Soumya Singh Rathore: స్థానిక భాషల్లో కంటెంట్‌.. సూపర్‌ హిట్‌! సౌమ్య విజయ రహస్యం ఇదే!

30 Jul, 2022 14:53 IST|Sakshi

గేమ్‌ చేంజర్‌

మనస్తత్వశాస్త్రంలోని ఒక మంచిమాట... ‘నువ్వు సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తే... సమస్యలు మాత్రమే కనిపిస్తాయి. పరిష్కారాల గురించి ఆలోచిస్తే... ఎన్నో పరిష్కారాలు నిన్ను వెదుక్కుంటూ వస్తాయి’..

మనస్తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సౌమ్యసింగ్‌ రాథోడ్‌ సమస్యల కంటే ఎక్కువగా పరిష్కారాల గురించి ఆలోచించింది. అందుకే గేమింగ్‌ ఇండస్ట్రీలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తాజాగా దేశంలోని మహిళా సంపన్నుల జాబితా (హురున్‌ పవర్‌–లీడింగ్‌ వెల్దీ ఉమెన్‌ 2021)లో చోటు సాధించింది...

‘ది యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌’లో మనస్తత్వశాస్త్రం చదువుకున్న సౌమ్య సింగ్‌ రాథోడ్‌ ఆ తరువాత ‘జో రూమ్స్‌’ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఉద్యోగంలోనే ఉండి ఉంటే ఏం జరిగేదో తెలియదుగానీ, ఆ ఉద్యోగాన్ని వదిలి కొత్త అడుగు వేయడం ఆమె జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పింది. భారత్‌ గేమింగ్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసేలా చేసింది.

నాలుగు సంవత్సరాల క్రితం...
పవన్‌ నందాతో కలిసి దిల్లీ కేంద్రంగా ‘విన్‌ జో’ పేరుతో సోషల్‌ గేమింగ్‌ యాప్‌ మొదలుపెట్టినప్పుడు విజయాల కంటే సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంతో మొదలైన గేమింగ్‌ యాప్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో చిన్నపాటి పరిశోధన మొదలుపెట్టింది సౌమ్య. ఏ వయసు వాళ్లు ఎక్కువగా గేమ్స్‌ ఆడుతున్నారు?

ఏ జానర్‌ను ఇష్టపడుతున్నారు? పట్టణవర్గాల వారు మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ... ఇలా కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకొని సమాధానాలు తెలుసుకుంది.  ‘యూజర్స్‌ లో 80 శాతం నాన్‌–ఇంగ్లీష్‌ స్పీకర్స్‌ ఉన్నారు’ అనే వాస్తవం తెలుసుకున్నాక స్థానిక భాషల్లో కంటెంట్‌ను తీసుకువచ్చింది. ఇది బాగా హిట్‌ అయింది.

ఒకప్పుడు ‘యువతరం ఈ జానర్‌ మాత్రమే ఇష్టపడుతుంది’ అనే సూత్రీకరణ ఉండేది. అయితే ఇది తప్పు అని, ఎప్పటికప్పుడూ కొత్త జానర్స్‌ని ఇష్టపడుతున్నారని తన అధ్యయనంలో తెలుసుకుంది.

‘క్విక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ లక్ష్యంతో రకరకాల జానర్స్‌లో యూత్‌ను ఆకట్టుకునే గేమ్స్‌ రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌ అనేది సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాక ‘విన్‌ జో’ జోరు పెరిగింది. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

అలా అని ‘లాభాలే ప్రధానం’ అనుకోలేదు సౌమ్య. ‘రెస్పాన్సిబిలిటీ గేమింగ్‌’కు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ప్లాట్‌ఫామ్‌లో రకరకాల చెక్‌ పాయింట్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ప్లేయర్‌ను హెచ్చరిస్తారు. ప్లేయర్‌ వరుసగా గేమ్స్‌ లాస్‌ అవుతుంటే, తిరిగి ఆడడానికి అనుమతించకుండా ఉచిత ట్యూటోరియల్స్‌లో అవకాశం కల్పిస్తారు.

విన్‌ జో’ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు 25,000 మంది మైక్రో–ఇన్‌ఫ్లూయెన్సర్‌లతో కలిసి పనిచేసింది విన్‌ జో. ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరింది. ఈ సంఖ్య రాబోయే సంవత్సర కాలంలో రెట్టింపు చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘మన విజయానికి సామాజిక బాధ్యత తోడుకావాలి’ అని నమ్మడమే కాదు ఆచరించి చూపిస్తోంది సౌమ్య సింగ్‌ రాథోడ్‌.
చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్‌ వద్దనుకుని..
  

మరిన్ని వార్తలు