కష్టం ఎక్కడికీ పోదు

20 Feb, 2021 07:39 IST|Sakshi
అంజిత చేప్యాల

2013లో చండీగఢ్‌లో ఏసీపీగా విధులు

హెల్మెట్‌లు వాడకంపై మహిళల్లో అవగాహన

ఉమెన్‌సెల్‌ ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులతోపాటు ఉద్యోగం చేస్తున్న మహిళలకు స్వీయరక్షణలో శిక్షణ

2019లో ఢిల్లీలో ట్రాఫిక్‌ ప్రధాన కార్యాలయంలో డీసీపీగా బాధ్యతలు...

నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. అందరికీ అన్ని స్థాయుల్లోనూ సవాళ్లు ఎదురవుతాయి.. భయం వీడితే పరిష్కారం అదే దొరుకుతుంది.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలి అంటారు అంజిత చేప్యాల... తెలంగాణకు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్‌ ఐపీఎస్‌. దేశరాజధానిలో రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోంమంత్రుల నివాసాలతోపాటు ఇండియా గేట్‌ వంటి అత్యంత ప్రాముఖ్య ప్రదేశాలున్న లుటియన్స్‌ జోన్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణాధికారిగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞాన్‌భవన్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రైతుల సమావేశాల సమయంలో శాంతి భద్రతలు పర్యవేక్షించిన న్యూ ఢిల్లీ జిల్లా అదనపు డీసీపీ (శాంతి భద్రతలు) అంజిత.. సాధనతోనే ఈ స్థాయి సాధించానని చెబుతున్నారు. ఆమె ప్రస్థానం ఆమె మాటల్లోనే....

శిక్షణ అనంతరం ఢిల్లీలోసైబర్‌ క్రైం విభాగంలో తొలి బాధ్యతలు స్వీకరించా. శిక్షణ, విధుల సమయంలో సహచరుల్లో ఎలాంటి వివక్ష కనిపించ లేదు... నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. నా విశ్వాసానికి బలం చేకూరింది. అప్పుడప్పుడే సైబర్‌ నేరగాళ్ల విశ్వరూపం బయటపడుతోంది.. వందలాది ఫిర్యాదులు వచ్చేవి.. ఇంజినీరింగ్‌ నేపథ్యం కావడంతో సులభంగానే అనేక సవాళ్లు చేధించా.. సొమ్ములు కట్టించుకొని సరకు అందించని ఆన్‌లైన్‌ షాపింగ్‌ టిమ్టారా.కామ్, కాల్‌సెంటర్‌ మాదిరి ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్ములు కాజేసిన జిమ్తారా సంస్థ మోసాలు అరికట్టడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది.
మెట్రోపాలిటిన్‌ సిటీ.. రద్దీ రహదారులు.. వీటితోపాటు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నూతన సాంకేతిక ఏర్పాటుకు నేను ట్రాఫిక్‌ ప్రధాన కార్యాలయంలో డీసీపీగా బాధ్యతలు చేపట్టినప్పుడే అనుమతి వచ్చింది. రూ.1000 కోట్ల ప్రాజెక్టు అది. ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, సీసీటీవీ, క్యూ లెంగ్త్‌ను చూసి పనిచేసే ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ ఇవన్నీ భవిష్యత్తులో ఢిల్లీ రహదారులపైకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు తొలిదశలో నేను కూడా భాగస్వామిని.

రహదారులపై ట్రాఫిక్‌ ఒక ఎత్తు అయితే.. తాజా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజధాని నుంచి వలస కార్మికులు తిరిగి వెళ్లడం.. లక్షలాది మంది ఆనందవిహార్, ఐఎస్‌బీటీ ప్రాంతాలకు చేరుకోవడం చూస్తే హృదయం ద్రవించి వేసింది. ఈస్ట్‌జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఉన్న నేను వారందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశా. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వివరించడంతోపాటు ఆహారం, వైద్య సదుపాయం అందజేశాం. మాస్కులు పంపిణీ చేశాం. నవంబరు 11న డీసీపీ (శాంతిభద్రతలు)గా బాధ్యతలు స్వీకరించా.. 25 నుంచే రాజధాని సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమైంది... చాలా రోజులు సవాల్‌గానే గడిచాయి.
నేను నమ్మిన మాట నిజమైంది!  

శిక్షణ సమయంలో కార్యాలయంలో వివక్ష ఎదురవుతుందన్న భావన నాకెప్పుడూ అనిపించలేదు. మహిళలు సాహసాలు, అద్భుతాలు చేయాలంటే నేర్పు, ఓర్పు కన్నా ధైర్యం అవసరం అని నమ్మేదాన్ని. తొలిసారే సివిల్స్‌కు ఎంపిక కాలేదని నిరుత్సాహం చెందలేదు. కాలంతో పోరాడి అనుకున్నది సాధించా.. లక్ష్యం చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలన్న మావయ్య నర్సింగ్‌రావు మాటలు గుర్తొచ్చాయి.

వారిద్దరూ ప్రత్యేకం...
చదువుకొనే రోజుల నుంచి నన్నెంతగానో ప్రోత్సహించింది మా అన్న సంపత్‌ రావు. ఈ దిశగా వెళ్లు.. ఇలా చేయడం వల్ల నలుగురికీ ప్రయోజనం కల్పించొచ్చు అంటూ సహోదరిని సేవాదారిగా మార్చడంలో అన్ని వేళలా ప్రోత్సహించారు. ఇక నా భర్త నవీన్‌కుమార్‌.. సివిల్స్‌లో మంచి ర్యాంకు వచ్చి ఎంపిక కాలేకపోయిన నన్నెంతగానో ఓదార్చారు. కోర్టు తీర్పుతో తిరిగి ఎంపిక అయిన తర్వాత అమెరికాలో గృహిణిగా స్థిరపడిన నన్ను విధుల వైపు మళ్లేలా చేశారు. వారిద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం.

పెద్దపల్లి జిల్లా మేడిపల్లి మా స్వగ్రామం.. రామగుండం, తెనాలి, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ వరకూ చదివాక తల్లిదండ్రులు మంగ, సత్యనారాయణరావుల ప్రోత్సాహంతో సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా ముందుకు సాగా.. మూడు ప్రయత్నాలు మిస్సయినా, నాలుగో యత్నంలో 2008 లో మంచి ర్యాంకు వచ్చింది. అయితే, ఆ సమయంలో జనరల్, రిజర్వేషన్‌ కేటగిరీల గందరగోళంతో నన్ను ఎంపిక చేయలేదు. తర్వాత ఏడాదే బాసరకు చెందిన నవీన్‌కుమార్‌తో వివాహం అయింది. మాకు ఇద్దరు పిల్లలు శాన్వి, మాహిర. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. 2010లో కోర్టు తీర్పుతో జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల్ని తిరిగి ఎంపిక చేయడంతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా.

–సూర్యప్రకాశ్‌ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ
ఫొటో: ప్రమోద్‌ మాధుర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు