉప్పు రక్తపోటును పెంచుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే హైబీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఉప్పు వల్ల రక్తపోటు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. 

మనం ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కవగా తీసుకున్నప్పుడు... ఆ ఉప్పు ద్వారా సోడియం అనే మూలకం రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరుతుంది. ఇలా చేరిన ఆ సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల నరాల లోపల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోయి, రక్తపోటు పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి.

రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకు మన ఆహారపదార్థాల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచేలా తయారు చేసే బేకరీ ఐటమ్స్‌ పరిమితంగా తీసుకోవాలి. హైబీపీ ఉన్నవాళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది.  

మరిన్ని వార్తలు