కరోనా వచ్చిన తర్వాత నిద్రలేమా?.. ఇలా చేయండి!

22 Aug, 2021 08:09 IST|Sakshi

కరోనాసామ్నియా

నిద్ర మీద కరోనా దెబ్బ గట్టిగానే పడింది. అది దేహంలోని అన్ని కీలకమైన అవయవాలతో పాటు నిద్రపైనా ప్రభావం చూపింది. ‘కరోనాసామ్నియా’గా పిలిచే దీని ప్రభావం ఎలా ఉందో చూద్దాం... 

కరోనా వైరస్‌ సోకడం మొదలైన తొలిరోజుల నుంచి నేటివరకు అది అందరినీ ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా మనం భయాందోళనలకూ, తీవ్రమైన ఉద్వేగానికీ లోనైనప్పుడు దాని ప్రభావం నిద్ర మీద పడుతుంది. నిద్ర అనేది మన సాధారణ ఆరోగ్యానికీ, వ్యాధి నిరోధకత సక్రమంగా పనిచేయడానికి అవసరమన్నది తెలిసిన విషయమే. కరోనా సోకి కోలుకున్న కొందరిలో నిద్ర పట్టడం ఓ సమస్యగా మారిపోయింది. ఫలితంగా అంతరాయాలతో కూడిన కొద్దిపాటి నిద్ర లేదా నిద్రలేమి  పీడిస్తోంది. 

ఓ పక్క కరోనాసామ్నియాతో నిద్రలేమి. దాని కారణంగా రాత్రంతా మెలకువతో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రిపూట సమయం గడిపేందుకు చాలామంది తమ మొబైల్స్‌ లేదా కంప్యూటర్‌లను ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో ఓటీటీ ద్వారా సినిమాలు చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారు. 

  • స్క్రీన్‌ ముందు గడిపే సమయం పెరగడంతో ‘ఎక్సెస్‌ స్క్రీన్‌ టైమ్‌’తో వచ్చే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 
  • ఫలితంగా వృత్తి నిర్వహించే ప్రదేశాల్లో, ఆఫీసుల్లోనూ, ఇతరత్రా ఉపాధి / సంపాదన పొందే చోట్ల తగినంత సామర్థ్యం చూపలేక పనిలో నాణ్యత కుంటుపడుతోంది. దాంతో ‘వర్క్‌ రిలేటెడ్‌ స్ట్రెస్‌’ పెరుగుతోంది. 
  • పై అంశాల కారణంగా మనో వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్‌) వంటివి కనిపిస్తున్నాయి. ఆ  మానసికమైన సమస్యలు... వ్యక్తుల్లో తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతగానో నిద్రవస్తున్నట్లు అనిపించడం లేదా ఏ పనీ చేయలేనంత తీవ్రమైన అలసట కలగడం చాలా సాధారణం. దీన్నే ‘స్ట్రెస్‌ రిలేటెడ్‌ ఫెటీగ్‌’ అంటారు. 

నిద్ర ఎందుకంత ప్రధానం అంటే...

  • నిద్ర అన్నది ఓ జీవసంబంధమైన (బయలాజికల్‌) ప్రక్రియ. ఇది శారీరక, మానసిక పరిస్థితులతో పాటు ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. 
  • మన వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలు మంచి నిద్రపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కంటి నిండా నిద్రపోయే వారిలోనే ‘వ్యాధితో పోరాడే శక్తి’ (డిఫెన్స్‌ మెకానిజమ్‌) చాలా సమర్థంగా ఉంటుంది. (మనం ఇచ్చే వ్యాక్సిన్‌లు కూడా మంచి నిద్ర ఉన్నవారిలోనే సమర్థంగా పనిచేస్తాయన్న విషయం కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది). 
  • మన మెదడు సమర్థంగా పనిచేయడానికి కూడా మంచి నిద్ర అవసరం. ఎందుకంటే... మన ఆలోచనా విధానాలు, నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, మనోభావాలు, చిరాకులు... ఇవన్నీ నిద్రపైనే ఆధారపడి ఉంటాయి. 
  • నిద్రలేమి కారణంగా వచ్చే డిప్రెషన్, యాంగ్సైటీ డిజార్డర్స్, బైపోలార్‌ డిజార్డర్, పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ) వంటి అదనపు మానసిక సమస్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. 
  • నిద్రలేమి కారణంగా కొందరు పొగాకు, వాటి ఇతర ఉత్పాదనలు, ఆల్కహాల్‌ వంటి వాటిని ఆశ్రయించడం ఇటు వ్యక్తిగత ఆరోగ్యానికీ, అటు సామాజిక సమస్యలకూ కారణమవుతోంది. 


