ఇదే ఇదే భాగ్యనగర్‌

14 Sep, 2020 00:10 IST|Sakshi

కథాసారం

ఎర్రటి నీరెండలు లోకాన్ని అరుణకాంతితో నింపుతున్నాయి.
దూరాన్నుండి అతివేగంతో, తన గర్భంలో యెన్నో గత చరిత్రల్ని దాచుకున్న కాలిబాట దుమ్ముని రేగకొడుతో వస్తున్న గుర్రం డెక్కల చప్పుడు అకస్మాత్తుగా ఆగింది.
అది మూసీ నదీతీరంలో వున్న పల్లెటూరు. పెద్ద పూలవనం. చుట్టూ ముళ్లకంచె. ఆ తోటలో పద్దెనిమిదేళ్ల అమ్మాయి. పూలు తెంపుతో పాడుకుంటూ వుంది.
మరుక్షణంలో గుర్రాన్ని వెనక్కి నాలుగడుగులు నడిపించి, ఆ రౌతు కంచెను దాటించి, ఆ అమ్మాయి వద్ద ఆపాడు. ఆవిడ భయపడి పూలసెజ్జని కింద వొదిలేసింది.
అతడు గుర్రం దిగి పూలసెజ్జను అందించబోయాడు. ప్రేమ ధారలు కురిపిస్తూ ‘‘ఎవరు నువ్వు?’’ తీయని కంఠస్వరంతో అన్నాడు.
ఆ అమ్మాయికి కోపం వచ్చింది. తన తోటలోకి వచ్చి, తననే యెదురు ప్రశ్నిస్తున్నాడు.
‘‘నువ్వెవరు?’’ అంది.
‘‘మహారాజుని’’
మళ్లీ మొహంలోకి చూసింది. ‘‘ఇక్కడేం పని?’’ అంది, వీడని ధైర్యంతో.
‘‘వేటకోసం బయలుదేరాను. వొఠ్ఠి చేతుల్తో తిరిగిపోవడం ఇష్టంలేక...’’
పచ్చగడ్డి మీద చతికిలబడ్డాడు. గుర్రం తోచక సకిలించింది.
‘‘పల్లెల్లో ఏం వేట? అడవికి వెళ్లండి’’ అంది.
‘‘అడవిలో ఏదీ దొరక్కే ఇక్కడికి వచ్చా.’’
‘‘దయచేసి అవతలకు దయచెయ్యండి.’’
‘‘ప్రణయంలోనూ, రణంలోనూ వెనుకాడ్డం రాజలక్షణం గాదు’’ అన్నాడు, నోటితో గడ్డిపరకను కదిలిస్తూ. ‘‘ఒకసారి మొహమెత్తి ఇటుచూడు... నా హృదయేశ్వరివి.’’
ఆ అమ్మాయి ఉక్కిరి బిక్కిరయింది.
అతనో గులాబీ పువ్వుని తెంచుకొచ్చాడు. ‘‘చూడు! అందమైన గులాబీ చెట్టుకీ ముళ్లున్నాయి; నీకూ ముక్కున కోపం ఉంది. అదే దేవుడి సృష్టిలో వింత అనుకుంటాను’’ అన్నాడు.
ఓరగా చూసింది. ‘‘ఆ ముళ్లు చేరేవాళ్ల తెలివిని బట్టి బాధించవు.’’
అతని కళ్లల్లో సంతృప్తి తాండవించింది. ‘‘నీ సౌందర్యాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. నీ పాదాల చెంతకు వచ్చి ప్రేమభిక్ష కోరాను.’’
ఆ అమ్మాయి మాట్లాడలేదు.
‘‘మాట్లాడవేం?’’ అని చేతులు పట్టుకున్నాడు.
అంతలోకి ‘‘భాగ్యం; భాగ్యం’’ అని అరుపులు వినపడ్డాయి.
‘‘మా నాన్న! నేను పోవాలి’’ అంది కంగారుగా.
‘‘నీ పేరు?’’ ‘‘భాగ్యమతి’’
2
క్షణికమాత్రపు నిర్ణయాలెన్నో చరిత్ర రీతుల్నీ, తీరుల్నీ మార్చిన సందర్భాలున్నాయి. 
క్రమంగా భాగ్యమతికి ఆ నూతన యువకునితో పరిచయం ఎక్కువైంది. రహస్య సమావేశాలు, ప్రణయ కలాపాలు ఎక్కువయ్యాయి. భాగ్యమతి అతన్ని చూడందే ఒక్కరోజూ గడపలేకపోయేది. అతనూ అంతే! భాగ్యమతి సందర్శనా భాగ్యరహితుడై మనలేకపోయేవాడు.
