చివరి ప్రయాణానికి చేయూత

27 Jul, 2020 02:18 IST|Sakshi

వీడ్కోలు

కరోనా కాలంలో మరణించిన వారి అంతిమ సంస్కారానికి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినవాళ్లు కూడా అనుమానంతో దగ్గరకు రాని స్థితి. ఉత్తరప్రదేశ్‌ బృందావన్‌లోని 55 ఏళ్ల డాక్టర్‌ లక్ష్మి గౌతమ్‌ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్లుగా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనూ 7 మృతదేహాలకు అంత్యక్రియలను పూర్తి చేశారు లక్ష్మి. ఇందుకు గాను ఎవరి నుండీ సహాయం తీసుకోకుండా తలకెత్తుకున్న బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా దాదాపు 300 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. పోలీసులు కూడా ఎవరూ పట్టించుకోని మృతదేహాలను అంత్యక్రియల కోసం లక్ష్మికి అప్పజెబుతారు.

నర్వే కోసం పడిన మొదటి అడుగు
బృందావన్‌లోని ఎస్‌ఓపీ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు డాక్టర్‌ లక్ష్మి. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. 2011–12 సంవత్సరంలో సుప్రీంకోర్టు నిరాశ్రయులైన మహిళల సర్వేకు ఆదేశించింది. ఆ సర్వేలో చనిపోయిన మహిళామృతదేహాలకు దహన సంస్కారాలు సరైన విధంగా జరపడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఈ విషయం తెలిశాక నా మనసుకు చాలా కష్టం అనిపించింది. ఎలా జీవించారో కానీ ఎవరూ లేకుండా అనాథలా వారు అలా వెళ్లిపోకూడదనిపించింది. అదే సమయంలో నిరాశ్రయురాలైన ఓ మహిళ మృతదేహాన్ని రోడ్డుపక్కన చూశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్వరూ రాలేదు. దాంతో నేనే చొరవ తీసుకొని పోలీసుల సాయంతో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించాను. 

అత్తగారి పేరిట ఫౌండేషన్‌
ఆ రోజునుంచి ఇప్పటివరకు మృతదేహాల దహన సంస్కారాలు చేస్తున్నాను. మొదట్లో మహిళామృతదేహాలకే అంతిమ వీడ్కోలు అనుకున్నాను. ఏడాదిపాటు అలాగే చేశాను. కానీ, ఆ తర్వాత నుంచి లింగభేదాలు చూడటం లేదు. ఉదయం 8 గంటలకు, రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నా కుటుంబ సభ్యులు తమ అంగీకారం చెప్పలేదు. అలాగని అడ్డుపడలేదు. ఆర్థిక సాయం మాత్రం నా ఇద్దరు కుమారులు, కుమార్తె చేస్తున్నారు. మా అత్తగారి పేరుతో కనకధారా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’ అని వివరించారు డాక్టర్‌ లక్ష్మి. పిల్లలకు మంచిని బోధించే ప్రొఫెసర్‌ సమాజానికి ఉపయోగపడే పనిని చేస్తున్నందుకు గాను డాక్టర్‌ లక్ష్మిని అవార్డులతో సత్కరించారు సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు.

మరిన్ని వార్తలు