కరోనా తగ్గాక నిద్రలేమితో వచ్చే సమస్యల్లో కొన్ని... 

  • బాధితుల దైనందిన వ్యవహారాల్లో క్రమబద్ధత లోపించడం. 
  • అన్ని టైమింగులూ దెబ్బతినడం (ఉదాహరణకు ఆఫీసులకు వెళ్లడం, అనేక సామాజిక కార్యకలాపాలకు హాజరుకావడం వంటివి). 
  • రాత్రి వేళ నిద్రలేమి...పగటివేళల్లో మందకొడితనం. 
  • నిద్రను ఆయా వేళల్లో నియంత్రించే ‘సర్కాడియన్‌ రిథమ్‌’ దెబ్బతినడం. 
  • కొన్ని అంశాలు నిద్ర సక్రమంగా పట్టేలా చూస్తాయి. వాటిని ‘జెయిట్‌గెబర్స్‌’ అంటారు (ఉదాహరణకు రాత్రి నిద్రవేళ వెలుగు చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు ఒకింత తక్కువగా నిద్రకు అనువుగా ఉండటం). జెయిట్‌గెబర్స్‌కూ, నిద్రను కల్పించే సర్కాడియన్‌ రిథమ్‌కూ సమన్వయం లోపించింది. ఇది మరిన్ని నిద్ర సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతోంది. 
  • ఈ సమగ్ర ప్రభావాల కారణంగా పనిగంటలు తగ్గుతున్నాయి. ఒకపక్క కోవిడ్‌ కారణంగా అసలే వృత్తులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఇప్పుడీ ‘కరోనోసామ్నియా’ ఓ రుగ్మతలా ఉన్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలనూ దెబ్బతీస్తోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. 


ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని సూచనలు...

  • నిద్ర పట్టినా లేకపోయినా... రోజూ మీ నిర్ణీతమైన నిద్రవేళకు పక్క మీదికి చేరండి. 
  • పక్క మీదికి వెళ్లే సమయానికి ఎలాంటి మానసిక ఒత్తిడీ లేకుండా జాగ్రత్తపడండి. 
  • సరిగ్గా నిద్రసమయానికి బాగా కడుపునిండుగా ఉండేలా భోజనం చేయకండి. రాత్రి ఒకింత తేలికపాటి ఆహారమే మేలు. రాత్రి భోజనానికీ, నిద్రకూ కాస్తంత వ్యవధి ఉండేలా జాగ్రత్తపడండి. 
  • నిద్రకు ముందర శరీరానికి ఒకింత ఎక్కువ శ్రమ కలిగించే ఎలాంటి వ్యాయామాలూ చేయకండి. నిద్రవేళకు చాలా ముందుగా తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయండి. 
  • ఒకసారి పడక మీదకు చేరాక ఎంతగా నిద్రపట్టకపోయినా మొబైల్, కంప్యూటర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి. 
  • మీ పడకగదిలోకి ఆఫీసు పనిని తీసుకురాకండి. 
  • ఎంతకీ నిద్రపట్టకపోతే రిలాక్సేషన్‌ ప్రక్రియలైన యోగా, ధ్యానం వంటి వాటిని చేయండి. 
  • ఇవన్నీ ఆచరించాక కూడా నిద్ర పట్టకపోయినా  నిద్రమాత్రలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు. మీ డాక్టర్‌ను తప్పక సంప్రదించండి. 

. డాక్టర్‌ రమణ ప్రసాద్‌
స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ పల్మనాలజిస్ట్‌

చదవండి : పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి

మరిన్ని వార్తలు