అది వర్షాకాలం. ఉదయం మొదలు ఎడతెగని వర్షం కురుస్తోంది. కారు మేఘాలు కమ్మటం వల్ల సాయంత్రమే చీకటి పడినట్టుగా ఉంది. మూసీనది, వర్షపు నీరు చేరడం వల్ల వెల్లువలై పారుతోంది. ఆకాశంలో మెరుపులూ ఉరుములూ ఏదో ప్రళయం రాబోతున్నట్టుగా సూచిస్తూ వున్నాయి.
‘‘చలో, చలో’’ అంటూ కొరడాతో గుర్రాన్ని అదిలిస్తూ మన పరిచయస్తుడు ఏటికి అడ్డంగా ఈదసాగాడు. అతి కష్టం మీద అరగంట తర్వాత నాలుగు ఫర్లాంగుల దిగువన గట్టు చేరుకున్నాడు. అలసిపోయిన గుర్రం నురగలు గ్రక్కుతోంది.
పాకలో నుండి– ‘‘వచ్చారా?’’
‘‘ఎందుకు రాను?’’
‘‘ఇంత వర్షంలో...’’
‘‘నువ్వు మాత్రం యెందుకు నిరీక్షిస్తున్నావ్‌?’’
అతనామెను కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇద్దరు కొన్ని క్షణాలు మాట్లాడలేదు.
‘‘మీరు ఇట్లాంటి దారుణానికి తయారైతే ఎలా? తుపానులో వొస్తే వొప్పుకునేది లేదు.’’
‘‘రాణి గారి ఆజ్ఞ అనుసరించక తప్పుతుందా?’’
కొంతసేపు గడిచింది. బుగ్గమీద మీటి గుర్రాన్ని ఎక్కి వెళ్లిపోయాడు. ఎక్కడో దూరంగా పిడుగు పడినట్టయింది. భాగ్యమతి గుండెల్లో రాయిపడింది.
3
పదిహేను రోజుల వరకూ భాగ్యమతి ప్రియుని కోసం వృథాగా ఎదురు చూసింది.
పై సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే మూసీనది వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమైందని వింది.
గోల్కొండ నవాబ్‌ సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌షా గారికి యువరాజు మహమ్మద్‌ మూసీనదిని దాటి జ్వరం పడ్డాడనే వార్త విచారాన్ని కలిగించింది. వెంటనే హకీముల్ని పిలిపించి వైద్యం చేయించసాగాడు. తన వజీర్‌ సాహెబ్‌కు తక్షణం మూసీనదిపై నెల లోపల వంతెన నిర్మించాలని ఫర్మానా జారీ చేశాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా 1550 నుండి 1580 వరకు గోల్కొండ ఆంధ్రసామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప విద్వాంసుడు. అప్పుడు రాజ్యం ఒరిస్సా నుండి పెన్న వరకు విస్తరించి వుండేది. టర్కీ, అరేబియా, పర్షియా వరకు వర్తక వ్యాపారాలుండేవి. ఎంతోమంది తెలుగు కవులను పోషించాడు. ‘మల్కిభరాం’ పేరుతో ఆయన్ని తెలుగు కవులు కీర్తించారు. 
యువరాజు పది రోజుల వరకూ మూసిన కన్ను తెరవలేదు. అన్నాళ్లూ ఏదో కలవరిస్తూనే ఉన్నాడు. కాని వివరాలు ఎవరికీ తెలీలేదు. వైద్యులు మాత్రం యువరాజు ఏదో మనోవ్య«థతో బాధపడుతున్నారని కనుగొన్నారు.
మహమ్మద్‌ కొంచెం కోలుకోగానే ‘‘భాగ్యమతీ, భాగ్యమతీ!’’ అని పలవరించసాగాడు. ఈ వార్తను విన్న సుల్తాన్‌ కొడుకును చూడ్డానికి వచ్చాడు. అప్పటికి అందరికీ తెలిసింది. యువరాజు పడిన ప్రణయమే ఇంత ప్రళయాన్ని కొని తెచ్చిందని.
4
మరో నెల రోజులు గడిస్తేనేగానీ యువరాజు పూర్తిగా ఆరోగ్యవంతుడు కాలేడు. అప్పుడు సుల్తాన్‌ యువరాజును ‘బాలా హిస్సార్‌’నకు పిలిపించాడు.
మహమ్మద్‌ కొంచెం బలం చేరినప్పట్నుంచీ కూడా న్యాయశాలపై డాబా మీదికి పోయి, సాయంత్రం వేళలందు మూసీనది వైపూ, మూసీనదికి ఆవలవున్న పల్లెవైపూ శూన్యదృక్కుల్ని ప్రసరిస్తుండేవాడు. అక్కడి నుంచీ చూస్తే ముప్పై మైళ్ల వరకూ కనబడుతుంది.
ఒకనాడు అలాగే భాగ్యమతిని తల్చుకుంటూ వుంటే సుల్తాన్‌ వారి కబురు వచ్చింది. వెంటనే వెళ్లాడు. 
‘‘భాగ్యమతి ఎవరు?’’ అని నవ్వుతో ప్రశ్నించాడు. యువరాజు నుంచునే సిగ్గుతో తలవంచుకున్నాడు.
