మమతా బెనర్జీ, సోషలిజం పెళ్లి చేసుకుంటున్నారు

12 Jun, 2021 04:56 IST|Sakshi
సోషలిజం, మమతాబెనర్జీ

రేపు ఆ పెళ్లి మంటపంలో వామపక్ష వాదాలన్నీ మనుషుల రూపంలో తిరగనున్నాయి. అవును. మమతా బెనర్జీ అనే అమ్మాయిని సోషలిజం అనే అబ్బాయి రేపు పెళ్లి చేసుకుంటున్నాడు. కమ్యూనిజం, లెనినిజం అనే ఇద్దరు బావగార్లు ఈ పెళ్లికి పెద్దలు. ‘మార్క్సిజం’ అనే పేరున్న బుజ్జి మనవడు కూడా ఈ పెళ్లిలో హల్‌చల్‌ చేయనున్నాడు. తమిళనాడు సేలంలో జరగనున్న ఈ పెళ్లి భారీగా వార్తల్లో ఉంది.

‘మా ఇంట్లో ఇప్పటి వరకూ ఆడపిల్ల పుట్టలేదు. పుడితే ‘క్యూబాయిజం’ అని పేరు పెట్టడానికి రెడీగా ఉన్నా’ అని అంటాడు మోహన్‌. భుజం పై ఎర్ర కండువా వేసుకొని రేపు (జూన్‌ 13)న తన ఇంట జరగనున్న పెళ్లి పనుల హడావిడిలో ఉంటూనే అతడు పత్రికల వారికి టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏంటి విశేషం అంటే? అతని ఇంట్లో ఆ పేర్లే విశేషం.

ముగ్గురు కొడుకులు
తమిళనాడు సేలంలో నివాసం ఉండే మోహన్‌ ఆ జిల్లా సిపిఐ సమితి కార్యదర్శి. ‘నేనే కాదు మా ఇళ్లల్లో నేను నివాసం ఉండే చోట మేమందరం దాదాపు 70 ఏళ్లుగా కమ్యూనిస్టులం’ అంటాడు మోహన్‌. ఇతనికి ముగ్గురు కొడుకులు. వాళ్ల పేర్లు కమ్యూనిజం, లెనినిజం, సోషలిజం అని పెట్టాడు. ‘1990ల కాలంలో సోవియెట్‌ కుప్పకూలడం నాకు బాధ కలిగించింది. కమ్యూనిజం అమలు విఫలమైందేమోగాని సిద్ధాంతంగా అదెప్పుడూ విఫలం కాలేదు. పెళ్లికాక ముందు నుంచే నేను గట్టిగా అనుకున్నాను నా పిల్లలకు వామపక్ష పేర్లు పెట్టాలని. అలాగే పెట్టాను’ అంటాడు మోహన్‌.

‘మా ఇంట్లోనే కాదు... సేలంలో మేము నివాసం ఉన్నచోట చెకోస్లావేకియా, వియత్నాం వంటి పేర్లున్న మనుషులు కనిపిస్తారు. పెరియార్‌ రష్యా వెళ్లి వచ్చాక తన పిల్లలకు మాస్కో, రష్యా అనే పేర్లు పెట్టడం కూడా ఒక స్ఫూర్తే’ అంటాడు మోహన్‌.

మమతా బెనర్జీతో పెళ్లి
సేలంలో వామపక్ష అభిమానులు నివాసం ఉన్న చోటే కాంగ్రెస్‌ అభిమానుల నివాసాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక కాంగ్రెస్‌ అభిమాని కుమార్తెనే ఇప్పుడు మోహన్‌ తన కోడలిగా చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి పేరు మమతా బెనర్జీ. ‘ఈ పెళ్లికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరాసన్, అదే పార్టీ ఉపకార్యదర్శి– పార్లమెంటు సభ్యుడు అయిన సుబ్బరాయన్‌ హాజరవుతున్నారు’ అని సంతోషంగా చెప్పాడు మోహన్‌. అతని పెద్దకొడుకు కమ్యూనిజంకు పెళ్లయ్యింది. కొడుకు పుట్టాడు. వాడి పేరు మార్క్సిజం. ‘నా కొడుకులు వాళ్లకు పెట్టిన పేర్ల వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పైగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నా పెద్దకొడుకు లాయర్‌. వాడి పేరు కమ్యూనిజం కావడంతో జడ్జిలు ప్రత్యేకంగా చూస్తారు’ అన్నాడు మోహన్‌. ‘నా ముగ్గురు పిల్లల్ని కమ్యూనిస్టు భావాలతోనే పెంచాను. వాళ్లకు ప్రజల పక్షం ఉండటం తెలుసు’ అన్నాడు మోహన్‌.

సేలంలో జరగనున్న ఈ పెళ్లి కార్డు బయటకు రాగానే సోషల్‌ మీడియాలో హోరెత్తింది. ఆ పెళ్లి కార్డులో ఉన్న పేర్లకు ఏదో ఒక మేరకు ఆదర్శం, ధిక్కారం ఉన్నాయి. అందుకే ఆ హోరు. శతకోటి మందిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా, ఆదర్శంగా ఉండటమూ లేదా ఆదర్శభావాన్ని కలిగి ఉండటం ఎప్పుడూ సమాజంలో గుర్తింపు కలిగే పనే. అందుకే ఈ పెళ్లికి అంత గుర్తింపు.

అన్నట్టు ఈ పెళ్లిలో అక్షింతలు ఉండకపోవచ్చు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి శుభాభినందనలు తెలపడమే. విష్‌ యూ హ్యాపీ మేరీడ్‌ లైఫ్‌ మమతా బెనర్జీ అండ్‌ సోషలిజం.

మరిన్ని వార్తలు