తెలుగు ఘనతకు దృశ్య సాక్ష్యం

24 Jun, 2021 00:04 IST|Sakshi
∙కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డాక్యుమెంటరీ చిత్రీకరణలో కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స

డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌

రేపు అంటే జూన్‌ 25 రాత్రి 8 గంటలకు ప్రతిష్టాత్మక డిస్కవరీ చానెల్‌లో ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ డాక్యుమెంటరీ టెలికాస్ట్‌ కానుంది. తెలుగువారి ఘనతకు సాక్ష్యంగా నిలిచిన ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌’ మహా నిర్మాణ ఉత్కృష్టతను దేశానికే కాదు ప్రపంచానికీ తెలియచేయనున్న డాక్యుమెంటరీ ఇది. దీని దర్శకుడు తెలుగువాడైన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. గతంలో ‘ఇన్‌సైడ్‌ తిరుమల’ డాక్యుమెంటరీ తీసి 52 దేశాల్లో ప్రసారం చేసిన రాజేంద్ర డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తెలుగువారి ఘనతను చూపుతూ తన ఘనతనూ నిరూపించుకుంటున్నారు.

ఆయన పరిచయం.
ఫిక్షన్‌లో కల్పన ఉంటుంది. నాన్‌ ఫిక్షన్‌లో వాస్తవాల ఆధారం ఉంటుంది. వాస్తవాలను నిరూపించడం, సాక్ష్యాధారాలతో నిక్షిప్తం చేయడం ఉంటుంది. నాన్‌ ఫిక్షన్‌ విభాగానికి వచ్చే డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ ఒక విధంగా చరిత్రకారుడి పని చేస్తాడు. వర్తమానాన్ని చరిత్ర కోసం, చరిత్రను వర్తమానం కోసం అన్వేషిస్తాడు. కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స అలాంటి అన్వేషకుడు. ఆయన అన్వేషణ తెలుగువారి కోసం, తెలుగువారి తరఫున సాగడం తెలుగువారికి మేలు చేస్తోంది.

లిఫ్టింగ్‌ ఏ రివర్‌
‘జటిలమైన విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడమే అసలైన కష్టం’ అంటారు 52 సంవత్సరాల రాజేంద్ర శ్రీవత్స. ఢిల్లీ నుంచి టెలిఫోన్‌ ద్వారా ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ డాక్యుమెంటరీ గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్మాణం. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కొన్ని ఉండొచ్చు. కాని అవన్నీ ఒకేచోట నిర్మితమయ్యాయి. కాళేశ్వరం పథకం అలాంటిది కాదు. అది మల్టీ లొకేషన్‌ ప్రాజెక్ట్‌. సాగునీటి కోసం తాగు నీటి కోసం సాగిన ఈ  నిర్మాణం గురించి తెలుగువారే కాదు ప్రపంచమంతా తెలుసుకోవాలని ఈ డాక్యుమెంటరీ తీశాను. ఒక గంట దీని నిడివి’ అంటారు రాజేంద్ర.

రెండేళ్ల కృషి
‘నేను ఢిల్లీలో ఉంటాను. 2017లో ఒక డాక్యుమెంటరీ పని మీద హైదరాబాద్‌ వచ్చినప్పుడు న్యూస్‌పేపర్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి చదివాను. అరె... నేను తెలంగాణావాణ్ణి. పైగా మీడియాలో ఉన్నాను. నాకే దీని గొప్పతనం పూర్తిగా తెలియకపోతే సామాన్యుడికి ఏం తెలుస్తుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని ఫాలో అవుతూ డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నాను’ అంటారు రాజేంద్ర. అనుకున్నదే తడవు తన సంస్థ పల్స్‌ మీడియా తరఫున డాక్యుమెంటరీ నిర్మాణ పనుల్లో దిగారాయన.

‘రెండేళ్ల పాటు ప్రాజెక్ట్‌ పనులను ఫాలో అవుతూ ఇంజనీర్లను కలుస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ ఇమేజ్‌ లు కాప్చర్‌ చేస్తూ వందల గంటల ఫుటేజ్‌ తీశాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఇంకో సంవత్సరం పట్టింది. తీసిన ఫుటేజ్‌ మొత్తం చూడటానికే 3 నెలలు పట్టింది. నేను తప్పక పాటించిన విషయం ఏమిటంటే అంతా ఆన్‌ లొకేషన్‌గా ఉండేలా చూడటం. యాక్చువల్‌ సౌండ్‌ను ప్రేక్షకులకు వినిపించడం. ఈ డాక్యుమెంటరీ చూసినవారు ప్రాజెక్ట్‌లో తిరిగిన భావనకు లోనవుతారు. సౌండ్‌ రికార్డిస్ట్‌ పి.డి.వాల్సన్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ ప్రశాంత్‌ కారంత్, స్క్రిప్ట్‌ రైటర్‌ పూర్ణిమా రావు... వీరందరూ గొప్పగా పని చేయడం వల్ల ఇది సాధ్యమైంది’ అన్నారు రాజేంద్ర. ‘ఇంత గొప్ప నిర్మాణం అన్నిసార్లు సాధ్యం కాదు. దీనిని జీవితంలో ఒకసారి దొరికే అవకాశం అనుకుంటాను. అంతేకాదు శివుడి (కాళేశ్వరుడి) ఆజ్ఞతో ఈ పని జరిగి ఉండొచ్చనిపిస్తుంది’ అంటారు రాజేంద్ర.

