భార్య ఫోన్‌ హ్యాక్ చేసిన భర్త‌.. భార్య ఏం చేసిందంటే..!

22 Apr, 2021 00:33 IST|Sakshi

సోబర్‌ క్రైమ్‌

చైత్ర (పేరు మార్చడమైనది), వర్ధన్‌(పేరు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. పెళ్లై ఎనిమిదేళ్లు. ఇద్దరి జీతాలు నెలకు చెరో లక్ష రూపాయలకు పైనే. ఆరేళ్ల కూతురు. చింతల్లేని చిన్నకుటుంబం. అర్ధరాత్రి దాటింది. ల్యాప్‌ట్యాప్‌ మూసేసి బెడ్‌ మీద వాలింది చైత్ర. నోటిఫికేషన్‌ ఏదో వచ్చినట్టు ఫోన్‌లో ‘బీప్‌’ మని సౌండ్‌ వచ్చింది. ఫోన్‌ చేతిలోకి తీసుకుంది చైత్ర. మెసేజ్‌ చూడగానే పెదాల మీదకు యధాలాపంగా నవ్వు వచ్చింది.

ఆ పక్కనే ఉన్న వర్ధన్‌  కూడా ఫోన్‌లోనే ఉన్నాడు. చైత్రను ఒకసారి చూసి, లైట్‌ ఆఫ్‌ చేసి, తన ఫోన్‌ పక్కన పెట్టి, పడుకున్నాడు. చైత్ర మరో అరగంట వరకు ఉండి తనూ పడుకుంది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లేవారు. లాక్‌డౌన్‌ పుణ్యమా అని వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఇద్దరూ ఇంటినుంచే వర్క్‌ చేస్తున్నారు.
  
ఓ రోజు చైత్ర ఇంటి నుంచి బయటకు వచ్చేసి, విడాకులు ఫైల్‌ చేసింది. ఇరువైపు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునే స్థితి లేదు. ఇద్దరి ఒంటిమీద గాయాల తాలూకు మచ్చలు ఉన్నాయి. ఆరేళ్ల వారి కూతురు బిక్కుబిక్కుమంటూ తల్లితండ్రిని చూస్తూ ఉండిపోయింది.

ఏమైందంటే..
భార్యాభర్త ఇద్దరూ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంటి పనులు చేయడంలో వాటాలు వేసుకున్నారు. నువ్వంటే.. నువ్వంటూ .. ఇద్దరి ఇగోస్‌ దెబ్బతిన్నాయి. కొన్ని రోజుల వరకు భరించిన చైత్రకు వర్ధన్‌ అంటే అసహనం మొదలైంది. ఓ రోజు తన కొలీగ్‌ నుంచి ఓదార్పు మెసేజ్‌తో చైత్రకు పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్టయ్యింది. సాధారణంగా మొదలైన మెసేజ్‌.. రెగ్యులర్‌గా చాట్‌ చేయడం వరకు వెళ్లింది. భార్య అస్తమానం ఫోన్‌తో ఉండటం గమనించిన వర్ధన్‌ ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేశాడు.

ఆమెకు వచ్చిన మెసేజ్‌లు, ఆమె వాడిన డేటా, రోజు మొత్తం ఎన్ని గంటలు ఫోన్‌లో ఉంటుందనే వివరాలన్నీ తను గమనించడం మొదలుపెట్టాడు. చైత్ర కూడా భర్త తనతో సరిగా లేకపోవడంతో చిన్న అనుమానం మొదలైంది. సాఫ్ట్‌వేర్‌ కావడంతో భర్త ఫోన్‌లో అతనికి తెలియకుండా అతని డేటాను తన ఫోన్‌లో చూసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంది. చిన్న డౌట్‌తో మొదలై ఒకరి ఫోన్లను ఇంకొకరు హ్యాక్‌ చేసుకునేంతవరకు వెళ్లారు. ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి విపరీతమైన అనుమానం తలెత్తింది. ఫలితంగా గొడవలు. ఓ రోజు ఇద్దరూ కొట్టుకోవడంతో విషయం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. అటు నుంచి విడాకులకు దారితీసింది.

