జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం

13 Dec, 2020 02:43 IST|Sakshi
యూడిలింగ్‌ పాటకు సాధించిన గోల్డెన్‌ మైక్‌తో షణ్ముఖప్రియ, ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లో పాడుతున్న షణ్ముఖప్రియ

దాదాపు పదేళ్ల క్రితం ‘జీ తెలుగు’లో వచ్చిన లిటిల్‌ చాంప్స్‌ కార్యక్రమం గుర్తుందా? అయితే మీకు తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖ ప్రియ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చిన్నారి గాయనిగా శ్రోతలను ఆకట్టుకున్న షణ్ముఖ ప్రియ కొంతకాలం పాటు టీవీషోలకు దూరంగా ఉంది. ఇప్పుడు వర్ధమాన గాయనిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు,  ఏకంగా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 లో గోల్డెన్‌మైక్‌ సాధించి థియేటర్‌ రౌండ్‌కు చేరుకుంది. అంతర్జాతీయ సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌ స్వయంగా ఆమెను ‘జాజ్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అని ప్రశంసించారంటే ఆమె గాత్ర మాధుర్యాన్ని. అందులోని విలక్షణతను అర్థం చేసుకోవచ్చు.

నవంబర్‌ 28వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 12వ సీజన్‌ లో ఇప్పటికే సోనీ టీవీ తన ప్రచార మాధ్యమాల ద్వారా ఈమె పాడిన పాటను ప్రోమోగా విడుదల చేసింది. ఈ వీడియోకు లక్షలాది మంది ప్రేక్షకాదరణ లభించింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పుట్టి, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పెరిగి, విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న పాటల ప్రియ జాతీయ స్థాయిలో తన గాత్ర మాధుర్యాన్ని అందరికీ రుచి చూపిస్తున్న షణ్ముఖ ప్రియను 12వ సీజన్‌ ఆడిషన్‌లో భాగంగా కలిసిన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ.

సాక్షి: ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌12లో పాడతానని ఊహించారా ?
షణ్ముఖప్రియ : చిన్నప్పటి నుంచి ఇండియన్‌ ఐడల్‌  షోలో పాల్గొనాలని కోరిక ఉండేది. అనుకున్నట్టుగానే ఎంపికయ్యాను. ఈ సీజన్‌ 12 సెలక్షన్లకు ఆన్‌లైన్‌ ద్వారా కొన్ని వేల మంది హాజరయ్యారు.వారిలో 350మంది ఎంపిక చేసి పరిక్షించగా టాప్‌ 14లో నేను చోటు సంపాదించాను.

సాక్షి: ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌లో గెలుపొందగలరని విశ్వాసం ఉందా?
తప్పనిసరిగా... నాకు ఆ నమ్మకం ఉంది. న్యాయ నిర్ణేతల మెప్పు పొంది ముందుకెళ్తాను. ఇండియన్‌ ఐడల్‌లో ప్రముఖ గాయకుడు కిశోర్‌ కుమార్‌ ఆలపించిన జోమ్రు యూడిలింగ్‌ పాటను ఆలపించాను. అంతేకాకుండా మధ్యలో ఒక ఆడిషన్‌ను జంప్‌ చేసి థియేటర్‌ ఆడిషన్‌కు నేరుగా నన్ను పంపించారు.

సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు?
 తల్లిదండ్రులే నాకు స్పూర్తి. మా తల్లిదండ్రులు శాస్త్రీయ సంగీతంలో ఎం.ఎ. పట్టాలు పొందారు. వారే నా తొలి గురువులు.  


బాలసుబ్రహ్మణ్యంతో, జానకితో...

సాక్షి: మీ విజయం వెనక మీ తలిదండ్రుల కృషి ఏమైనా?
మూడేళ్ల వయస్సులో నా ఆసక్తిని గుర్తించారు. అప్పటినుంచి నాకోసం మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వారి వద్దనే సంగీతం నేర్చుకున్నాను. ఎన్నో వ్యయప్రయాసలు భరించి మరీ నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు.