‘‘గొప్ప గొప్ప వజీర్లు, సర్దారులు కోట్ల కొలది హొన్నులతో తమ అపురూప సుందరులైన కన్యల్ని ఇస్తామంటుంటే ఇదేమిటి?’’
‘‘నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను.’’
‘‘మన ఇస్లాం మతం?’’
‘‘మీరు అన్నీ తెలిసినవారు. హిందూ, మహమ్మదీయ సఖ్యతకు పాటుపడేవారు.’’
‘‘నీ ఇష్టం. ఆలోచించు. నువ్వు కాబోయే సుల్తాన్‌వని గుర్తుంచుకో.’’
5
కాలచక్రం దొర్లిపోయింది. ఇబ్రహీంషా మరణించడం, మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా 1580లో రాజ్యాభిషిక్తుడవడం జరిగింది. భాగ్యమతి పట్టమహిషి అయింది. సిలాఖానా దక్షిణముగా ఆవిడకై ప్రత్యేక భవనం నిర్మించారు. అంబర్‌ ఖానాకు సమీపంలోనున్న గుహలో ఒక దేవాలయం నిర్మించారు. భాగ్యమతి అక్కడే రోజూ దేవి పూజ కావించుకునేది.
మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా సుల్తాన్‌గా వున్నప్పటికి దాదాపు ఆంధ్రదేశమంతా గోల్కొండ నవాబుల పాలనలోకి వచ్చింది.
రాజ్యానికి వచ్చిన పది సంవత్సరాల తర్వాత 1589లో గోల్కొండ సుల్తాన్‌ సతీ సపరివారంగా తాము కట్టించిన చార్‌మినార్‌ చూడ్డానికి వెళ్లారు. పక్కనే జుమ్మా మసీదు గొప్ప నేత్రానందాన్ని కలిగిస్తోంది. లెక్కలేనన్ని పావురాలు మసీదు మీద నివాసం చేసుకున్నాయి.
మూసీనది కిరువైపులా పూర్వపు పల్లెటూరు పెద్ద బస్తీగా మారిపోయింది. చార్‌మినార్‌ చుట్టూ చార్‌ కమాన్లు నిర్మించబడ్డాయి. విదేశీ వ్యాపారస్తులందరూ ఇక్కడే నివాసాలు ఏర్పర్చుకొని, అవసరమున్నప్పుడు దుర్గానికి వెళ్లి వస్తూవుండేవారు. విదేశీ రాయబారుల నివాసాలు కూడా ఇక్కడేవుండేవి.
భాగ్యమతితోపాటు సుల్తాన్‌ చార్‌మినార్‌ ఎక్కారు. మూసీనదిని, మరొక పక్క గోల్కొండ ఖిల్లాను చూసి భార్యాభర్తలు ముగ్ధులైపోయారు. మరొక పక్క మూసీనదికి ఆవలగా అల్లంత దూరంలో పూలతోట.
‘‘భాగ్యమతీ!’’ అన్నాడు సుల్తాన్‌.
‘‘ఏం ప్రభూ!’’
‘‘అక్కడ చూడు, ఆ పుష్పవనం! ఈ భాగ్యమతి, నా పాలిటి భాగ్యదేవత, ప్రథమ సందర్శనా భాగ్యాన్ని కలిగించిన పూదోట అదిగో.’’
భాగ్యమతి ముఖం మీది పల్చని తెరచాటు నుంచి, పొంచి చూసే చంద్రబింబంలా పటాన్ని తిలకిస్తోంది. 
‘‘నువ్వు నా పాలిటి భాగ్యదేవతవే కాదు, గోల్కొండ సామ్రాజ్యపు భాగ్యలక్ష్మివి. నీ పేరు మీదుగా, కలకాలం మన ప్రేమ ఈ లోకంలో నిలిచివుండేలా ఈ నగరానికి నేటి నుండి భాగ్యనగర్‌ అని పేరు పెడుతున్నాను.’’
‘‘ధన్యురాల్ని ప్రభూ. ప్రభువులు అన్నిటికీ సమర్థులు.’’ భాగ్యమతి హృదయం పొంగిపోయింది.
∙∙ 
ఆ భాగ్యనగరే నేటికీ భోగ, భాగ్యాలతో విలసిల్లుతున్న హైదరాబాద్‌!

శొంఠి కృష్ణమూర్తి రచన ‘భాగ్యనగర్‌’ ఇది. తెలంగాణ మలితరం కథకుల్లో ఒకరు.1924 నవంబరులో తూర్పు గోదావరి జిల్లాలోని సోమేశ్వరంలో జన్మించారు. ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. 1990 జూన్‌లో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన కథల్ని ‘నవచేతన’ పునర్ముద్రించింది. కథలు రాయడమెలా అనే పుస్తకాన్ని కూడా కృష్ణమూర్తి రాశారు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు