Sonali Bhadauria: సాఫ్ట్‌వేర్‌ కొరియోగ్రాఫర్‌!

17 Aug, 2021 23:54 IST|Sakshi
సోనాలి భదౌరియా

జీవితంలో ఎన్నో సాధించాలని ప్రణాళికలు రూపొందించుకుంటుంటాం. కానీ వాటిలో మనం సాధించగలమన్న నమ్మకం ఉన్న కలను మాత్రమే నిజం చేసుకోగలుగుతామని చెబుతోంది ముంబైకి చెందిన సోనాలి భదౌరియా. కెరియర్‌ని ఎంచుకునేటప్పుడు ఇష్టమైన డ్యాన్స్‌లో ఎదగాలా? ఉన్నత చదువులు చదవాలా అని సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ చివరికి తనకి ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌ను వృత్తిగా మార్చుకుని అందులో రాణిస్తూ లక్షలమంది అభిమానులను సొంతం చేసుకుని యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారింది సోనాలి.

ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోనాలికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఎనలేని అభిమానం. టీవీ, రేయోలలో పాటలు వస్తున్నాయంటే వెంటనే ఆ సంగీతానికి తగ్గట్టుగా తన శరీరాన్ని రకరకాల భంగిమల్లో కదిలించేది. తల్లిదండ్రులు కూడా సోనాలి ఆసక్తిని గమనించి డ్యాన్స్‌ను ప్రోత్సహించేవారు. ఇంటర్మీడియట్‌ అయ్యాక.. డ్యాన్స్‌ను కెరియర్‌గా మలుచుకోవాలో?.. ఇంజినీరింగ్‌ చేయాలా అన్న సందేహం ఎదురైంది సోనాలికి. అప్పుడు బాగా ఆలోచించి ఇంజినీరింగ్‌ను ఎంచుకుంది.

బీటెక్‌ పూర్తయ్యాక ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిగా చేరింది. ఆఫీసులో పనితోపాటు, ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి ‘క్రేజీ లెగ్స్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిసి సోనాలి క్రేజీ క్లబ్‌లో చేరింది. ఇక్కడే ఆమె డ్యాన్సర్‌గా మారడానికి మొదటి అడుగు పడింది. ఒకపక్క క్రేజీ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగే డ్యాన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూl.. మరోపక్క నాట్యంలోని మెళకువలను నేర్చుకుంటూ కఠోర సాధన చేసి వివిధ డ్యాన్స్‌ కాంపిటీషన్లలో పాల్గొనింది.

లీవ్‌ టు డ్యాన్స్‌ విత్‌ సోనాలి
అదే సమయంలో ..తనలాగే డ్యాన్స్‌ గ్రూప్‌లో పనిచేస్తోన్న వ్యక్తి పరిచయమవ్వడంతో అతన్నే పెళ్లి చేసుకుంది. సోనాలికి డ్యాన్స్‌ పట్ల ఉన్న అంకిత భావాన్ని గమనించిన భర్త ప్రోత్సహించడంతో సోనాలి మరింత క్షుణ్ణంగా డ్యాన్స్‌ నైపుణ్యాలను ఔపోసన పట్టి స్వయంగా డ్యాన్స్‌ స్టెప్పులను క్రియేట్‌ చేయగల స్థాయికి ఎదిగి, ఏకంగా కొరియోగ్రాఫర్‌గా మారింది. దీంతో 2016లో ‘లీవ్‌ టు డ్యాన్స్‌ విత్‌ సోనాలి’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక పక్క సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే మరోపక్క తన డ్యాన్స్‌ వీడియోలను రూపొందించి యూ ట్యూబ్‌ ఛానల్‌ల్లో పోస్టుచేసేది. ఆమె డ్యాన్స్‌ వీడియోలకు మంచి స్పందన లభించడంతో మరిన్ని వీడియోలు అప్‌లోడ్‌ చేసేది.

ఉద్యోగ బాధ్యతలతో డ్యాన్స్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేయడానికి తీరికలేకుండా పోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తి సమయాన్ని డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ పెంచుకోవడంపై వెచ్చించింది. ఈ క్రమంలోనే 2017లో సోనాలి స్వయంగా కొరియోగ్రఫీ చేసిన ‘నషే సి చా«ద్‌ గాయి’, ‘షేప్‌ ఆఫ్‌ యూ’ సీక్వెన్స్‌ వీడియోలు యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ అయ్యాయి. దీంతో సోనాలికి మంచి డ్యాన్సర్‌గానేగాక, కొరియోగ్రాఫర్‌గా కూడా గుర్తింపు వచ్చింది. అక్కడ నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఫ్యాన్‌ఫెస్ట్‌లలో సోనాలికి ఆదరణ పెరిగింది. ఒక పక్క డ్యాన్సర్‌ అవ్వాలన్న కలను నెరవేర్చుకోవడమేగాక, మరోపక్క పెద్దపెద్ద డ్యాన్స్‌ ఈవెంట్స్, వెడ్డింగ్‌ ప్రాజెక్టులు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. వీటితోపాటు డ్యాన్సింగ్‌ వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఎంతో మందిని డ్యాన్సర్‌లుగా తీర్చిదిద్దుతోంది. 

లక్షలమంది సబ్‌స్రై్కబర్స్‌తో..
సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవాలంటే కొత్త కంటెంట్‌తో వ్యూవర్స్‌ను ఆకట్టుకొంటుండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సోనాలి ఎప్పటికప్పుడూ వినూత్న స్టెప్పులు, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్, అదిరిపోయే ఎనర్జీతో డ్యాన్స్‌ వీడియోలు రూపొందిస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఏడులక్షలకుపైగా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్, 23 లక్షల మంది యూ ట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్రై్కబర్స్‌తో దూసుకుపోతూ నేటి యువతరానికి  డ్యాన్సింగ్‌ ఐకాన్‌గా నిలుస్తోంది సోనాలి. 

మరిన్ని వార్తలు