ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు.. కానీ అసలు విషయం అది కాదు..

30 Dec, 2021 10:04 IST|Sakshi

కొన్ని రోజులుగా కూతురు ప్రతిమ (పేరు మార్చడమైనది)ను చూస్తుంటే లత మనసు తల్లడిల్లిపోతోంది. సమయానికి తినడం లేదు, నిద్రపోవడం లేదు. తనలో తను దేనికోసమో మధనపడుతోంది. కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పటికే తను చాలాసార్లు చూసింది. అదేమని అడిగితే.. ‘ఏమీ లేదు’ అంటుంది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న కూతురి విషయం భర్తకు చెప్పింది. తండ్రి గట్టిగా నిలదీసేసరికి ‘ఎవరో ఆకతాయిలు తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి, వేధిస్తున్నార’ని చెప్పింది. బాధపడిన పేరెంట్స్‌ ఈ విషయం ఇంతటితో వదిలేస్తే కూతురు భవిష్యత్తుకు ప్రమాదం అవుతుందని ప్రతిమ వద్దులే అంటున్నా వినకుండా ఆమెను తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు కంప్లైంట్‌ ఇవ్వడానికి.

వారు చెప్పిందంతా విన్నాక, ప్రతిమను అడిగారు పోలీసులు. భయం భయంగా చూస్తున్న ప్రతిమకు ధైర్యం చెప్పి, ఒంటరిగా ఆమెతో మాట్లాడి అసలు విషయాలు రాబట్టారు. ప్రతిమకు అసలు ఏ ఆకతాయిలూ వేధింపుల మెసేజ్‌లు పంపలేదు. రోజులో ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడపడం వల్ల మానసిక ఆందోళనకు గురైంది. వేళకు తిండి, నిద్ర లేకపోవడంతో ఆమె శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం పడింది. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం, విమర్శకు తట్టుకోలేకపోవడం .. వంటి దశకు చేరుకుంది. ఇలా ప్రతిమలో ఫోన్‌ కారణంగా మానసికంగా వచ్చిన మార్పులను అక్కడి కౌన్సిలర్‌ ఒక్కోటి ముందుంచారు. అలవాట్లు తీవ్రమైతే అవి వ్యసనానికి ఎలా దారి తీస్తాయో చెబుతూ ఎక్కడ తన నుంచి తల్లీదండ్రి ఫోన్‌ లాక్కుంటారో అని భయపడి ‘ఆకతాయిల నుంచి మెసేజ్‌’ అంటూ అబద్ధం చెప్పింది. నిజమేంటో తెలిసి కూతురు ఫోన్‌ వ్యసనాన్ని దూరం చేయడానికి తల్లీదండ్రి సిద్ధమయ్యారు. 
చదవండి: చిరుత దళం.. వాళ్లు చంపాలని. వీరు కాపాడాలని!

వ్యసనంగా మారిన అలవాటు
ఇది కేవలం ప్రతిమ ఒక్క విషయమే కాదు, మనలో చాలా మంది రకరకాల కారణాల వల్ల సోషల్‌ మీడియాకు వ్యసనపరులుగా మారుతున్నారు. ఏది సరైనదో తెలుసుకునే విచక్షణను కోల్పోతున్నారు.

డిజిటల్‌ అలవాట్లకు దూరం దూరం
ఈ రోజుల్లో సోషల్‌ మీడియా నుంచి దూరంగా ఉండటం అనేది అసాధ్యమైన విషయంగా అంతా చెబుతారు. కానీ, మన మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలంటే డిజిటల్‌ అలవాట్లను నియంత్రించుకోవడం అత్యవసరం. ఇది నూతన సంవత్సరానికి తీసుకోబోయే సరైన, తప్పనిసరి నిర్ణయం కూడా. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అలవాట్లను నియంత్రించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి.. తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్‌ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉండటం వల్ల మనకు రోజులో ఎక్కువ ఖాళీ సమయం లభిస్తుంది. తక్కువ ఆందోళన చెందుతాం. ఉదయం, పగటి వేళల్లో మన పనితీరు పెరుగుతుంది. నేర్చుకునే విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే సోషల్‌ మీడియాను ఒక వ్యసనంగా కాకుండా వార్తావాహికగా ఉపయోగించుకోవాలి. 

‘విష’యాలు.. 
► సామాజిక మాధ్యమాల ద్వారా విషయాలు తెలుస్తుంటాయి అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ, మనలో విషం నింపే నెగిటివిటీ లాంటి వ్యసనం కూడా ఉంటుంది. 
►మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నామనే విషయాన్ని ముందు మీ చుట్టూ ఉన్నవారికి చెప్పండి. ఈ మాట వల్ల తిరిగి మీ చుట్టూ ఉన్నవారు ప్రశ్నిస్తారనే ఆలోచనతోనైనా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటారు. 
►మీ ఫోన్‌లో అనవసర యాప్‌లను తొలగించండి. అలాగే, అనవసరమైన నోటిఫికేషన్స్‌ను వదిలే వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేయండి. 
►సామాజిక మాధ్యమం నుంచి దూరంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం పనులు చేయాలో ప్లాన్‌ చేయండి. 
►మీకే కాదు మీ ఫోన్‌ కు కూడా విశ్రాంతి ఇవ్వండి. అంటే రోజులో 8 నుంచి 10 గంటలైనా ఫోన్‌కి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. 
►ఫోన్‌లో కాకుండా బయట అలారం గడియారాన్ని ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల నిద్రలేస్తూనే ఫోన్‌ చూసే అలవాటు తప్పుతుంది. 
►రోజులో కొంత సమయం ఫోన్‌ని ఇంట్లో ఉంచి, పచ్చని పచ్చికలో కాసేపు తిరగండి. ఇలా దినసరి చర్యలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ఉండే సమయాన్ని బయటి పనుల్లో గడిపేలా ప్లాన్‌ చేయండి. 

మరిన్ని డి–అడిక్షన్‌ చిట్కాలు
►ఫోన్‌ను ఛార్జ్‌ చేసే పరికరాన్ని బెడ్‌రూమ్‌ లోపల కాకుండా హాలులో అమర్చండి. 
►సోషల్‌ మీడియా నోటిఫికేషన్స్‌ను ఫోన్‌ నుంచి కాకుండా ల్యాప్‌ టాప్‌ లేదా డెస్క్‌టాప్‌లో చూడండి. 
►హోమ్‌ స్క్రీన్‌లో ముఖ్యమైన యాప్‌లను మాత్రమే ఉంచండి.
►గ్రే స్కేల్‌ మోడ్‌ను ఉపయోగించండి. 
►మీరు ఎంతసేపు స్క్రీన్‌ సమయాన్ని ఉపయోగించాలో మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మానిటర్‌ సెట్టింగ్స్‌ను ముందే సెట్‌ చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అలవాటు నుంచి నియంత్రించడానికి ఉపకరిస్తుంది.
-అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

మరిన్ని వార్తలు