వందేళ్లనాటి చెట్టినాడు

24 Apr, 2021 14:20 IST|Sakshi

చెట్టినాడు ప్యాలెస్‌లు కళాత్మకత, సంప్రదాయంతోపాటు గొప్ప నిర్మాణ కౌశలానికి ప్రతిరూపాలు. ఈ ప్యాలెస్‌ల గురించి చెప్పుకునే ముందు... తమిళ సినిమాలో హీరోయిన్‌ తండ్రి ఊరి మోతుబరి ఇంటిని ఓసారి గుర్తు చేసుకుందాం. హీరోయిన్‌ కాళ్ల గజ్జెల చప్పుడు వినిపిస్తుంటుంది. ఆ చప్పుడు దిశ మారుతుంటుంది. హీరో కళ్లు వెతుకుతుంటాయి. ఐదు నిమిషాలకు కానీ హీరోయిన్‌ కనిపించదు. అలాంటి ఓ ఐదారు ఇళ్లను ఒక చోట కడితే ఒక చెట్టినాడు ప్యాలెస్‌ అవుతుంది. 

బెల్జియం అద్దాల మహళ్లు
వందేళ్లు నిండిన ఈ ప్యాలెస్‌లు చెట్టియార్‌ అనే వ్యాపార కుటుంబాల ఇళ్లు. వాళ్లు వర్తకం కోసం విదేశాలకు వెళ్లేవాళ్లు. ఎక్కడ ఏ వస్తువు నచ్చితే వాటన్నింటినీ ఇళ్ల నిర్మాణంలో భాగం చేసుకుని ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌కు తెర తీశారు. సున్నపురాయి నిర్మాణానికి ఇటాలియన్‌ మార్బుల్, బర్మా షాండ్లియర్‌లు, ఇండోనేషియా పాత్రలు, ఐరోపా క్రిస్టల్, బెల్జియం రంగు అద్దాలు, బర్మా టేకు, స్థానిక అత్తన్‌గుడి టైల్స్‌ తోడైతే అవే చెట్టినాడు ప్యాలెస్‌లు. గోడలు, స్తంభాల నునుపు కోసం కోడిగుడ్డు తెల్ల సొనతో పాలిష్‌ చేసేవాళ్లు. చెట్టియార్‌ల వారసులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా నగరాలలో స్థిరపడి... ఈ ప్యాలెస్‌లను పర్యాటక ప్రదేశాలుగా, హెరిటేజ్‌ హోటళ్లుగా మార్చేశారు. 

ఎనిమిదో వింత
చెట్టినాడు ప్యాలెస్‌ల సందర్శనలో వందేళ్లనాటి నూరుడు బండలు, రోకళ్లు, వంట పాత్రలను చూడడం మర్చిపోవద్దు. కూరగాయలను కోసే కత్తిపీటలను చూస్తే భయమేస్తుంది. ప్రపంచంలో ఏడు వింతలనే గుర్తిస్తాం. కానీ ఇది ఎనిమిదో వింతకంటే ఎక్కువే. తమిళనాడులోని ఈ ప్రదేశం హెరిటేజ్‌ సైట్‌గా యునెస్కోకు నామినేట్‌ అయింది. ఇక్కడ చెట్టినాడ్‌ చికెన్‌ రుచి చూడకుండా వెనక్కి వస్తే టూర్‌ను అసంపూర్తిగా ముగించినట్లే.

మరిన్ని వార్తలు