ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే..

10 Oct, 2021 14:24 IST|Sakshi

ఐదునదుల పంజాబ్‌లో ఆ ఒక్కరోజు ఆరోనది కనిపించింది. అది నెత్తుటినది. 1919 ఏప్రిల్‌ 13న జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దురంతంతో ఆనాడు అమృత్‌సర్‌ రక్తపుటేరునే చూసింది. సంవత్సరాది (వైశాఖి) పండగ జరుపుకోవడానికి వచ్చి, ఆ మైదానంలో కూర్చున్న దాదాపు ఇరవైవేల మంది నిరాయుధుల మీద 1650 తూటాలు పేలాయి. స్వాతంత్య్రోద్యమం మలుపు తిరిగింది. 

ఆ దురంతంలో జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌ కంటే పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మైఖేల్‌ ఫ్రాన్సిస్‌ ఓడ్వయ్యర్‌(1912–19) పెద్ద దోషి అని ప్రముఖ చరిత్రకారుడు కేకే ఖుల్లర్‌ అంటారు. అదో విడి ఘటన కాదు. ముందూ వెనుకా కుట్రలు ఉన్న గొలుసుకట్టు ఘటనలకు పరాకాష్ట. జనరల్‌ డయ్యర్‌ ఎక్కుపెట్టించిన ఆ 90 తుపాకులకు అందిన ఆదేశం వెనుక ఓడ్వయ్యర్‌ జాత్యహంకారం ఉంది. లాలా లాజ్‌పతిరాయ్‌ 1920 ఫిబ్రవరిలో అమెరికా నుంచి వచ్చి వాస్తవాలు సేకరించారు. 12 అంశాలతో ఆరోపణల పత్రం తయారు చేశారు. ఓడ్వయ్యర్‌ ఆత్మకథ ‘ఇండియా యాజ్‌ ఐ న్యూ ఇట్‌’ కూడా ఆ క్రమాన్ని వర్ణించింది. నిజానికి పంజాబీలకు ‘గుణపాఠం’ చెప్పాలన్న అతడి ఆలోచన మూడేళ్ల నాటిది. 

మొదటి ప్రపంచ యుద్ధం కోసం పంజాబ్‌ నుంచి ఎక్కువమంది యువకులను ఓడ్వయ్యర్‌ సైన్యంలో చేర్పించాడు. 1914 ఆగస్ట్‌ నుంచి డిసెంబర్‌ వరకు భారత్‌లో 27,522 మంది సైన్యంలో చేరితే అందులో 13,400 మంది పంజాబీలు. గ్రేట్‌వార్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కాలమే ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టడానికి అనువైనదని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గదర్‌ పార్టీ భావించింది. ఆ పార్టీలో ఎక్కువ మంది పంజాబీలే. అప్పుడే ఇండోజర్మన్‌ ప్రణాళిక బయటపడింది. అంటే ఇంగ్లండ్‌ను భారత్‌ నుంచి తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ తీవ్ర జాతీయవాదులకు జర్మన్‌ అండగా ఉండాలన్న యోజన. గదర్‌ వీరులకు ఐరిష్‌ ఉగ్రవాదులు అండగా ఉన్నారన్న వార్తలూ వచ్చాయి. అందుకే తీవ్ర జాతీయవాదాన్నీ, స్వాతంత్యోద్య్రమాలనూ ఎంత క్రూరంగా అణచివేసినది దాదాపు 485 పేజీల ఆత్మకథలో ఓడ్వయ్యర్‌ చాలా రాశాడు. 

