క్యాన్సర్‌ పిల్లలకు తల్లిగా...

11 Aug, 2020 00:10 IST|Sakshi

చేయూత

ముంబైకి వుంటున్న గీతాశ్రీధర్‌ 28 మంది క్యాన్సర్‌ బాధితులైన పిల్లల ఆలనాపాలనా చూస్తోంది. పగలు రాత్రీ తేడా లేకుండా పన్నెండు ఏళ్లుగా ఆ పిల్లల క్షేమానికే అంకితమయ్యింది. వ్యాధిబారిన పడిన పిల్లల మొహాల్లో నవ్వులు చూడాలని తపిస్తోంది. ఇదే కాకుండా ‘గీతు మా’ పేరుతో ‘టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌’ క్యాన్సర్‌ రోగులకు ఆహార ఏర్పాట్లు చూస్తోంది. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సేవకుల సహాయంతో ఫుడ్‌ బ్యాంకును నడుపుతోంది. చెన్నైకి చెందిన గీతా శ్రీధర్‌ 20 ఏళ్ల క్రితం పెళ్లి తర్వాత ముంబయికి మారింది. అక్కడే కొన్నాళ్లు ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా విధులను నిర్వర్తించింది. ఈ సమయంలోనే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసి వేదనకు గురైంది. తండ్రి మరణం తర్వాత దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న పేదలకు సాయం చేయాలనుకుంది. 

క్యాన్సర్‌ పిల్లల మోముల్లో చిరునవ్వులు
స్నేహితుల ద్వారా ఒకసారి పుణెలోని ఓ అనాథాశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడ 2 నుండి 5 సంవత్సరాల వయసుగల 28 మంది పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతుండటం గమనించింది. వారికి చికిత్స చేస్తున్న డాక్టర్ని కలిసింది. కీమోథెరపీ, అధికమోతాదులో మందులను ఇస్తూ చికిత్సను అందిస్తున్నాన్నారు. బాధపడిన గీత ఈ పిల్లలకు తల్లిలాంటి సంరక్షణ అవసరమని తెలుసుకుంది. పిల్లలు బాగుండాలంటే వారి బాగోగులకు ఆర్థిక సాయం ఎంత అవసరమో,  ఆ పిల్లలతో కలిసి జీవించడం కూడా ముఖ్యమే. అలా చేస్తే, పిల్లల సంరక్షణను దగ్గరుండి చూసుకోవచ్చనుకుంది. ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి అక్కడ ఉన్న 28 మంది పిల్లలను తనతోపాటు ముంబయికి తీసుకెళ్లింది. తనకు ముంబయ్‌లో అదనంగా ఉన్న మరో ప్లాట్‌లో వారిని ఉంచింది.

24 గంటల సంరక్షణ
గీత ఈ పిల్లల సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంది. అందుకు గీత భర్త ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. కొందరు ఫ్రెండ్స్‌ కూడా గీతకు భరోసాగా నిలిచారు.  పిల్లల చేత గేమ్‌ సెషన్స్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ క్లాసులు, డ్యాన్స్, మ్యూజిక్‌ థెరపీ.. వంటివి  ఏర్పాటు చేసింది. మెల్ల మెల్లగా పిల్లలందరూ గీతకు చేరువయ్యారు. ‘‘నన్ను వీరంతా ప్రేమగా ‘గీతు మా’ అని పిలుస్తుంటారు’’ అని ఆనందంగా చెబుతుంది గీత. దీంతో పాటు అనేక ఇతర సామాజిక పనులను కూడా చేస్తుంది. స్నేహితుల సలహా మేరకు ఆరేళ్ల క్రితం మాస్టర్‌ చెఫ్‌ ఇండియాలో సభ్యురాలిగా చేరింది.

తన ఇద్దరు కుమార్తెలతో ఫుడ్‌ బ్లాగ్‌ రాయడం ప్రారంభించింది. ఇటీవల మైక్రో రెసిపీస్‌ కూడా చేయడం మొదలుపెట్టింది.  లాక్డౌన్‌ కూడా గీత పనులకు అడ్డంకి కాలేదు. ఈ సమయంలో అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది గీత.  అందులో పోలీసుల సహకారం కూడా అందింది. స్వచ్ఛంద సేవకులతో కలిసి పేదవారికి ఆహారం అందివ్వడానికి ఫుడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ‘ఒకరికొకరు సహాయం చేయడానికే దేవుడు మనలను పంపించాడు’ అంటుంది గీత. ఆమె తన పనులతో ఎప్పుడూ అలసిపోదు. అవసరమైన వారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు