గుర్‌...ర్‌...ర్‌.... గురకకు చెక్‌ పెట్టండిలా

4 Dec, 2021 14:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్‌ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది.

లైఫ్‌స్టైల్‌ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్‌) ప్రమాదకరం కాదు, కానీ అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్‌లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది?

గురకకు దారి తీసే కారణాలివి:


►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్‌ పాలిప్స్‌ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్‌ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. 
►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్‌ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్‌ ఏర్పడుతుంది. 
►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్‌ టిష్యూస్‌ కండిషన్‌ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే.
►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది.
►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్‌ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది.

గురకను తగ్గించుకునే మార్గాల....


►అధికబరువును తగ్గించుకోవాలి. 
►దూమపానం, మద్యపానం మానేయాలి. 
►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి.
►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి)
►గురకను అరికట్టే ప్లాస్టిక్‌ డివైజ్‌ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్‌ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు