ఎంతకీ తలనొప్పి తగ్గడం లేదా? 

21 Feb, 2021 00:00 IST|Sakshi

కొందరిలో తీవ్రమైన తలనొప్పి నెలల తరబడి కనిపిస్తుంది. మందులు వాడితే తగ్గుతుంది తాత్కాలికంగా.. ఆ తర్వాత మళ్లీ వేధిస్తుంటుంది. అసలు ఆ తలనొప్పి కి కారణాలేమిటో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది. కంటిచూపు సమస్యలు, చెవి, దంతాల సమస్యలు లేనప్పుడు, మెదడు లో కంతులు, ఇతర వికారాల వంటి జబ్బుల గురించి ఆయా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే కేవలం క్రియాపరమైన మార్పులే తలనొప్పికి కార ణాలవుతాయి. ఉదాహరణకు మైగ్రేన్, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మొదలైనవి. నిద్రమామూలుగా పట్టి, మళ్లీ నిద్రలేవగానే వస్తుంటే అది మానసిక ఉద్వేగం, ఆందోళనలవంటి వత్తిడులుగా భావించవచ్చు. బీపీ, షుగర్‌ వంటి వ్యాధులుంటే ముందు వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక ఒత్తిడిలో లక్షణంగా కూడా తలనొప్పి రావచ్చు. 

వత్తిడికి కారణాలు: ఆర్థిక సంబంధిత, ఉద్యోగపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన, అత్యాశతో కూడిన వాంఛలకు సంబంధించిన అంశాలుంటాయి. అప్పుడప్పుడు కొన్ని మందుల వల్ల కూడా వత్తిడి అధికమవుతుంది. వీటిని విశ్లేషించి, సహేతుకంగా దూరం చేసుకోవాలి.

రోజూ విరేచనం సాఫీగా అయ్యేట్టు చూసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం తక్కువగా ఉండే, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజాఫలాలు, గ్రీన్‌ సలాడ్స్, మొలకెత్తిన దినుసులు తీసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో తలకు మృదువుగా మర్దనా చేయాలి. నిపుణుల పర్యవేక్షణలో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స తీసుకోవడం. తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం. శ్రావ్యమైన సంగీతం, పాటలు వినడం. లేనిపోని ఆలోచనలకు దూరంగా ఉండడం... ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు