నిశ్శబ్దం: ఓ అద్భుత ఆంతరంగిక వాణి

3 Oct, 2022 00:32 IST|Sakshi

మంచి మాట

ప్రకృతి మనకు అందించే శ్రవణానందకర శబ్దాలను విని ఆనందించేటందుకు,  మనలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేటందుకు, రసాస్వాదనకు ఒక ప్రశాంత స్థితి, ఒక నిర్మలత కావాలి. అది నిశ్శబ్ద వాతావరణంలోనే కుదురుతుంది. ఆ కోణంలో చూసినపుడు మన సృజనశక్తులు జాగృతమై చైతన్యవంతమయ్యే ఓ అద్భుత స్థితికి కావలసిన ఆవరణను కల్పించేదే నిశ్శబ్దమంటే.

ఒక చేతిలోని పదునైన ఉలిని ఒక కఠినమైన రాయిపై ఉంచి, మరొక చేతిలోని సుత్తితో లాఘవంగా, ఒడుపుగా తన మనసులోని అద్భుత రూపానికి జీవకళ ఉట్టిపడేటట్టుగా ఆకుంఠిత దీక్షతో శిల్పి పనిచేస్తుంటాడు. కావలసిన రంగులుంచుకున్న పళ్ళేన్ని ఒక చేతిలో, కుంచెను మరొకచేతిలో పట్టుకున్న ఓ చిత్రకారుడు తన ఊహాచిత్రానికి ఓ చక్కని రూపునిచ్చే తపోదీక్షలో ఉంటాడు. కలాన్ని తన చేతి వేళ్ళ మధ్య ఉంచుకుని ఆలోచనా క్షీరసాగరాన్ని మధనం చేస్తూ భావ సంక్లిష్టత, అస్పష్టతలనే కెరటాల గరళాన్ని అధిగమిస్తూ సాహిత్యామృతాన్ని అందించే యత్నం చేస్తుంటాడు రచయిత. ఈ సృజన ఒక నిశ్శబ్ద వాతావరణంలోనే సాధ్యమవుతుంది. నిశ్శబ్దంలో మనలోని ఏకాగ్రత, స్థిరత్వం, నిశ్చలతలు బలోపేతమవుతాయి. అపుడు మనం దృష్టి్ట కేంద్రీకరించగలుగుతాం.

ఆంగ్ల భాషలో నిశ్శబ్దానికి, మౌనానికి అర్ధభేదం లేదు. నిశ్శబ్దం అనే ఒకేరకమైన మాటను వాడతారు. కాని, తెలుగుభాషలో ఈ రెండిటికి ఎంతో తేడా ఉండటమే కాదు ఎంతో లోతైన, విస్తృతమైన అర్థంలో వాడతాం.. కొన్ని సందర్భాలలో, ప్రదేశాలలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. పాఠాలను, ప్రసంగాలను, సంగీత కచేరిలో సంగీతాన్ని  వింటున్న వేళల్లో, గ్రంథాలయం లాంటి  ప్రదేశాలలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం పాటించటంలో మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. తప్పనిసరైన నియమం. అయితే, మౌనం మనం పాటించేది.

వ్యక్తిగతం. మన ఇష్టపూర్వకంగా స్వీకరించేది. ధ్యానం ఒక నిశ్శబ్ద పయనం. మన అంతరంగమనే సాగరంలోకి వెళుతూ దాని ఘోషను వినగలిగే ఓ అద్భుత అవకాశం. ఈ మౌనం మనం నియమించుకున్న నిశ్శబ్దం ఒక ప్రశాంతమైన వాతావరణం. మన నడవడికను నెమరు వేసుకునే సందర్భం. మంచి, చెడులను తెలుసుకునేందుకు మనకై మనం పెట్టుకున్న నిబంధన. నిరంతర సుదీర్ఘ ప్రయాణం. అది మనల్ని ఉన్నతంగా ఆలోచింపచేస్తుంది మానవ దౌర్బల్యాలను, బలహీనతలను దాటగలిగే మానసిక స్థైర్యాన్ని ఈ నిశ్శబ్ద వాతావరణం మనకు ప్రసాదిస్తుంది.

మన సాహిత్యకారులు నిశ్శబ్దం తాండవిస్తోంది అని వర్ణిస్తుంటారు. శబ్దశూన్యతే నిశ్శబ్దం అయినప్పుడు నర్తిస్తున్నదనటంలో అర్థమేమిటి?  అపార్థాలతో కాపురం చేసే భార్యాభర్తల మధ్య మాటలుండవు. కాని, ఇరువురి మనసుల్లో అభివ్యక్తం కాని అనంతమైన ఆలోచనలు, భావాలు వారి మనోసంద్రపు తీరాన్ని తాకి మళ్లీ వెనకకు పోతుంటాయి. పై చెప్పిన మాటకు అర్థమిదే.
భావాలు, మనోభావాలు ఘనీభవించిన స్థితే ఇక్కడ నిశ్శబ్దమంటే.

పరపాలనలో మగ్గే ప్రజ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కూడ అధికారాన్ని, నియంత్రణను చూపుతూ, తమధన, మాన, ప్రాణాలను దోచుకునే పాలకుల దౌర్జన్యం, దోపిడీ కొంతవరకే ఓర్చుకోగలరు. వాటిని నిశ్శబ్దంగా భరిస్తుంటారు. వారి స్వాతంత్య్ర కాంక్ష అగ్నిపర్వతపు లావాలా పొగలు కక్కుతుంటుంది. ఈ నిశ్శబ్దం విస్ఫోటనమైన వేళ వచ్చే పర్యవసనం భయంకరంగా ఉంటుంది. అది బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడ ఒక అర్థవంతమైన నిశ్శబ్దం సూచిస్తుంది. అది మన మనసుకు అద్దం పడుతుంది.

నిశ్శబ్దం ఓ అద్భుతమైన శక్తి. మన అనేకమైన మిశ్రమ భావాలకు భాష్యం చెప్పగలదీ నిశ్శబ్దం. నిశ్శబ్దమిచ్చే ఏకాంతంలో, ఆలోచనలో సత్యశోధన చేయగలం. సత్యాన్ని దర్శించగలం. అందుకే నిశ్శబ్దం ఒ అద్భుత ఆంతరంగిక వాణి.

– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు.

మరిన్ని వార్తలు