స్మార్ట్‌గా.. విచ్ఛిన్నం అవుతున్న జీవితాలు
సైబర్‌ సేఫ్టీ వింగ్‌ వారు ఒకరినొకరు చేసుకున్న ఫోన్‌ హ్యాకింగ్‌ గుర్తించి, అసలు విషయం తెలుసుకున్నారు. ‘ఒక ఇంటి కప్పు కింద ఉన్నవాళ్లైనా తమ వాళ్లను చేసే సాఫ్ట్‌ మోసం కూడా జీవితాలను చెల్లాచెదురు చేస్తుంది. కోవిడ్‌ వల్ల అందరూ ఇంట్లోనే ఉండే స్థితి. ఫలితంగా గృహహింస కేసులు 27 శాతం పెరిగాయి. అదే ఐటి కమ్యూనిటీలలో ఉన్నవారి కేసులయితే 28 శాతం ఉన్నాయి’ అంటూ వివరించారు సైబర్‌ సేఫ్టీ నిర్వాహకులు అనీల్‌ రాచమల్ల. స్మార్ట్‌గా ఉంటే సరిపోదు స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పట్ల అవగాహన పెంచుకుంటే జీవితాలు దిద్దుకోవచ్చని చెబుతున్నారు.

బానిసలవడమే అసలు కారణం
స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ వాడకంతో ఐటీ కమ్యూనిటీలో కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి. తమ భాగస్వాముల ఫొటోలు తీసి షేర్, ట్యాగ్‌ చేయడం చేస్తుంటారు. ఆన్‌లైన్‌ అవమానం అంటూ ఓ కొత్త తరానికి తెరతీస్తున్నారు. భర్త లేదా భార్య తనని పట్టించుకోవడం లేదని బాధపడుతూ బయటివారితో చాటింగ్‌ చేస్తూ ‘సో బ్యూటిఫుల్, గార్జియస్, అమేజింగ్‌’ అంటూ మెచ్చుకునే పదాలకు పొంగిపోతుంటారు కొందరు. స్మార్ట్‌ ఫోన్‌ ఎడిక్షన్‌ వల్లే డైవోర్స్‌ రేట్‌ పెరుగుతోందని మా నివేదికల్లో తేలింది.

స్క్రీన్‌ టైమ్‌.. గ్రీన్‌ టైమ్‌ లెక్కింపు
ఫోన్‌ స్క్రీన్‌ మీద ఎంతసేపు ఉంటున్నాం. పచ్చదనంలో ఎంతసేపు ఉంటున్నాం.. అనేది కూడా గ్రహించాలి. ఈ నిబంధన పెట్టుకోవడం వల్ల ఫోన్‌లో గడిపే సమయం తగ్గుతుంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే విషయాలపట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. బంధాలు విచ్ఛిన్నం చేసుకునేంతగా, మన ప్రవర్తన–అలవాట్లు మారేంతగా స్మార్ట్‌ ఫోన్‌ని ఉపయోగిస్తున్నామా అనేది కూడా గ్రహింపులోకి తెచ్చుకోవాలి. స్మార్ట్‌ ఫోన్‌ని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లకూడదు. ఒక టైమ్‌ పరిధి దాటగానే నోటిఫికేషన్‌ని బ్లాక్‌ చేసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో నిజం చెప్పినా ‘ఈజ్‌ ఇట్‌ ట్రూ’ అని అడుగుతుంటారు. ఒక అబద్ధంలో బతికేస్తున్నామనే విషయం సోషల్‌ మీడియా వల్ల మనకు అర్థమవుతూనే ఉంది. అందుకే, మన ప్రైవసీని కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి.  
ఇంటర్నెట్‌ వాల్యూస్, డిజిటల్‌ వెల్‌నెస్‌ గురించి మరింత తెలుసుకోవడానికి సైబర్‌ టాక్‌ను సంప్రదించవచ్చు.

– అనీల్‌ రాచమల్ల, ఎండ్‌ నౌ ఫౌండేషన్, సైబర్‌ సేఫ్టీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు