Neha Bagoria: ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌... ఇప్పుడేమో..

8 Sep, 2021 07:16 IST|Sakshi

నేహా బగోరియా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఒకప్పుడు. ఇప్పుడామె పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను తలకెత్తుకున్న ఓ సంస్కర్త. నిజమే... కార్యకర్త బాధ్యత సమస్య పట్ల సమాజానికి అవగాహన కల్పించడం తో పూర్తవుతుంది. సంస్కర్త మీద సమస్యకు పరిష్కారాన్ని సూచించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆమె నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన పరిష్కారమార్గాన్ని చూపించింది.

ఆలోచన మంచిదే
వెస్టర్న్‌ టాయిలెట్‌ను ఒకసారి ఫ్లష్‌ చేస్తే, టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు విడుదలవుతుంది. నేహ రూపొందించిన సాధనం ఉపయోగిస్తే ఒక్క చుక్క నీరు కూడా అవసరం ఉండదు. రోజంతా వాడినా సరే టాయిలెట్‌ల నుంచి దుర్వాసన రాదు. ఈ సాధనం పేరు ఎకో ట్రాప్లిన్‌. ఇది సెన్సర్‌ ఆధారంగా పని చేస్తుంది. సెన్సర్‌ యాక్టివేట్‌ అవగానే, ఎకో ట్రాప్లిన్‌ సాధనంలో నింపిన రసాయన ద్రవం విడుదలవుతుంది. టాయిలెట్‌ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టినట్లే తీసుకుపోతుంది. టాయిలెట్‌ వాడటం ఆగిపోగానే ఈ ద్రవం విడుదల కూడా ఆగిపోతుంది. 

బాల్యంలో ఓ సంఘటన
ముంబయిలో పెరిగిన నేహ సొంతూరు రాజస్థాన్‌ రాష్ట్రం, బీవార్‌ సమీపంలోని ఓ కుగ్రామం. నేహ తాత, నానమ్మ అక్కడే ఉండేవారు. ఆమె చిన్నప్పుడు నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి విచిత్రమైన జీవనశైలి ఆమెను ఆశ్చర్యపరిచింది. నీటి వృథాను అరికట్టడానికి తనకు తెలిసిన, అప్పటికి తన ఊహకు తట్టిన ఉపాయాలన్నింటినీ అక్కడి వాళ్లకు వివరించింది. నీటి వినియోగం అవసరతను, దుర్వినియోగం అయితే ఎదురయ్యే కష్టాలను తెలియచెప్పింది. సెలవుల తర్వాత నేహ తిరిగి ముంబయి వచ్చేసింది. చదువుల్లో పడి నీటి సంరక్షణ ఆలోచన పక్కన పెట్టింది. 

నచ్చని ఉద్యోగం
కాలం గడిచింది. నేహ చదువు పూర్తయింది. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెలో అంతర్యానం మొదలైంది. ‘జీవితం అంటే ఇది కాదు’ అనిపించసాగింది. అప్పుడు ఆమె దృష్టి కంప్యూటర్‌ మీద నుంచి సమాజం మీదకు మళ్లింది. ఈ సారి ఆమెకు గమనింపులో ఒక్కోచోట అవసరానికి మించిన నీటి వాడకం, ఒక్కో చోట కనీస అవసరాలకు కూడా నీరు లభించకపోవడం వంటి వైరుధ్యాలు కూడా అర్థమయ్యాయి. నీరు సమృద్ధిగా వాడే వాళ్ల దగ్గరకు వెళ్లి ‘నీటి వనరును పరిమితంగా వాడండి’ అని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని కూడా అనుకుందామె. 

వేదికలెక్కి ఉపన్యాసాలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మీద పోస్టులతో సమస్య తీవ్రతను పదిమందికి తెలియచేయడం వరకే సాధ్యం, మరి పరిష్కారం కోసం ఏమి చేయాలి? ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన రూపమే ఈ ఎకో ట్రాప్లిన్‌ సాధనం. నేహా తన ఆవిష్కరణతో 2013లో ‘టాపు సస్టెయినబుల్‌ సొల్యూషన్స్‌’ పేరుతో ‘ఎకో ట్రాప్లిన్‌’ సాధనాల తయారీ కంపెనీ స్థాపించింది. నేహ తొలిదశలో ఎనిమిది వందల సాధనాలను తయారు చేసింది. వాటన్నింటినీ ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరీక్షించింది. అవన్నీ విజయవంతంగా పని చేస్తున్నాయి. ఒక మంచి ఆలోచన ఒక కొత్త ఆవిష్కరణకు కారకం అవుతుందని నేహ నిరూపించింది. 

చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే...

మరిన్ని వార్తలు