సిక్కులు–గదర్‌ పార్టీ మధ్య బంధాన్ని చెప్పడానికి అధ్యాయమే (17)  కేటాయించాడు (ఈ పుస్తకంలో మనకి ఆసక్తి కలిగించేది 8వ అధ్యాయం ‘హైదరాబాద్‌ డెక్కన్‌ 1907 – 09’. ఆ కాలంలో ఓడ్వయ్యర్‌ నిజాం సంస్థానంలో బ్రిటిష్‌ రెసిడెంట్‌). హోంరూల్‌ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో 1916 ఏప్రిల్‌లో పంజాబ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను ఓడ్వయ్యర్, ‘అనీబిసెంట్, తిలక్, బిపిన్‌చంద్ర పాల్‌ పంజాబ్‌లో ప్రవేశిస్తే చల్లారిపోతున్న తీవ్ర జాతీయవాదోద్యమ జ్వాల మళ్లీ ఎగసిపడుతుంద’ని హెచ్చరించాడు. వారు పంజాబ్‌లోకి రాకుండా బహిష్కరించాడు. పంజాబ్‌లోనే కాదు, భారత్‌ అంతటా ఉద్రిక్త వాతావరణమే. దీనికి భయపడిన ఫలితమే రౌలట్‌ బిల్లు. భాతీయుల నిరసనల మధ్య 1919 మార్చి 18న చట్టమైంది.  

మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ పతనంతో ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారనీ, ‘హిందూ తీవ్రవాదులు’ ఈజిప్ట్, సిరియా, ఇరాక్‌ బాటలో ‘స్వయం నిర్ణయాధికారం’ కోరుతున్నారనీ ఓడ్వయ్యర్‌ అంటాడు. ఈ రెండు కారణాలు ఆ రెండు మతాలవాళ్లని ఇంగ్లిష్‌ పాలనకి వ్యతిరేకంగా ఐక్యం చేశాయనీ తేల్చాడు. ఈ ‘అపవిత్ర’ బంధం అమృత్‌సర్‌లో బాగా కనిపించిందని కూడా విశ్లేషించాడు. ఇందుకు ప్రతినిధులుగా జర్మనీలో చదువుకుని వచ్చిన ‘కశ్మీరీ ముస్లిం’ న్యాయవాది సైఫుద్దీన్‌ కిచ్లూ, ‘హిందూ సర్జన్‌’ డాక్టర్‌ సత్యపాల్‌లను చూపాడు. వీళ్లిద్దరూ హింసామార్గంలో ఆందోళన ఆరంభించారని అరోపించాడు.   

రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా మార్చి 30న హర్తాల్‌ పాటించవలసిందిగా గాంధీజీ పిలుపునిచ్చారు. ఉత్తర భారతం, పంజాబ్‌ ప్రాంతంలో లాహోర్, గుజ్రన్‌వాలా, షేక్‌పురా, ముల్తాన్, జలంధర్, కాసూర్, అమృత్‌సర్‌లు భగ్గుమన్నాయి. ఉత్తర భారతంలో కొన్ని రైల్వే స్టేషన్లు దగ్ధమైనాయి. ఇంగ్లిష్‌ వాళ్ల మీద దాడులు జరిగాయి. ఉత్తర భారత తీవ్ర జాతీయవాదులంతా పంజాబ్‌ మీద దృష్టి సారించారంటాడు ఓడ్వయ్యర్‌. ‘ఏప్రిల్‌ 6న లాహోర్‌లో పెద్ద విప్లవం (గదర్‌) వస్తుంది. అదే మా జాతీయ దినోత్సవం. ఇంగ్లిష్‌ వాళ్ల అధికారం పతనమయ్యే రోజు అదే’ అంటూ పత్రికలలో రాశారని కూడా అంటాడు. 

మళ్లీ ఏప్రిల్‌ 6న మరొక హర్తాల్‌కు గాంధీజీ పిలుపునిచ్చారు. ఇదే జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నాంది. ఏప్రిల్‌ 6,7 తేదీలలో గాంధీజీ ఢిల్లీ నుంచి పంజాబ్‌ వస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఓడ్వయ్యర్‌ నిషేధాజ్ఞలు విధించాడు. భారత ప్రభుత్వం కూడా గాంధీజీ కదలికల మీద ఆంక్షలు పెట్టింది. 9వ తేదీన పంజాబ్‌ ప్రావిన్స్‌ సరిహద్దులలో పల్వాల్‌ దగ్గర అరెస్టు చేసి, నిషేధాజ్ఞల ఆదేశాలు అందించారు. గాంధీజీ అక్కడ నుంచే బొంబాయి వెళ్లిపోవడానికి అంగీకరించారు. బర్మా పంపేయాలని సూచించాడు ఓడ్వయ్యర్‌.

 ఏప్రిల్‌ 9న శ్రీరామనవమి. పైకి ప్రశాంతంగా ఉన్నా, కిచ్లూ, సత్యపాల్‌లను వెంటనే అరెస్టు చేయమని ఆరోజే అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ మైల్స్‌ ఇర్వింగ్‌ను ఓడ్వయ్యర్‌ ఆదేశించాడు. 10వ తేదీన ఆ ఇద్దరినీ ఇంటికి పిలిచి అరెస్టు చేసి, ధర్మశాల అనే చోటకు చేర్చాడతడు (ఈ సంగతిని హంటర్‌ కమిషన్‌ ఎదుట చెప్పాడు). వీరిని విడుదల చేయాలని డిప్యూటీ కమిషనర్‌ ఇంటి ముందు జనం ఆందోళనకు దిగారు. కాల్పులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. ఆవేశంతో జనం రాళ్లు విసిరారు. రోడ్డు మీద ఏ యూరోపియన్‌ కనిపించినా చావగొట్టారు. 

ఆ మరునాడే మార్సెల్లా షేర్వుడ్‌ అనే ఆంగ్ల మహిళ మీద దాడి జరిగింది (19న ఆమెను కలుసుకున్న తరువాత ఆ దాడి జరిగిన వీధి కూచా కురిచాహన్‌ గుండా వెళ్లే ప్రతి భారతీయుడిని నేలమీద పాములా పాకించారు సైనికులు. ఒక పెళ్లి బృందం, ఒక అంధుడు, గర్భవతి కూడా ఆ ‘శిక్ష’ అనుభవించారు. డయ్యర్‌ పంజాబ్‌ రక్షకుడని షేర్వుడ్‌ కీర్తించారు). ఒక బ్యాంక్‌ మీద ఆందోళనకారులు దాడి చేసి ఐదుగురు యూరోపియన్లను చంపారు. 9వ తేదీన అమృత్‌సర్‌ రైల్వేస్టేషన్‌ రక్షణ కోసం జలంధర్‌ నుంచి బ్రిగేడియర్‌ జనరల్‌ డయ్యర్‌ తన దళాలతో వచ్చాడు. ఇతడికి అన్ని బాధ్యతలు అప్పగించి ఓడ్వయ్యర్‌ లాహోర్‌ వెళ్లిపోయాడు. 

13వ తేదీ సూర్యాస్తమయం నాటి ఆ దుర్ఘటనలో 379 మంది మరణించారనీ, 1,137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటించింది. సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ సభ్యుడు విఎన్‌ తైవ్‌రాజ్‌ ఆ సంఖ్యను 530 అని చెప్పాడు. ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో ఈ విషయం లేవనెత్తిన మాలవీయ మృతులు 1000 మంది అని చెప్పాడు. ఆర్య సమాజ్‌ ప్రముఖుడు స్వామి శ్రద్ధానంద 1500 మంది అని చెప్పాడు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. అందుకే చాలామంది వైద్యం అందక చనిపోయారు. 

ఆ మరునాడు కూడా  గుజ్రన్‌వాలా, ఇంకొన్ని పట్టణాల మీద ఏరోప్లేన్‌ల ద్వారా బాంబులు కురిపించాడు ఓడ్వయ్యర్‌. 14వ తేదీ తెల్లవారుజామున కాల్పుల వార్త ఓడ్వయ్యర్‌కు లాహోర్‌లోనే అందింది. దేశ ప్రజలకు నెలా పదిహేను రోజుల తరువాత తెలిసింది. ఆంధ్రపత్రిక జూలై 12 డేట్‌లైన్‌తో ప్రచురించింది. అట్లాంటి ఓడ్వయ్యర్‌ మీద కాల్పులు జరపడానికి 21 ఏళ్లు ఎదురుచూశాడు ఒక యువకుడు. పేరు ఉద్దమ్‌సింగ్‌. 
- డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు