అమ్మకు నో అడ్మిషన్‌

7 Nov, 2020 00:19 IST|Sakshi

‘మమ్మీ.. హండ్రెడ్‌ రుపీస్‌.. ప్లీజ్‌’ మమ్మీ దగ్గర డబ్బులు తీసుకోవడం..  ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి బైక్‌ కిక్‌ కొట్టడం!!  జాబ్‌ చేసే అబ్బాయిలు కూడా..  బయట తిన్నాకే.. ఇంటికి వెళ్లడం! తినకుండా వస్తే.. బయటి నుంచే తెప్పించుకోవడం! ఇంట్లో తినేవాళ్లా.. వద్దంటే వినేవాళ్లా! ఇప్పుడు సీన్‌ మారుతోంది.  యూట్యూబ్‌ చూసి ఇంట్లోనే.. స్టౌ వెలిగిస్తున్నారు మగపిల్లలు! అమ్మను కూడా  వంటింట్లోకి రానివ్వకుండా.. ఇంటికే రెస్టారెంట్‌ లుక్‌ తెస్తున్నారు! 

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్లు ఇదివరకటంత ఉద్ధృతంగా లేవు. బయటి నుంచి  తెప్పించుకునేవారు బాగా తగ్గిపోయారు. కారణం తెలిసిందే. కరోనా. అందుకే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్న మగపిల్లలు ఇంటినే రెస్టారెంట్‌గా మార్చేస్తున్నారు! ఇంట్లోవాళ్లని ఆశ్చర్యపరిచేలా రకరకాల వంటకాలను అందంగా అలంకరించి మరీ సిద్ధం చేస్తున్నారు. ‘నీకు నువ్వు తయారు చేసుకో’ అనే ఒక ఆరోగ్యకరమైన పద్ధతిని పాటిస్తున్నారు. కొత్త కొత్త వంటకాల కోసం యూ ట్యూబ్‌ను గాలిస్తున్నారు. వీళ్ల కోసమే అన్నట్లు రుచికరంగా వండే విధానాలను చెప్పే సైట్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటి సైట్‌లలో ‘దివ’ రెస్టారెంట్‌ చెఫ్‌ రితు దాల్మియా నిర్వహిస్తున్న ‘డిఐవై–డు ఇట్‌ యువర్‌సెల్ఫ్‌’ ఒకటి.

‘‘కొన్ని వంటకాలను ఇంటి దగ్గర తయారు చేయటం అందరికీ సాధ్యపడదు. అందుకే నేను వాటి తయారీ విధానాన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఉదాహరణకు చైనీస్, థాయి వంటకాలు తయారు చేయాలంటే.. కొద్దిగా నీళ్లు లేదా కొబ్బరి పాలు కలపాలి. అప్పుడు తాజాగా తయారవుతాయి. అవి డైనింగ్‌ టేబుల్‌ మీదకు వచ్చేసరికి రెస్టారెంట్‌లో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. మంచి చెఫ్‌లమన్న తృప్తీ మిగులుతుంది’’ అంటారు దల్మియా. ఆ మాట నిజమే. ఒకప్పుడు పెద్దవాళ్ల దగ్గర వంటలు నేర్చుకునేవారు. ఇప్పుడు యూట్యూబ్‌ ఇంటింటి పెద్దగా మారింది. ఆడవాళ్లే కాకుండా.. ప్రతి ఇంటా నలభీములు తయారవుతున్నారు. పానీపూరీ, వడపావ్, బిసబేళబాత్, పనీర్‌బటర్‌ మసాలా.. ఒకటేమిటి.. అన్ని దేశాల, రాష్ట్రాల వంటకాలను యూ ట్యూబ్‌లో చూస్తూ తయారుచేస్తున్నారు.

పిల్లల వంటకాలు రుచి చూసిన తల్లులు వారిని ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇంట్లోని వారిని మరింత ఆనందింపజేసేందుకు, ఆశ్చర్యపరిచేందుకు యూత్‌ అంతా ఇంట్లోనే బార్బిక్యూ అనుభూతి చెందేలా సెట్టింగ్స్‌ కూడా వేస్తున్నారు. మొఘలాయ్, తండూరీ, షావర్మ వంటి వెరైటీలు చేసి అవురావురుమనిపించేలా వడ్డిస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో పని ఒత్తిడి నుంచి కాసేపు రిలాక్స్‌ అవ్వటానికి కూడా వంట మంచి సాధనంగా పనిచేస్తోంది. ‘అమ్మా.. ఆకలి’ అని ఎప్పుడూ ఇంట్లో అమ్మ మీదే ఆధారపడకుండా అమ్మకూ చేసిపెట్టే యువతరాన్ని గత ఏడు నెలలుగా చూస్తున్నాం. కరోనా మన యువతరానికి శుభ్రతను మాత్రమే కాదు, వంటనూ నేర్పిందనే అనుకోవాలి. 

అమ్మకు విశ్రాంతి
రకరకాల వంటకాలు చేయడటం వల్ల వంటలో నైపుణ్యం సాధిస్తున్నాను.  బయటవారు ఎలా చేస్తారో తెలియదు కనుక, మన చేత్తో మనం చేసుకోవటం బెస్ట్‌ అనిపిస్తోంది. ఇన్ని రోజులూ తెలిసో తెలియకో బయట నుంచి తెచ్చుకున్నాం. ఈ విపత్కర సమయంలో స్వయంగా వండుకుని తినటం అలవాటైపోయింది కనుక ఇక ఎవరి మీదా ఆధారపడక్కర్లేదు. ఇంట్లో అమ్మ నిరంతరం పనిచేస్తుంటుంది. అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి. అమ్మతో ఎక్కువ గడపాలి. అమ్మకు çసహాయపడాలి.
– శివతేజ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, విజయవాడ

అందమైన అనుభూతి
లిటిల్‌ థింగ్స్‌ బ్రింగ్‌ మోర్‌ హ్యాపీనెస్‌. అమ్మనాన్నలకి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. వాళ్లకు స్వయంగా నేనే వండి పెట్టడం ఒక అందమైన అనుభూతి. ఇంట్లో వాళ్లందరం కలిసి కూర్చుని తినటం కూడా ఆనందంగా అనిపిస్తోంది. ఆఫీస్‌లో పనిని ఉద్యోగులు పంచుకుంటారు. అలాగే ఇంట్లో మేం కూడా ఒకరు కూరలు తరగటం, ఒకరు వండటం, ఒకరు మసాలాలు చూడటం.. ఇలా విభజించుకుంటున్నాం. అందరం తలో చెయ్యి వేయడటం వల్ల రుచికరమైన డిష్‌ త్వరగా సిద్ధమవుతోంది. 
– శ్రీవాత్సవ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, హైదరాబాద్‌

– వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు