Paper Mache Crafts: వేస్ట్‌ పేపర్‌తో క్రాఫ్ట్స్‌.. ఎలా తయారుచేస్తారో తెలుసా?

23 Sep, 2023 12:00 IST|Sakshi

న్యూస్‌పేపర్‌ జీవితకాలం ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు పేపర్‌కున్న విలువ మరుసటి రోజుకు ఉండదు. ఏరోజుకు ఆరోజు కొత్తపేపర్‌ కావాల్సిందే. అందుకే నిన్నటి పేపర్‌ చిత్తుకాగితంగా మారిపోతుంది. ఇలా టన్నులకొద్దీ పేపర్‌ భూమిలో కలిసిపోవడం నచ్చని సిమ్రాన్‌.. కాగితాలతో పేపర్‌ మఛే క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తోంది. వేస్ట్‌ పేపర్‌ను వావ్‌ అనేలా తీర్చిదిద్దుతోంది.

ప్రయాగ్‌ రాజ్‌కు చెందిన ఇరవైఎనిమిదేళ్ల సిమ్రాన్‌ కేసర్వాణికి చిన్నప్పటి నుంచి వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడమంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సాంప్రదాయ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తుండేది. ఫ్యాషన్‌  డిగ్రీ పూర్తయ్యాక, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. తనతోటివారిలా కార్పొరేట్‌ రంగంలో అడుగుపెట్టాలనుకోలేదు. 

తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ తయారీనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా సృజనాత్మకంగా చేయాలని ఆలోచిస్తోన్న సిమ్రాన్‌కు.. చిన్నతనంలో చేసిన ‘టోఫీ బాక్స్‌’ గుర్తుకువచ్చింది. సిమ్రాన్‌ పుట్టినరోజుకి టోపీ బాక్స్‌లు తయారు చేసి పంచింది. ఆ బాక్స్‌లు చూసిన వారంతా సిమ్రాన్‌ ప్రతిభను చూసి తెగ మెచ్చుకున్నారు. దీంతో ‘పేపర్‌మఛే క్రాఫ్ట్స్‌’ తయారు చేయడం ప్రారంభించింది. 

పేపర్‌ను పేస్టుచేసి..
పురాతన కాలం నుంచి మఛే క్రాఫ్ట్స్‌కు మంచి గుర్తింపు ఉంది. పేపర్‌ను నానబెట్టి, తరువాత పేస్టులా నూరి వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. దీనినే పేపర్‌ మఛే క్రాఫ్ట్స్‌ అంటారు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవన్న భరోసాతో సిమ్రాన్‌ వీటిని ఎంచుకుంది. కస్టమర్ల దృష్టిని ఆకర్షించే విధంగా వివిధ ఆకారాల్లో ఈ క్రాఫ్ట్స్‌ తయారు చేయడం మొదలు పెట్టింది సిమ్రాన్‌. పేపర్‌ వెయిట్స్, ఫోల్డర్స్, చెరియాళ్‌ మాస్క్‌లు, ఆకర్షణీయమైన వివిధరకాల ఇంటి అలంకరణ వస్తువులను తయారు చేస్తోంది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా అందంగా తయారు చేసేందుకు స్థానిక కళాకారుల వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. 

అడ్డంకులు అధిగమించి...
‘‘పేపర్‌ మఛే క్రాఫ్ట్స్‌ తయారీ సర్టిఫైడ్‌ జాబ్‌ కాదు. దీనికి పెద్ద గుర్తింపు ఉండదు. నువ్వు ఇంజినీరింగ్‌ లేదా మెడిసిన్‌ చదువు’’ అని తల్లిదండ్రులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తనని తాను నిరూపించుకోవాలన్న కసితో క్రాఫ్ట్స్‌ తయారీని ప్రారంభించింది సిమ్రాన్‌. అయితే సాంప్రదాయ కళాకృతుల గురించి అవగాహన తక్కువ ఉండడం, మార్కెట్‌ కొత్త కావడంతో సిమ్రాన్‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి.

తనకెదురయ్యే ప్రతి వాళ్ల నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ.. సోషల్‌ మీడియా స్కిల్స్‌తో తన ఉత్పత్తులకు మార్కెట్‌ చేస్తోంది. వివిధరకాల ఎగ్జిబిషన్‌లలో పేపర్‌ మఛే క్రాఫ్ట్స్‌ను ప్రదర్శిస్తూ కస్టమర్లకు సరికొత్త అలంకరణ వస్తువులను పరిచయం చేస్తోంది. మద్దారీ మీటర్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా కూడా మఛే క్రాఫ్ట్స్‌ను విక్రయిస్తోంది సిమ్రాన్‌. 
 

మరిన్ని వార్తలు