విషాదాన్ని మిగిల్చిన కొరియన్‌ దేవకన్య

28 Jan, 2021 00:01 IST|Sakshi
మోడల్‌ గర్ల్‌గా సాంగ్‌

జీవితం వినోదం కాదనిపిస్తుంది.. వినోద రంగంలో ఉన్నవాళ్లు ఆత్మహత్యలకు తెగించినప్పుడు! స్క్రీన్‌ మీద నటించినవాళ్లు నిజ జీవితంలో నటించలేకపోతున్నారా? సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మీద ఎంటర్‌టైనర్‌లుగా వెలిగిపోతున్నవాళ్లు బయటి జీవితంలో నిలదొక్కుకోలేక చీకటిలోకి పారిపోతున్నారా? జీవితం స్మార్ట్‌ అయ్యాక భూగోళమంతా ఇప్పుడు యువలోకమే. కానీ యూత్‌ ఎందుకని యమలోకం వైపు వెర్రిగా చూస్తోంది. శనివారం సౌత్‌ కొరియాలో ‘సాంగ్‌’ అనే  యువ నటి చనిపోయింది. శనివారమే మనవైపు నెల్లూరులో రఫీ షేక్‌ అనే యువ టిక్‌టాక్‌ సెన్సేషన్‌ చనిపోయాడు. ఆదివారం కన్నడ బిగ్‌బాస్‌ ఫేమ్‌ జయశ్రీ విగతజీవిగా కనిపించారు. పంచినన్నాళ్లు వినోదాన్ని పంచి, అకస్మాత్తుగా వీళ్లెందుకని విషాదాన్నీ మిగిల్చి వెళుతున్నారు. 

గ్లామర్‌ ఫీల్డ్‌లో కొత్త టాలెంట్‌ని, కొత్తగా చూపిస్తున్న టాలెంట్‌ని నిలబడనివ్వని శక్తులు చాలానే ఉంటాయి. అవి గొంతు పట్టుకుంటాయి. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మనిషి జీవితం అంటేనే భయం కలిగేలా, తిరిగి అమ్మ కడుపులోకే పారిపోవాలన్నంతగా భయపెడతాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వెంటాడతాయి. చివరికి మరణం అంచుల వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి నెట్టేస్తాయి. పైకొస్తున్న అమ్మాయిలకు లైంగిక వేధింపులు ఉంటాయి. అబ్బాయిలకు అవమానాలు ఉంటాయి. పోటీ, ప్రేమ, డబ్బు.. ఈ రంగంలో ప్రథమ శత్రువులు. క్రియేటివిటీ ఉన్న చోట ఆ స్థాయిలోనే రూమర్లూ క్రియేట్‌ అవుతుంటాయి. ట్రోలింగ్‌లు జరుగుతుంటాయి. తట్టుకుని నిలబడలేనప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. డిప్రెషన్‌ మనిషికి చేయిపట్టుకుని తీసుకెళ్లే ఒకే ఒక చోటు.. మరణం! చదవండి: (వేధింపులకు తాళలేక టిక్‌టాక్‌ స్టార్‌ ఆత్మహత్య)


దక్షిణ కొరియా యువనటి సాంగ్‌ యూ–జంగ్‌ 

నెల్లూరులో రఫీ షేక్, కర్ణాటకలో జయశ్రీల వేర్వేరు మరణాలలో కారణాలపై విచారణ జరుగుతోంది. సియోల్‌లో 26 ఏళ్ల కొరియన్‌ నటి సాంగ్‌ (పూర్తి పేరు సాంగ్‌ యూ–జంగ్‌) ‘ఆత్మహత్య’ కు కారణం మాత్రం ‘అన్‌నోన్‌’గానే మిగిలిపోయింది. కూతురే పోయాక కారణాలను ఏం చేసుకోను అని ఆమె తల్లిదండ్రులు నిర్లిప్తంగా ఉండిపోయారు. నిర్లిప్తంగానే సోమవారం కూతురి అంత్యక్రియలు జరిపించారు. సాంగ్‌కి ‘సబ్‌లైమ్‌ ఆర్టిస్ట్‌ ఏజెన్సీ’లో జాబ్‌. అవును జాబ్‌! కళ ఉన్నవారికి అవకాశాలు ఇప్పించే సంస్థలు ప్రత్యేకంగా ఉంటాయి. నిర్మాతలు, నిర్వాహకులు ఎవరైనా వచ్చి సాంగ్‌ని వాళ్ల ‘షో’ కి, లేదా సినిమాకు ఒప్పించాలంటే సాంగ్‌ ఒప్పుకుంటే సరిపోదు. ఆమె పని చేస్తున్న సంస్థ ఒప్పుకోవాలి. అప్పుడప్పుడే పైకొస్తున్న యువ ఆర్టిస్టులంతా ఇంతే. పెద్ద స్టార్‌లు అయ్యాక గాని, తమ సంతకాన్ని తామే పెట్టే హక్కుకు సొంతదారులు కాలేరు. సాంగ్‌ తన హక్కును దక్కించుకునేందుకు చేసే ప్రయత్నంలోనే తనకు తెలీకుండా తను చావుదారిలోకి వెళ్లిపోయిందా?! 

సాంగ్‌ నిన్న మొన్నటి అమ్మాయి. 2019లో, ఇరవై నాలుగేళ్లు వయసులో నటిగా ఆమె తొలిసారి ‘డియర్‌ మై నేమ్‌’ అనే వెబ్‌ సీరీస్‌తో కొరియన్‌లకు అభిమాన నటి అయింది. అందులో ఆమె ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని. అసలే అందగత్తె. పిక్సీ కట్‌తో (కురచ జుట్టు) మరింత క్యూట్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా ఆఫర్‌లు రాబోతుండగా కరోనా వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ వార్త.. సాంగ్‌ ఆత్మహత్య!  చదవండి: (డిప్రెషన్‌తో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆత్మహత్య!)

వెబ్‌ సిరీస్‌లో వాస్తు శాస్త్ర విద్యార్థినిగా నటించిన సాంగ్‌ నిజ జీవితంలో తన కెరీర్‌ను నిర్మించుకోలేక టూల్స్‌ అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లుంది! వేధింపుల వెబ్‌ నుంచి ఆమె బయటపడలేక మృత్యువుతో స్నేహం చేసిందా! వయసులో ఉన్న పిల్లలకు, పేరొస్తున్న పిల్లలకు వేధింపులు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అయినవాళ్లే కాదు, అపరిచితులైనా సరే.. ‘హు..’ అని ముఖం తిప్పేసుకుని వెళ్లినా చాలు వీళ్లు తట్టుకోలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. ఒంటరితనం ప్రాణసఖి అవుతుంది. ఇక ఆ ఎవరూలేనితనం ఎటు తీసుకెళితే అటు... అంతిమ యానం. 

పందొమ్మిదేళ్లకే సాంగ్‌ ఎస్టీ లాండర్‌ స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులకు మోడలింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత బాస్కిన్‌–రాబిన్స్‌ ఐస్‌ క్రీమ్‌కు. ఎవరబ్బా ఈ పిల్ల అని ఆ దేశ ప్రజలు ముచ్చటగా చూశారు. అందం కాదు ఇంకా ఏదో ఉంది సాంగ్‌లో. చలాకీదనం? చురుకుదనం? అవెలాగూ ఉన్నాయి. ఆ కళ్లు.. ఆ ముక్కు.. ఆ పెదవులు.. ప్రతిదీ ఎక్స్‌ప్రెసివ్‌. మూర్తీభవించిన మహాభినయం కూడా సాంగ్‌ చూపుకు సాగిలపడవలసిందే. అంత సమ్మోహనం. మాంత్రికత. మనసును నెమ్మది పరిచే శ్రావ్యగీతిక మానవజన్మ ఎత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సాంగ్‌. కొన్ని మ్యూజిక్‌ వీడియోల్లో, గోల్డెన్‌ రెయిన్‌బో, మేక్‌ యువర్‌ విష్, స్కూల్‌ 2017 అనే టీవీ సీరీస్‌లో నటించింది సాంగ్‌.

నటనలోకి రాకపోయి ఉంటే కొరియన్‌ పాప్‌ మహరాణిగా తలపై ఆమె కిరీటాన్నీ ఏ చెలికత్తెలో సరిచేస్తూ ఉండేవారు. మనిషే లేకుండా పోయింది. సాంగ్‌ లేకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులతో పాటు మరొకరికీ తీరని లోటు! ఆమె ఎందరో వికలాంగులకు సహాయం చేస్తుంటుంది. వారంతా ఇప్పుడు మరోసారి అంగవైకల్యం పొందినట్లయింది. ‘వామ్‌ అకంపనిమెంట్‌’ అని దక్షిణ కొరియాలో ఒకపెద్ద సేవాసంస్థ ఉంది. ఆ సంస్థకు రాయబారిగా ఉండేది సాంగ్‌. ఇక ఇప్పుడు ఎవరి చేత రాయబారం పంపి ఈ దేవకన్యను స్వర్గం నుంచి వెనక్కు తెప్పించుకోవాలి.. కొరియాలో ఆమె వల్ల ఇప్పటి వరకు ఎంటర్‌టైన్‌ అవుతున్నవారు, ఆమె సహాయాలు పొందుతున్నవారు?!

>
మరిన్ని వార్తలు