ఆ గ్రామానికి యజమాని కావాలట.. కారుచౌకగా అమ్మేస్తున్నారు!

18 Dec, 2022 08:39 IST|Sakshi

స్పెయిన్‌ నైరుతి ప్రాంతంలోని ఒక ఊరు కారుచౌకగా అమ్మకానికి ఉంది. సాల్టో డి క్యాస్ట్రో అనే ఊరి ధర 2.60 లక్షల యూరోలు మాత్రమే! అంటే, రూ.2.24 కోట్లు అన్నమాట. బ్రిటన్‌లోని సగటు ఇంటి ధర కంటే ఈ ఊరి ధర చాలా తక్కువ. పోర్చుగీసు సరిహద్దుల్లో ఉన్న ఈ ఊరి నుంచి మాడ్రిడ్‌ నగరానికి మూడు గంటల్లో చేరుకోవచ్చు.

ఈ ఊళ్లో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, మునిసిపల్‌ స్విమింగ్‌ పూల్, బ్యారక్స్‌ బిల్డింగ్‌ ఉన్నాయి. ఇన్ని వసతులు ఉన్నా, ఈ ఊరు దాదాపు ముప్పయ్యేళ్లుగా ఖాళీగానే ఉంది.

నిజానికి ఇక్కడ సాల్టో డి క్యాస్ట్రో ఊరిని ఒక విద్యుదుత్పాదక సంస్థ తన ఉద్యోగులు, కార్మికుల కోసం నిర్మించింది. ఊరికి దగ్గర్లోనే రిజర్వాయర్‌ ఉంది. ఇక్కడ జలవిద్యుత్తు ప్రాజెక్టు పూర్తికావడంతో, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఇక్కడి నుంచి తరలిపోయారు. అప్పటి నుంచి ఊరు ఖాళీగానే ఉంటోంది. జనాలు లేని ఈ ఊరిని తిరిగి జనావాసంగా మార్చడానికి ఇరవయ్యేళ్ల కిందటే స్పెయిన్‌ ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు.

చివరకు ఈ ఊరిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు 6.5 మిలియన్‌ యూరోల (రూ.560.63 కోట్లు) ధర నిర్ణయించగా, కొనడానికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత విడతల వారీగా ధర తగ్గిస్తూ వచ్చినా ఫలితం లేకపోయే సరికి, ఇప్పుడు కారుచౌకగా ఊరిని తెగనమ్మేందుకు సిద్ధపడ్డారు.

మరిన్ని వార్తలు