అంతర్జాతీయ చానెల్స్‌తో
‘2002లో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌ భారతదేశం నుంచి ప్రొడ్యూస్‌ అయ్యే కంటెంట్‌ను ప్రసారం చేయదలిచి డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్‌ ను ఆహ్వానించింది. ఎంతోమంది అప్లై చేశారు. ఇద్దర్ని మాత్రమే ఎంచుకున్నారు. వారిలో నేనొకణ్ణి’ అంటారు రాజేంద్ర. ‘అదృష్టవశాత్తు దేశంలో శాటిలైట్‌ చానల్స్‌ వృద్ధి, నా కెరీర్‌ ఒకేసారి మొదలయ్యాయి. నా కెరీర్‌ మొదట్లోనే నేషనల్‌ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానల్స్‌తో పని చేయడం వల్ల నాణ్యతతో ఎలా డాక్యుమెంటరీలు తీయాలో నాకు తెలిసింది. నిజానికి ఆ చానల్సే నాకు పని నేర్పాయి. దూరదర్శన్‌ దగ్గరి నుంచి అల్‌ జజీరా వరకూ అన్ని చానెల్స్‌కు డాక్యుమెంటరీలు చేశాను.’ అంటారు రాజేంద్ర.

తిరుమల ఖ్యాతి
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌ కోసం రాజేంద్ర తీసిన ‘ఇన్‌సైడ్‌ తిరుమల తిరుపతి’ 60 నిమిషాల డాక్యుమెంటరీ విశేష జనాదరణ పొందింది. ‘రోజూ 80 వేల మంది నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారు. కాని అంతమందిని ఎంతో గొప్పగా పర్యవేక్షిస్తారు. తిరుమల అంటే దర్శనం, ప్రసాదం మాత్రమే కాక ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆ డాక్యుమెంటరీ తీశాను. తెలుగువారి ఈ ఘన పుణ్యక్షేత్రం గురించి 2017లో ప్రసారం అయినప్పుడు సాధారణ టిఆర్‌పి కొలమానాలు ఆ ప్రేక్షకాదరణను కొలవడానికి పనికి రాలేదు. ఆ డాక్యుమెంటరీ 52 దేశాలలో ప్రసారమయ్యి తెలుగు వారి పుణ్యక్షేత్ర ఘనతను చాటింది ’ అంటారు రాజేంద్ర. ఇది కాకుండా దూరదర్శన్‌ కోసం ఎన్నో సైన్స్‌ కార్యక్రమాలు చేశారు రాజేంద్ర. అలాగే ‘స్వర్ణదేవాలయం’ మూలాలను తెలియ చేసే డాక్యుమెంటరీ ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ గోల్డెన్‌ టెంపుల్‌’, 2010 కాలంలో భారతదేశంలో ఊపందుకున్న సరొగసీ ధోరణిని డాక్యుమెంట్‌ చేస్తూ తీసిన ‘ఫైండింగ్‌ ఏ ఊంబ్‌’ రాజేంద్రకు చాలా పేరు తెచ్చాయి.

సానుకూల దృక్పథం
‘దేశంలోగాని తెలుగు ప్రాంతాలలో గాని మంచి పనులు జరుగుతున్నాయి. కాని మనం చెడును మాట్లాడుకున్నట్టుగా మంచి మాట్లాడుకోము. ఉదాహరణకు దేశంలో సైన్స్‌ పురోగతి కోసం గొప్ప కృషి జరుగుతోంది. దానిని ప్రజలకు చెప్పడం లేదు. ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు చెప్పడం లేదు. మంచి మాట్లాడుతూ ఉంటే మంచి పనుల కొనసాగింపు ఉంటుంది’ అని ముగించారు కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స.

‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ ప్రసార సమయాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స తీసిన 60 నిమిషాల డాక్యుమెంటరీ ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ డిస్కవరి చానల్‌లో జూన్‌ 25 రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతోంది. 6 భాషలలో దీనిని చూడొచ్చు. అలాగే డిస్కవరీ సైన్స్‌ చానెల్‌లో జూన్‌ 28 రాత్రి 9 గంటలకు, డిస్కవరీ టర్బో చానల్‌లో జూన్‌ 29 రాత్రి 9.50కు ఇది ప్రసారం కానుంది. డిస్కవరీ ఓటిటి చానల్‌ ‘డిప్లస్‌’లో జూన్‌ 25 నుంచి వీక్షణకు ఉంటుంది.

పక్కా హైదరాబాదీ
కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లో. తండ్రి సుధాకర రావు ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌లో పని చేసేశారు. తల్లి శాంత. రాజేంద్ర నిజాం కాలేజ్‌లో డిగ్రీ చేసి తర్వాత ఢిల్లీ జె.ఎన్‌.యూలో పి.జి ఫిలాసఫీ చేయడానికి వెళ్లారు. ‘శ్రీధర్‌బాబు (మంథని ఎం.ఎల్‌.ఏ, మాజీ మంత్రి) నేనూ చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్‌. ఢిల్లీలో అతను జెఎన్‌యూకు ‘లా’ చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజాం కాలేజీలో నువ్వు క్రియేటివ్‌గా పనులు చేసేవాడివి కదా... ఏదైనా క్రియేటివ్‌ ఫీల్డ్‌లోకి వెళ్లు అని అతడు ప్రోత్సహించేవాడు. అలా నేను ఫిల్మ్‌ మేకింగ్‌లోకి వచ్చాను’ అంటారు రాజేంద్ర. ‘నా భార్య మమతది వరంగల్‌. మా అబ్బాయ్‌ అమోఘ్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు’ అని తెలియచేశారు.

– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు