బాలూ–లతా కాంబినేషన్‌ సూపర్‌హిట్‌

28 Sep, 2020 08:18 IST|Sakshi
‘ఏక్‌ దూజే కే లియే’ చిత్రంలో దృశ్యం, లతా మంగేష్కర్‌

కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అతను తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. లతా మంగేష్కర్‌ పక్కన పాడి హిట్టయిన దక్షణాది గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. వారి మధ్య అనుబంధం, వారి పాటలు, బాలూ చనిపోయాక ఆయన గురించి  లతా చెప్పిన విశేషాలు లతా జన్మదినం సందర్భంగా...

లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్‌ ఆమెను ఉర్దూ నేర్చుకోమన్నారు. తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఉర్దూ భాష తెలిసినవారు కూడా ఒక్కోసారి ‘జరూరీ’ (jaroori)అంటారు. కాని బాలూ పాడితే సరైన ఉచ్ఛారణతో zaroori అంటాడు. ఉర్దూ పదాలు ‘ఖైర్‌’, ‘ఖయాల్‌’, ‘సమజ్‌దార్‌’ వంటివి కూడా వాటి సరైన ఉచ్ఛారణతో బాలూ పాడటం సంగీతాభిమానులకు తెలుసు. అందుకే ఆయన లతా మంగేష్కర్‌కు ఇష్టమైన గాయకుడయ్యారు. గొప్పపాటలు పాడగలిగారు.

నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా  ‘ఏక్‌ దూజే కే లియే’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంటున్న బాలు
లతా మంగేష్కర్‌కు అందరు గాయకులతో పాడటం అంత సౌకర్యంగా ఉండదు. ఆమె గోల్డెన్‌ పిరియడ్‌ అంతా రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండ గాయకులతో గడిచింది. ఆమె తెలుగులో ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కాని బాల సుబ్రహ్మణ్యం అదృష్టం వేరు. బాలూ–లతా కాంబినేషన్‌ సూపర్‌హిట్‌. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు.

తెలుగులో హిట్‌ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్‌ హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’ (1981)గా రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్‌ కోరారు. దీనికి లతా మంగేష్కర్‌ అభ్యంతరం చెప్పలేదు కాని లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ కొంత నసిగారు. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్‌ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్‌. ఇక లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌లకు తప్పలేదు. కాని ఆశ్చర్యకరంగా బాలూతో పని చేయడం మొదలెట్టాక వారు ఆయన మోహంలో పడిపోయారు. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు. లతా మంగేశ్కర్‌ కూడా ‘బాలూ ఒక ప్రత్యేక గాయకుడు’ అని మెచ్చుకున్నారు. 

‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హటాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్‌ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్‌ కన్సర్ట్‌లలో పాల్గొన్నాను. స్టేజ్‌ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’ అన్నారు లతా బాలూ మరణవార్త విని. 

‘ఏక్‌ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్‌ మే’ పాట డ్యూయెట్‌గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్‌ బనే తుమ్‌ బనే’, ‘హమ్‌ తుమ్‌ దోనో జబ్‌ మిల్‌ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్‌. ఈ సినిమాకు బాలూకి నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. ఆ తర్వాత రమేష్‌ సిప్పీ తీసిన ‘సాగర్‌’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్‌ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్‌ ‘మైనే ప్యార్‌ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్‌ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది.

కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్‌ దీవానా’, ‘ఆజా షామ్‌ హోనే ఆయీ’, ‘కబూతర్‌ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్‌ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్‌ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్‌ కా జాదు హై మిత్‌వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి.

‘ఈ సినిమాలో పాట రికార్డింగ్‌ కోసం లతా పాడుతూ ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ అనగానే నేను తర్వాతి లైన్‌ పాడకుండా ‘మై ఆప్‌ కా బేటా హూ’ అని అనేవాణ్ణి. ఆమె పాడటం ఆపేసి– చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’ అని ముద్దుగా కోప్పడేవారు’ అని బాలూ ఒక సందర్భంలో చెప్పారు. ‘బాలూని నేను చాలాసార్లు రికార్డింగ్‌ థియేటర్లలోనే కలిశాను. కాని ఒకటి రెండుసార్లు ఆయన మా ఇంటికి వచ్చి నాకు బహుమతులు తెచ్చారు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఆయనను నేను బాలాజీ అని పిలిచేదాన్ని’ అని లతా అన్నారు.

లతా చనిపోయారనే పుకార్లు ఇటీవల వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ బాలూ వీడియో విడుదల చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణవార్త లతా వినాల్సి వచ్చింది. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతా చాలా కంగారు పడటం గురించి బాలూ చెప్పుకునేవారు. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్‌ వచ్చారు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్‌ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్‌ డ్యూయెట్‌ పాడారు. ఇవన్నీ ఇప్పుడు లతాకు మిగిలిన బరువైన గుర్తులు. లేదా మధుర జ్ఞాపకాలు.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా