టెకీ డాక్టర్‌

18 Sep, 2020 04:57 IST|Sakshi

న్యూయార్క్‌లోని ‘ట్విన్‌ టవర్స్‌’ పై ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో డాక్టర్‌ సుంబుల్‌ దేశాయ్‌ లాస్‌ ఏంజెలిస్‌లోని డిస్నీ ల్యాండ్‌ ఆఫీస్‌లో ఉన్నారు. అప్పటికి ఆమె డాక్టర్‌ కాదు. అందులోని ఒక డిజిటల్‌ మీడియా విభాగానికి చిన్నపాటి క్రియేటివ్‌ హెడ్‌. పాతికేళ్ల అమ్మాయి. డిస్నీలోకి రావడానికి ముందు, డిస్నీ వాళ్లదే ఏబీసీ టీవీలో నైట్‌ డ్యూటీ చేస్తుండేది. డే డ్యూటీ ఐబీఎంలో.  దాడి జరిగిన రోజు రాత్రి, దేశాయ్‌ డ్యూటీలో ఉండగా న్యూయార్క్‌లోని ఆసుపత్రి నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. ‘మీ మదర్‌ని ఐసీయు నుంచి వేరొక వార్డుకు తరలిస్తున్నాం. ఐసీయులోని బెడ్స్‌ అన్నీ  క్లియర్‌ చేస్తున్నాం’ అని చెప్పారు. క్లియర్‌ చేస్తున్నది జంట సౌధాలపై జరిగిన దాడిలో గాయపడిన వారి కోసం. అప్పటికి రెండు వారాలుగా దేశాయ్‌ తల్లి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ అర్ధరాత్రి ఆమెకు స్ట్రోక్‌ వస్తే అక్కడ చేర్చారు. ఆఫీస్‌ నుంచి వెంటనే ఆసుపత్రికి బయల్దేరింది దేశాయ్‌. తర్వాత ఆమె ఏడాది పాటు ఆఫీస్‌కే వెళ్లలేదు. డిస్నీకి సెలవు పెట్టింది. 

తల్లి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యే వరకు ఆమె పక్కనే ఉండి ట్రీట్‌మెంట్, మెడిసిన్, ఇతర ఆరోగ్య సేవల్ని ఒక పూర్తి స్థాయి ‘కేర్‌ గివర్‌’గా అందించింది దేశాయ్‌. ఆ సమయంలో ఆమెకు వైద్యులు పరిచయం అయ్యారు. వైద్యరంగంపై ఆసక్తి కలిగింది. డాక్టర్‌ అవాలనుకుంది! అయితే ఆమె చదివింది కంప్యూటర్‌ సైన్స్‌. మెడిసిన్‌కి కంప్యూటర్సేమీ అడ్డురావని సెలవు పూర్తయ్యాక డిస్నీలో రీ–జాయిన్‌ అయినప్పుడు అక్కడి వాళ్లు నవ్వుతూ అనడం దేశాయ్‌కి ఉత్సాహం ఇచ్చింది. డ్యూటీ చేస్తూనే సాయంకాలపు ‘పోస్ట్‌ బాక్యులోరియట్‌’ కోర్సులో చేరింది. డిగ్రీ అర్హతతో ఏ సబ్జెక్టులోనైనా అవగాహన కలిగించే కోర్సు అది. క్రమంగా దేశాయ్‌కి ఆ క్లాసుల మీద ఆసక్తి పెరిగింది. డీస్నీ మీద అనాసక్తి ఏర్పడింది.

కోర్సు పూర్తవుతుండగా ఉద్యోగం మానేసి వర్జీనియా మెడికల్‌ కాలేజ్‌కి అప్లయ్‌ చేసింది. సీటు వస్తుందనుకోలేదు. వచ్చింది! 2004 నాటి సంగతి అది. అప్పటికి ఆమె పెళ్లి కూడా అయింది. భర్తకు స్టాన్‌ఫోర్డ్‌లోని బిజినెస్‌ స్కూల్‌లో ఉద్యోగం. ఏబీసీ టీవీలో ఉండగా పరిచయం అయిన వ్యక్తే. మెడికల్‌ కోర్సులో ఉన్న ఆ నాలుగేళ్లూ భర్తకు దూరంగా ఉంది. ఆయనే వచ్చి చూసి వెళ్లేవాడు. లేదంటే ఎప్పుడైనా ఈమె వెళ్లేది. కోర్సు పూర్తయ్యాక ‘స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో చేరింది. మూడేళ్ల క్రితం.. ఆపిల్‌ ‘హెల్త్‌’ కు వైస్‌ ప్రెసిడెంట్‌గా వచ్చే ముందు వరకు డాక్టర్‌ దేశాయ్‌ స్టాన్‌ఫోర్డ్‌ సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ హెల్త్‌లో సీనియర్‌ పొజిషన్‌లో ఉన్నారు. అందులోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ విభాగానికి ‘స్ట్రాటజీ అండ్‌ ఇన్నొవేషన్‌’ వైస్‌ చైర్మన్‌గా రిలీవ్‌ అయ్యారు. స్టాన్‌ఫోర్డ్‌లో మొత్తం తొమ్మిదేళ్ల అనుభవం. 

కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఆపిల్‌ హెల్త్‌ వాచ్‌ సిక్స్‌త్‌ జనరేషన్‌ (సీరీస్‌ 6) రూపకర్త డాక్టర్‌ దేశాయే. అందులోని సరికొత్త హెల్త్‌ ఫీచర్స్‌.. ఈసీజీ చెక్, రక్తంలో ఆక్సిజన్‌ మెజర్‌మెంట్‌ ఆమె ఆలోచనే. ఆ ఆలోచనలకు డిజిటల్‌ సపోర్ట్, సాఫ్ట్‌వేర్‌ కూడా ఆమెదే. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా కెరీర్‌ ఆరంభంలో ఆమె ‘ఐ లవ్‌ టెక్నాలజీ’ అంటుండేవారు. ఏబీసీ టీవీలో పని చేసినా.. లైవ్‌ ఇంటర్వూ్యలు బాగుండేవట కానీ తక్కిన ప్రోగ్రామ్‌ వర్క్‌ బోర్‌ కొట్టేదట. ఏమైనా ఈరోజు ఆమె ఇంత పెద్ద పొజిషన్‌లో ఉండటానికి కారణం తల్లి, ఆ తల్లి వైద్యులు. వాళ్లు మాత్రమే కాదు.. ఏబీసీ టీవీ ‘వరల్డ్‌ న్యూస్‌ టునైట్‌’ హోస్ట్‌ పీటర్‌ జెన్నింగ్స్, వాల్డ్‌ డిస్నీ సీఈవో మైఖేల్‌ ఐస్న్‌ర్, స్టాన్‌ఫోర్డ్‌లో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ ఛైర్మన్‌ బాబ్‌ హారింగ్టన్‌ల భాగస్వామ్యం కూడా ఉంది డాక్టర్‌ దేశాయ్‌ ఉన్నతిలో. ఆ విషయాన్ని ఆమె తరచు చెబుతుంటారు.  

మరిన్ని వార్తలు