ఆగని చక్రాలు

8 Aug, 2020 01:36 IST|Sakshi

విపత్తు అంటే ఏమిటి? భూమి కంపించడమా? ఉప్పెన ముంచెత్తడమా? అగ్నికీలలు చుట్టు ముట్టడమా? అన్నీ.. విపత్తులే. అన్నిటికన్నా పెద్ద విపత్తు.. ఉద్యోగం కోల్పోవడం! సగటు మనిషికి ఇలాగే ఉంటుంది. విద్య, దీప మాత్రం.. ధైర్యం కోల్పోవడమే పెద్ద విపత్తు అంటున్నారు.  

విద్యా షెల్కే వయసు 28 ఏళ్లు. ఇద్దరు చిన్న పిల్లలు. ముంబైలోని ఓ రైడ్‌–షేరింగ్‌ కంపెనీలో ఉద్యోగం. అకస్మాత్తుగా విపత్తు! ఉద్యోగం పోయింది. కరోనా మింగేసిన కోట్ల మంది మహిళల ఉద్యోగాలలో విద్యది కూడా ఒకటి. ఇంట్లో ఆమె మీద ఆధారపడిన వాళ్లు ఇంకా కొందరు ఉన్నారు. భర్త ఉద్యోగం కూడా ప్రమాదంలో పడేలా ఉంది. ఇంటికి ఇద్దరూ రెండు లైఫ్‌ బోట్‌లు. లైఫ్‌ బోట్‌ పని ఒడ్డుకు చేర్చడం. లైఫ్‌ బోటే తలకిందులైతే! విద్య పదోతరగతి వరకు చదివింది.

ఆటో నడపడం వచ్చు. పెళ్లయిన కొత్తలో భర్తే ఆమెకు డ్రైవింగ్‌ నేర్పించాడు. రెండు నెలల క్రితం.. ఉద్యోగం పోయిన వెంటనే విద్యా ఇంకేమీ ఆలోచించకుండా టాక్సీ సర్వీసు మొదలుపెట్టింది. ఆమె ఉండేది ములుంద్‌ ఏరియా. ఆ చుట్టుపక్కల, దూర ప్రాంతాలకూ ప్రాంతాలకు వెళ్లవలసిన వృద్ధులు, మహిళల కోసం ఆమె టాక్సీ నడుపుతుంది. చార్జీలను పట్టుపట్టి అడగదు. ఇవ్వలేని వాళ్లెవరో ఆమెకు తెలిసిపోతుంది. వాళ్ల దగ్గర తీసుకోదు.

కొందరైతే ఆడ కూతురు రోడ్డు మీద టాక్సీ నడుపుతోందన్న మురిపెంతో ఉదారంగా డబ్బు ఇవ్వబోతారు. నవ్వుతూ తిరస్కరించి, ఎంతయిందో అంతే తీసుకుంటుంది విద్య. పుణె, నాసిక్, ఔరంగాబాద్, కొల్హాపూర్, సతారా, సంగ్లీ, నాగపూర్‌ వంటి మరీ దూర ప్రాంతాలకు కూడా విద్య ముంబై నుంచి టాక్సీ నడుపుతుంటుంది. ఓసారి నాసిక్‌ నుంచి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు మీద తల్లీ బిడ్డలు నిరాశ్రయంగా కనిపిస్తే వారిని టాక్సీలో ఎక్కించుకుని ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న ఆ మహిళ పుట్టింట్లో వదిలిపెట్టింది. లాక్‌డౌన్‌లో భర్త ఇంట్లోంచి వెళ్లగొడితే పిల్లలతో సహా ఆమె రోడ్డున పడిందని ప్రయాణం మధ్య మాటల్లో విద్యకు తెలిసింది. అలాంటి వాళ్ల దగ్గర కూడా ఆమె డబ్బులు తీసుకోదు. డీజిల్‌ ఖర్చు అని కూడా అనుకోదు. 

‘సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ సర్వే ప్రకారం కరోనా వల్ల ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 12 కోట్ల 20 లక్షల మంది మన దేశంలో ఉద్యోగాలు కోల్పోయారు! వారిలో మహిళలు కోటీ 70 లక్షల మంది. భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరు మార్చి–ఏప్రిల్‌ నెలల మధ్య కాలంలో మళ్లీ నిరుద్యోగులయ్యారు! మే–జూన్‌–జూలై నెలల సర్వే వివరాలలో వీళ్ల సంఖ్య మరింత ఎక్కువయ్యే సూచనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. 

లాక్‌డౌన్‌ మొదలవగానే విద్యలా ఉద్యోగం కోల్పోయిన వారిలో దీపా జోసెఫ్‌ మరొకరు. ఆమెది కేరళలోని కోళికోడ్‌. కాలేజ్‌ బస్‌ డ్రైవర్‌గా చేస్తుండేది. విద్యాసంస్థలు మూత పడటంతో చేతిలోని పని పోయింది. భర్త, కొడుకు, కూతురు.. ఇదీ ఆమె కుటుంబం. కొడుకు టెన్త్‌ చదువుతున్నాడు. కూతురు ఎనిమిదో తరగతి. భర్త ఉద్యోగం కూడా రెపరెపలాడుతోంది. ఆ సమయంలో పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు ఆమెను అంబులెన్స్‌ డ్రైవరును చేశాయి. దీప ఒకోసారి రోజంతా అంబులెన్స్‌ నడుపుతూనే ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.

విద్యలానే దీప కూడా తరచు డబ్బులు తీసుకోకుండా సేవాభావంతో రోగుల్ని ఆసుపత్రికి చేరవేస్తుంటుంది. ముంబైలో ఉన్న దీప, కోళికోడ్‌లో ఉన్న విద్య ఒకరికొకరు తెలియకున్నా ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నట్లు వాళ్ల మాటల్ని బట్టి తెలుస్తోంది. ‘‘ఉద్యోగాలు చేస్తున్నవారే కాదు, ఉద్యోగాలు ఇచ్చిన వారు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్న విపత్తు లాంటి పరిస్థితులివి! ఉద్యోగం పోయిందని బాధపడకుండా, మనకు తెలిసిన విద్యతోనే మార్గం వెతుక్కోవాలి. దేన్ని కోల్పోయినా జీవితంలో ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు’’ అంటున్నారు విద్య, దీప. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా