Social Media Day: డిప్రెషన్‌.. బాడీ షేమింగ్‌.. ఇంకెన్నో? మార్పునకై కృషి!

30 Jun, 2022 15:00 IST|Sakshi
సెజల్‌ కుమార్‌, ప్రబ్లీన్‌ కౌర్‌, ఆస్తా షా

సామాజిక సుస్వరాలై..

సూటిగా చెప్పాలంటే...  సోషల్‌ మీడియా కత్తిలాంటిది. కత్తి అనేది కూరగాయలు తరగడానికి ఉపయోగపడుతుంది. చెడు చేయడానికీ ఉపయోగపడుతుంది. అది మన విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కంటెంట్‌ క్రియేటర్స్‌గా బోలెడు పేరు సంపాదించిన కొందరు మహిళలు సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు.

వారిలో కొందరి గురించి...
మన దేశంలో సగటున ఒక వ్యక్తి మూడు నుంచి నాలుగు గంటల వరకు అంతర్జాలంలో గడుపుతున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాకు ప్రాధాన్యత పెరిగింది. సోషల్‌ మీడియా వేదిక ద్వారా సామాజిక అంశాలపై పనిచేస్తున్న కొందరు కంటెంట్‌ క్రియేటర్స్‌ గురించి.

మానసిక ఆరోగ్యంపై...
19 సంవత్సరాల వయసులో కంటెంట్‌ క్రియేటర్‌గా ప్రయాణం మొదలు పెట్టింది దిల్లీకి చెందిన సెజల్‌ కుమార్‌. దేశంలోని ‘మోస్ట్‌ పాపులర్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌’లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. మిచెల్‌ ఒబామాతో కలిసి ‘గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌’ ఉద్యమంలో పాలుపంచుకుంది. బాలికల విద్య ప్రాముఖ్యతను తెలియజేసే పాటల నుంచి లఘుచిత్రాల వరకు క్రియేటివ్‌ కంటెంట్‌ను రూపొందించింది.

తల్లి డా. అంజలీ కుమారితో కలిసి స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఎన్నో కార్యక్రమాలను రూపొందించింది. ఒకరోజు ఒక టినేజ్‌ అమ్మాయి నుంచి తనకు ఫోన్‌ వచ్చింది. ‘నిజం చెబుతున్నాను. మీ ఉపన్యాసం విని ఉండకపోతే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునేదాన్ని’ అన్నది ఆ అమ్మాయి.

‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగింది సెజల్‌. ఆ అమ్మాయి చాలా కారణాలు చెప్పింది. వాటిలో పస లేదు...‘ఇవి చిన్నా చితకా కారణాలు’ అని తనకు తానుగా తెలుసుకోవడానికి సెజల్‌ ఉపన్యానం పని చేసింది.

‘మనం చేసే మంచి పని ఏదీ వృథా పోదు..అని ఆరోజు అనిపించింది’ అంటున్న సెజల్‌ ఒకప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లింది. అదృష్టవశాత్తు ఆ ఊబి నుంచి త్వరగా బయటపడింది. తాను బయట పడడమే కాదు... డిప్రెషన్‌ బారిన పడిన వారిలో మార్పు తీసుకురావడానికి కంటెంట్‌ క్రియేట్‌ చేసింది. మానసిక ఆరోగ్యంపై ఆమె చెప్పే మంచి మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి.

‘ఫ్యాషన్‌కు సంబంధించిన కంటెంట్‌ ను క్రియేట్‌ చేయడంలో మంచి పేరు వచ్చినప్పటికీ, సామాజిక అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్‌ చేయడం అంటేనే నాకు ఇష్టం. లింగ వివక్ష, స్త్రీలపై జరిగే హింస... రకరకాల సమస్యలపై సోషల్‌మీడియాలో నా గొంతు వినిపిస్తున్నాను. ఉద్యమాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను’ అంటుంది సెజల్‌.

A post shared by Sejal (@sejalkumar1195)

ఆత్మవిశ్వాసం గురించి...
ప్రబ్లీన్‌ కౌర్‌ బొమ్రా పేరు వినబడగానే ‘పాపులర్‌ బ్యూటీ అండ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌’ అనే విశేషణం దగ్గరే మనం ఆగిపోనక్కర్లేదు. సామాజిక సమస్యలపై గళం ఎత్తడంలో ప్రబ్లీన్‌కు మంచి పేరు ఉంది. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు బాడీ షేమింగ్‌కు గురైంది కౌర్‌. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘బాడీ పాజిటివిటీ’పై కంటెంట్‌ రూపొందించింది.

‘నో ఫిల్టర్‌ విత్‌ పీకెబి’ అనే హ్యాష్‌టాగ్‌పై అందరి దృష్టిని ఆకట్టుకునే కంటెంట్‌ను క్రియేట్‌ చేసింది ప్రబ్లీన్‌. ‘ఎవరో నిన్ను చూసి నవ్వుతున్నారని నువ్వు బాధపడుతూ కూర్చుంటే, వారి రాక్షసానందాన్ని రెట్టింపు చేసినట్లు అవుతుంది తప్ప వేరే ఉపయోగం ఉండదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఆత్మవిశ్వాసం అంకురిస్తుంది. దీంతో అద్భుత విజయాలు సాధించవచ్చు’ అంటుంది కౌర్‌.

ప్రబ్లీన్‌ కౌర్‌లాగే ‘బాడీ పాజిటివీ’పై కంటెంట్‌ రూపొందిస్తుంది అస్తా షా. తాను కూడా ఒకప్పడు బాడీ షేమింగ్‌కు గురైంది.

సామాజిక సమస్యలపై... 
‘ప్రతి ఒక్కరిలో తమదైన సృజనాత్మకత ఉంటుంది. ఇలాంటి సమయంలో పదిమందిని ఆకట్టుకునే కంటెంట్‌ను రూపొందించడం అనేది సవాలుగా ఉంటుంది. సామాజిక అంశాలకు సంబంధించి ఆ సవాలు మరింత పెద్దగా ఉంటుంది. సామాజిక సమస్యలపై మనం కంటెంట్‌ రూపొందిస్తే కేవలం బోధ చేసినట్లు, ఉపదేశించినట్లు ఉండకూడదు. నిజమే కదా అనిపించాలి.

A post shared by PKB (@prableenkaurbhomrah)

కాసేపు ఆత్మావలోకనం చేయించాయి. ఆ తరువాత మార్పు తీసుకురాగలగాలి’ అంటున్న ఆస్తా డ్యాన్స్‌ నుంచి ఫ్యాషన్‌ వరకు వివిధ రకాల కంటెంట్‌ను రూపొందించడంలో మంచి పేరు సంపాదించింది.

‘నా టార్గెట్‌ ఆడియెన్స్‌ ఎవరు? వారిని ఎలా ఆకట్టుకోవాలి’ అంటూ జిమ్మిక్కులు చేయకుండా నిజాయితీగా కంటెంట్‌ క్రియేట్‌ చేస్తుంది. మరోవైపు సామాజిక బాధ్యతను తప్పనిసరి బాధ్యత గా భావిస్తోంది.
చదవండి: Ratan Chauhan: అబ్బాయి గెటప్‌లో పాపులర్‌.. తనకిష్టమైన స్టైలే ఆర్థికంగా నిలబెట్టింది!
  

మరిన్ని వార్తలు