సాక్షి: గాయనిగా సాధించిన విజయాలు..?
కర్ణాటక, కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన ‘సూపర్‌స్టార్‌ సింగర్‌’ పోటీలో టైటిల్‌ పొందాను. జీ తెలుగు సరిగమ లిటిల్‌ ఛాంప్స్‌ 2008 విజేతగా నిలిచాను. మా టీవీ సూపర్‌ సింగర్‌ 2009లో ఫైనల్‌కు చేరుకున్నాను. స్టార్‌ విజయ్‌ తమిళ జూనియర్‌ సూపర్‌ స్టార్స్‌ 2010పోటీల్లో విన్నర్‌గా నిలిచాను. 2013లో ఈటీవీ పాడుతా తీయగా పోటీలో ఫైనల్‌కు వచ్చాను. 2015లో మాటీవీ సూపర్‌ సింగర్‌ పోటీల్లో విజేతగా నిలబడ్డాను. జీ టీవీ హిందీ సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ 2017లో రన్నర్‌గా నిలిచాను. తమిళ సూపర్‌ సింగర్‌ జూనియర్‌ 3, స్టార్‌ ఆఫ్‌ ఏపీ, సరిగమప నువ్వానేనా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాను.

సాక్షి: మీకు గుర్తింపు ఇచ్చిన పాటలేంటి?
తమిళంలో ఇంజీఖరుపడగా... (సన్న జాజీ..), ఇందమిసీమినిక్‌ (ఈ ఎర్ర గులాబీ), కాదళ్‌ అనుగళి(రోబో), ‘పాడుతా తీయగా’లో ‘గోపమ్మ చేతిలో గోరుముద్ద...’ ‘నిదురపోరా తమ్ముడు...’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ తదితర పాటలతో పాటు గులాం అలీ గజల్స్‌ ఉన్నాయి. ‘చాంగురే బంగారు రాజా...’ వంటి జానపద గీతాలు కూడా అప్పట్లో నాకు మంచి పేరు తెచ్చాయి.


తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్‌కుమార్‌తో షణ్ముఖప్రియ

సాక్షి: ప్రముఖుల ప్రశంసలు
షణ్ముఖప్రియ: ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర పాడాను. నా పాటను మెచ్చి జాజ్‌ స్టార్‌గా ఎదుగుతావని మెచ్చుకున్నారు. మాజీ తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్శకరత్న దాసరి నారాయణరావుతో పాటు చాలా మంది ప్రముఖులు అభినందించారు. ప్రముఖ గాయకులు ఆశాబోస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్‌.జానకీ, చిత్ర, మాల్గాడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్‌ తదితరులు ఆశీర్వదించారు.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ముందు ‘పాడుతా తీయగా’లో ‘వీణ వేణువైన..’ పాటతో ప్రస్థానం ప్రారంభించాను. ఆయనెన్నో సలహాలు ఇచ్చారు. ఇప్పుడాయన ఉంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. మరాఠీలో సోను నిగమ్‌తో కలిసి డ్యూయట్‌ పాడాను.

సాక్షి: మీ లక్ష్యమేంటి?
అటు చదువులోనూ, ఇటు గాయనిగానూ ఎదగాలనుకుంటున్నాను. నేపథ్యగాయని కావడడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా ముందున్న లక్ష్యం.

సాక్షి: గాయనిగా వచ్చిన గుర్తింపు మీకు ఏవిధంగా తోడ్పడుతోంది?
వర్థమాన గాయనిగా రాణిస్తూనే, మరోవైపు చదువులో మంచి మార్కులు సాధించుకుని లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగిపోతున్నాను. ఇంటర్‌ మొదటి సంవత్పరంలో 9.1, రెండో సంవత్సరంలో 9.7మార్కులు సాధించాను. బీఎస్సీ గణితం చదువుతూ ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాను. నా ప్రతిభను గుర్తించిన శ్రీ చైతన్య యాజమాన్యం నాకు ఉచితంగా చదువు చెబుతోంది. ఈ వయసులో అంతకన్నా మించి నాకు ఏం కావాలంటారు?

సాక్షి: ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది?
ఏ రియాలటీ షోలో పాల్గొన్నా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. నువ్వు బాగా పాడితే చాలు– మిగతాది మేము చూసుకుంటామంటూ వందల సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి.  అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. అభినందనలు అందుతున్నాయి. అందరికీ సాక్షి వేదికగా నా ధన్యవాదాలు.
– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం 

మరిన్ని వార్తలు