మనసున్న పరిపూర్ణ 

16 Aug, 2020 00:02 IST|Sakshi

ఆమె ఈవో అన్నపూర్ణ ఆకలి చూసి అన్నంపెట్టే చెయ్యి ఆధ్యాత్మికత దారులు వేసే చేత కష్టం ఎరిగి కాపాడే తత్వం స్పందించే మనసున్న పరిపూర్ణ 

ఉదయం నిద్రలేచే సరికే ఆ రోజు చేయాల్సిన పనులు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకుని ఉద్యోగానికి వెళ్తే అక్కడ మరికొన్ని బాధ్యతలు, సమస్యలు నవ్వుతూ ఎదురొస్తాయి. మనసును కంట్రోల్‌లో పెట్టుకుని అన్నింటినీ చిరునవ్వుతో పూర్తి చేయాలి. కొన్నాళ్లకు ఆ నవ్వు జీవం కోల్పోయి ప్లాస్టిక్‌ నవ్వులా మిగులుతుంది. నవ్వుకి తిరిగి జీవం రావాలంటే... మనలో ఒత్తిడిని తాను ఆఘ్రాణించి మనకు ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశం ఒకటి కావాలి. మనలో చాలామందికి అది ఆలయమో, ప్రార్థనా మందిరమో అయి ఉంటుంది. ‘ఆలయానికి వచ్చే వారికి సాంత్వన కలిగించేటట్లు ఉండాలి ఆలయ వాతావరణం. మా ఉద్యోగ బాధ్యతలు పైకి భగవంతుని సేవగా కనిపిస్తాయి. కానీ మా విధి నిర్వహణ భగవంతుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సేవకే ఎక్కువగా అంకితమై ఉంటుంది’ అన్నారు హైదరాబాద్, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అన్నపూర్ణ.

ప్రాచీన ఆలయమే పెద్ద బాలశిక్ష
బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అధికారిగా నియమకానికంటే ముందు అన్నపూర్ణ 32 ఆలయాలకు ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘‘అఆలు, గుణింతాలు, వాక్యాలు చదవడం నేర్చుకున్న తర్వాత పెద్ద బాలశిక్ష చదవాలి. అక్షరాభ్యాసం రోజే పెద్ద బాలశిక్ష చేతిలో పెడితే ఉద్యోగ బాధ్యత భూతంలా భయపెడుతుంది. అందుకే 2001లో ఈవోగా నాకు తొలి బాధ్యతగా హైదరాబాద్‌లోని వివేక్‌నగర్‌ హనుమాన్‌ ఆలయం కేటాయించినప్పుడు... మొదట ఏదైనా చిన్న ఆలయాన్నివ్వమని అడిగాను. సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ బాధ్యతలిచ్చారు. అది నాలుగు వందల ఏళ్ల నాటి ప్రాచీన ఆలయం.

స్థానికులకు అక్కడ ఒక ఆలయం ఉన్న పట్టింపు కూడా ఉండేది కాదు. పూజారులు పూజ చేసి ఉదయం పది లోపు వెళ్లిపోయేవాళ్లు. ఆడవాళ్లు గుడికి రావడానికి వెసులుబాటు దొరికే సమయానికి గుడి మూసేస్తే ఎలా వస్తారని టైమింగ్స్‌ పొడిగించాను. సహస్రనామాలు చదివే మహిళలతో గ్రూప్‌ తయారు చేశాను. ఐదుగురు మహిళలు స్వచ్ఛందంగా పని చేశారు. వారితో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కుంకుమార్చనకు రావలసిందిగా ఆహ్వానించాను. ఈవోగా రాకముందు నేను సెక్రటేరియట్‌లో ఉద్యోగం చేసిన అనుభవంతో చాలామంది ప్రముఖులతో పరిచయం ఉంది. నాయకులను, ఇతర ప్రముఖులను గుడికి ఆహ్వానించాను. దాంతో స్థానికులు కూడా అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు’’ అని తొలి ఆలయ బాధ్యత నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు అన్నపూర్ణ.

ధార్మిక వైద్యసేవ
ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా ఉన్న ధర్మశాల నిర్వహణ బాధ్యత కూడా ధర్మాదాయ శాఖ నిర్వహణలోనే ఉండేది. పేషెంట్‌ హాస్పిటల్‌లో ఉంటే, వారికి సహాయంగా వచ్చిన వాళ్లకు ధర్మశాలలో బస సౌకర్యం ఉండేది. పది రూపాయల నామమాత్రపు ఫీజుతో గది ఇచ్చేవారు. పేదవాళ్లకు ఆసరాగా ఉండాల్సిన ఆ ధర్మశాల అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టే నాటికి పేదరికానికి చిరునామా గా ఉండేది. కరెంట్‌ బిల్లు బకాయిల కారణంగా పవర్‌ కట్‌ అయింది. ఆమె ప్రభుత్వానికి తెలియచేసి గదులకు రిపేర్లు, వాటర్‌ ఫిల్టర్, బోరు, రోడ్డు వేయించారు. పూలకుండీలు పెట్టించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచారు.

