ఆఫీస్‌లో పని ఒత్తిడా..? అయితే ఇలా చేయండి

29 Oct, 2022 08:16 IST|Sakshi

ఆఫీసుల్లో పని భారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొన్ని సాధారణమైన చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.   

ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్‌ పనులకు వ్యక్తిగతమైన పనులు కూడా తోడు కావడంతో ఒక్కోసారి ఊపిరి సలపనంత పనులతో అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మన శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటో తెలుసుకుందాం.

గ్రీన్‌ టీ
ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైన ప్పుడు వెంటనే కప్పు గ్రీన్‌ టీని తాగితే మానసిక స్థితి మెరుగుపడి గందర గోళం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

సంగీతంతో సాంత్వన
సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిస్థాయులు ఎక్కువైనాయనిపించినప్పుడు వెంటనే మనసుకు నచ్చిన పాటలను వింటే సరి... ఎందుకంటే సంగీతం కోపాన్ని కూడా అదుపు చేస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. 

పజిల్‌ గేమ్స్‌
ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పని పూర్తికాకపోతే చిరాకుతోపాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల పై అధికారి పదిమందిలోనూ మీపై చిరాకు పడినప్పుడు ఒకవిధమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ  ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్‌ గేమ్స్‌ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది. 

ఇష్టమైన వారితో గడపండి 
కొందరికి సంగీతం అంటే ఆసక్తి ఉండకపోవచ్చు. పజిల్‌ గేమ్స్‌ పూర్తి చేయలేకపోవచ్చు. అయితే ఇష్టమైన వాళ్లు అందరికీ ఉంటారు. అటువంటి వాళ్లతో కొద్దిసేపు నవ్వుతూ సరదాగా గడిపితే సరి... మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది.  చివరగా ఒక విషయం ఏమిటంటే... ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలి. ఆ భారం తీర్చుకునే మార్గం ఆలోచించాలి. లేదంటే ఒత్తిడి మనల్ని ఒత్తేస్తుంది.
చదవండిGreen Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్‌ పీస్‌ అక్కీ రోటీ తయారీ

మరిన్ని వార్తలు