నోట్లో పొక్కులా? నో వర్రీ?

13 Jan, 2021 09:10 IST|Sakshi

కొందరికి నాలుక మీద పగులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు నోట్లో పొక్కులు రావచ్చు. ఏవైనా వేడిపదార్థాలో లేదా కారంగా ఉన్నవో తింటే మామూలు కంటే ఎక్కువగా మంట, బాధ ఉంటాయి. నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి (అఫ్తస్‌ అల్సరేషన్‌) చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్‌–బి లోపంతో ఈ సమస్య రావచ్చు. దీనికి తోడు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగై్జటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అరుదుగా కొన్ని సిస్టమిక్‌ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొక్కులకు సరైన కారణం తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించాలి. అందుకే నోట్లో పొక్కులు వచ్చే వారు ముందుగా విటమిన్‌–బి కాంప్లెక్స్‌ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారంపాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: రేగి పండు.. పోషకాలు మెండు..

సరిగా బ్రష్‌ చేసుకుంటున్నారా?
మనం బ్రష్‌ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవి మన దంతాల, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచి, కేవలం దంతాలను మాత్రమే కాకుండా మన పూర్తి దేహానికి ఆరోగ్యాన్నిస్తాయి. వాటిలో కొన్ని  ముఖ్యమైనవి... 
► బ్రష్‌ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌నే వాడాలి. మరీ బిరుసైనవీ, గట్టివి అయితే పళ్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు... చిగుళ్లు గాయపడే అవకాశమూ ఉంది.  
►కిందివరసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోండి. ఇలా బ్రష్‌ చేసుకునే సమయంలో బ్రష్‌ను పైకీ, కిందికీ నేరుగా కాకుండా... గుండ్రగా తిప్పుతున్నట్లుగా మృదువుగా బ్రష్‌ చేసుకోవాలి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే చిగుళ్లు గాయపడి, త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. 
►బ్రషింగ్‌తో పాటు ముఖం కడుకున్న తర్వాత చివర్లో చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని వార్తలు