కలెక్టర్‌ రాజేంద్ర బారుద్‌

26 Aug, 2020 00:03 IST|Sakshi

అమ్మ కొడుకు 

‘‘మీరు నాలో చూస్తున్నది ఒక కలెక్టర్‌ని. అయితే మీ కళ్ల ముందు కనిపిస్తున్న నేను... నేను కాదు. మా అమ్మ రెక్కల కష్టాన్ని. నాన్న సహాయం లేకుండా జీవితాన్ని ఈదిన ఒక మహాయోధురాలు మా అమ్మ. నేను ఏడాది పిల్లవాడిగా ఉన్నప్పుడు, మా తమ్ముడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. పేదరికంలోనే పుట్టాను, పేదరికం తో కలిసి పెరిగాను. ఎంతటి పేదరికం అంటే మా నాన్న తన జీవితకాలంలో ఒక్క ఫొటో కూడా తీసుకోలేదు. నాన్న ముఖం ఎలా ఉంటుందో తెలియదు. నాకు అమ్మా... నాన్న రెండూ మా అమ్మే’’ అన్నారు మహారాష్ట్రలోని నందర్బూర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్ర బారుద్‌. 

నా భవిష్యత్తు చూసింది
రాజేంద్ర సొంతూరు మహారాష్ట్ర, ధూలే జిల్లా, సక్రి తాలూకా, సమోద్‌ అనే ఆదివాసీ గ్రామం. తండ్రి బందు బారుద్, తల్లి కమలాబాయి. మూడో బిడ్డ భూమ్మీద పడే నాటికే భర్త భూమి పొరల్లోకి వెళ్లిపోయాడు. ముగ్గురు బిడ్డలను పోషించాలి. ఒక చేత్తో బిడ్డను చంకకెత్తుకుని మరో చేత్తో ఇంటి బాధ్యతను భుజానికెత్తుకుంది కమలాబాయి. అంతటి పేదరికంలోనూ ముగ్గురు పిల్లలను బడికి పంపించడమే ఆమె విజ్ఞత. రాజేంద్ర చదువులో చురుగ్గా ఉండడంతో జవహర్‌ నవోదయ స్కూల్లో చేర్పించమని స్కూలు టీచర్లు సలహా ఇచ్చారు. రాజేంద్ర ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘నన్ను హాస్టల్‌కి పంపేటప్పుడు నా భవిష్యత్తు కోసం మా అమ్మ నిబ్బరంగా ఉండగలిగింది. నేను ఏడ్చేశాను. అమ్మను వదిలి ఒక్కరోజు కూడా ఉండింది లేదు. నేనెంత ఏడ్చానో ఇప్పటికీ గుర్తుంది. కానీ చదువులేని మా అమ్మ... ఊరి వదిలి ఎక్కడికీ వెళ్లని ఆమె, బిడ్డ భవిష్యత్తు కోసం అంత గట్టి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఆ రోజు ఆమె నిర్ణయమే నన్ను ఇలా నిలబెట్టింది’’ అన్నారు. 

ఎంబీబీఎస్‌ సీటు
రాజేంద్ర పన్నెండవ తరగతిలో స్కూల్‌ టాపర్‌. ముంబయిలోని జీఎస్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. అప్పటివరకు అతడి లక్ష్యం డాక్టర్‌ అయ్యి తమ తండాలో అందరికీ మంచి వైద్యం చేయవచ్చనేటంత వరకే పరిమితం. ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాత అతడి ఆలోచన విస్తరించింది. ఐఏఎస్‌ అధికారి అయితే తమ వాళ్ల జీవితాలను మెరుగుపరచడానికి పని చేయవచ్చనుకున్నారు. యూపీఎస్‌సీ పరీక్షలకు కూడా ప్రిపేరయ్యారు. ఎంబీబీఎస్‌ పరీక్షలతోపాటు అదే ఏడాది యూపీఎస్‌సీ పరీక్షలు కూడా రాశారు. తొలి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా పోస్టింగ్‌ వచ్చింది. ‘‘అప్పుడు మా ఊరికి వెళ్లాను.
తల్లి కమలాబాయితో రాజేంద్ర బారుద్‌

ఐఏఎస్‌ ప్రయత్నం, ఐఆర్‌ఎస్‌ ఉద్యోగం గురించి చెప్పినప్పుడు మా అమ్మ ‘నువ్వు చదివింది డాక్టర్‌ చదువు కాదా’ అని అడిగింది. మా అమ్మకే కాదు, మా ఊరి వాళ్లెవరికీ అప్పటివరకు కలెక్టర్‌ అనే పదమే తెలియదు. నేను ‘కలెక్టర్‌’ అని చెబుతుంటే ‘కండక్టర్‌’ అనేవాళ్లు’’ అని నవ్వుతూ చెప్పాడు రాజేంద్ర. రెండవ ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యి... నాందేడ్‌ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్, షోలాపూర్‌ జిల్లా సీఈవోగా పని చేశారు. 2018లో నందుర్బార్‌ జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నలభై వేల ఆదివాసీ కుటుంబాలకు రేషన్‌ కార్డు సౌకర్యం కల్పించారు. మరో 65 వేల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పించారు. 

చెరుకు సారా
‘‘మా అమ్మ మమ్మల్ని పెంచడానికి చెరకు ఆకులు, అడవుల్లో దొరికే చెట్ల పూలు తెచ్చి సారా కాచి అమ్మేది. అంత కష్టపడితే ఆమెకు రోజుకు వంద రూపాయలొచ్చేవి. నానమ్మ, అమ్మ, ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురి పోషణ అందులోనే. ఆ సారా కాయడం, తాగడం చట్టవ్యతిరేకం కాదు. ఆదివాసీ కుటుంబాల్లో అందరికీ ఈ సారా అలవాటే. చిన్నప్పుడు మేము ఊరికే ఏడుస్తూ ఉంటే ఒక చెంచాడు సారా పట్టించేది. మేము నిద్రపోయేవాళ్లం. తన పనికి అడ్డు వస్తుంటే మరేం చేస్తుంది పాపం. అయితే మాకు ఊహ తెలిసిన తర్వాత సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు అమ్మకు సహాయం చేద్దామని ఏదో ఒక పని చేయబోతే... మమ్మల్ని సారా కుండల దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. నా చిన్నప్పుడు మా ఆదివాసీలు తాము నిరక్షరాస్యులమని, అత్యంత పేదరికంలో జీవిస్తున్నామనే వాస్తవాన్ని తెలుసుకోలేని అమాయకత్వంలో జీవించేవాళ్లు. వాళ్లను బయట విశాలమైన ప్రపంచం ఉందనే వాస్తవంలోకి తీసుకురావాలనేదే నా కోరిక’’ అన్నారు రాజేంద్ర. ఆయన 2014లో తన విజయాలను, సవాళ్లను వివరిస్తూ రాసిన ‘మై ఏక్‌ సపన్‌ పహిల్‌’ పుస్తకాన్ని తల్లి కమలాబాయికి అంకితం ఇచ్చారు.

మరిన్ని వార్తలు