ఇదే ఫార్ములాను ఆలయాల నిర్వహణలో కూడా పాటించడమే ఆమె విజయ రహస్యం. 650 ఆలయాలున్న తెలంగాణ రాష్ట్రంలో 150 మంది సభ్యులున్న ఆలయాల ఈవోల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దారి తీసిన నమ్మకం కూడా. ఈ ఏడాది జూన్‌లో గెజిటెడ్‌ అధికారిగా ప్రమోషన్‌ రావడంతో ఈవోల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారామె. ‘‘ప్రశాంతత కోసం ఆలయానికి వస్తారు. ఆలయంలో దర్శనం అయ్యే లోపు అసహనానికి లోనవుతుంటారు. ఆలయంలో పూల చెట్లు, మంచి శిల్పాలు, చిత్రాలతో ఆహ్లాదంగా ఉంటే భక్తులు ఆ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆలయంలో పార్కింగ్‌ సౌకర్యం లేకపోతే భక్తుల మనసు వాళ్ల వాహనం మీదనే ఉంటుంది. అందుకే బల్కంపేట ఆలయం బాధ్యతలు తీసుకున్న వెంటనే పార్కింగ్‌ లాట్‌ మీద దృష్టి పెట్టాను’’ అన్నారామె.
నిత్యావసర సరుకుల పంపిణీ

లష్కర్‌ బంగారు బోనం
సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాల పండగ తెలంగాణ జిల్లాలతోపాటు... తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మూడు నెలల ముందు నుంచి ఏర్పాట్లు మొదలవుతాయి. రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం చేయించడం తన చేతుల మీద జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు అన్నపూర్ణ. ఆ ఏడాది లష్కర్‌ బోనాలకు 35 లక్షల మంది భక్తులు రావడం కూడా రికార్డు. కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు నాయకులు, మహిళలు వెయ్యి బోనాలతో మొదలుపెట్టి పదిహేను వందల బోనాలతో ఆలయానికి చేరిన విషయాన్ని చెబుతూ ‘‘బతకడానికి ఎన్నో ఉద్యోగాలున్నాయి. నాకు ఇలాంటి ఉద్యోగం రావడం మా అమ్మానాన్నలు చేసిన పుణ్యమే. బల్కంపేట అమ్మవారికి బంగారు చీర కట్టించి, బంగారు బోనం పెట్టాలనేది ఇప్పుడు నా ముందున్న కల’’అన్నారు అన్నపూర్ణ.  

కరోనా ఇక్కట్లు
అన్నపూర్ణ తండ్రి జనార్ధనరావు నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం, వెంపటి గ్రామంలో పటేల్‌. రోజుకు కనీసంగా వందమందికి తక్కువ లేకుండా పంచాయితీకి వచ్చేవారు. పొరుగూళ్ల నుంచి వచ్చిన వారికి అన్నం పెట్టి పంపించడం అన్నపూర్ణ తల్లి కౌసల్యాదేవి బాధ్యత. అన్నం పెట్టడంతోపాటు కూతురికి అన్నపూర్ణ అని పేరు పెట్టడం యాధృచ్చికం కావచ్చు. కానీ అన్నపూర్ణకు అన్నం పెట్టే అలవాటు మాత్రం వారసత్వంగా వచ్చింది. కరోనా వైరస్‌ ఇళ్లలో పని చేసుకునే వాళ్ల ఉపాధిని కాలరాసింది. పూజారులకు భగవంతుడికి పూజ చేసి హారతి కానుకలు లేకుండా ఒట్టిచేతులతో ఇళ్లకెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చింది.

హాస్పిటల్‌లో పేషెంట్‌లకు తోడుండే సహాయకులు అన్నం తినడానికి చిన్న కాకా హోటల్‌ కూడా తెరుచుకోని దుస్థితి. ఇలాంటి వాళ్ల కోసం ఈ ఐదు నెలలుగా పని చేస్తున్నారు అన్నపూర్ణ. తన అన్నదమ్ములను, స్నేహితులను ప్రోత్సహించి సహాయం చేయిస్తున్నారు. ‘‘మనకు ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెడితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు’’ అని అమ్మ చెప్పిన మాటలు నాలో బాగా నాటుకున్నాయని చెప్పారు అన్నపూర్ణ. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తారామె. గత ఏడాది మలేసియాలో మహిళాదినోత్సవం పురస్కారం అందుకోవడం వెనుక ఆమె చేసిన ఇన్ని పనులున్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎన్‌. రాజేశ్‌ రెడ్డి
ఎర్రగడ్డ మెంటల్‌ హాస్పిటల్‌ దగ్గర ఆహారం పంచుతున్న అన్నపూర్ణ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా