గోల్ఫ్‌ దుర్గమ్మ

14 Aug, 2020 01:24 IST|Sakshi

ఒక ఉత్సాహం.. ఒక నిరుత్సాహం. ‘తొలి ఇండియన్‌’ గా ఉత్సాహం. ఫైనల్స్‌కు చేరనందుకు నిరుత్సాహం. పదహారేళ్ల అణికకు.. ఒకే ఈవెంట్‌లో రెండు అనుభవాలు. పేరులో దుర్గమ్మ ఉంది. పేరు తెచ్చుకునే ప్రావీణ్యం ఉంది. ముందుముందు ఆట చాలా ఉంది. దిగులు పడకు ఛాంపియన్‌!

పదహారేళ్ల నోయిడా అమ్మాయి అణికా వర్మ కాలిఫోర్నియాలోని ‘గ్రానైట్‌ బే హై స్కూల్‌’లో చదువుతోంది. స్కూల్‌ ప్రాంగణంలో ఉన్నంత వరకు ఆమె పేరు గురించి ఎవరికీ రాని ఒక ప్రశ్న, స్కూల్‌ అయ్యాక ఆమె ఒకసారి గోల్ఫ్‌ కోర్సులోకి అడుగు పెట్టాక తప్పనిసరిగా వచ్చేస్తుంది! ‘‘వావ్‌.. అనికా! అనీకా సోరెన్‌స్టామ్‌ పేరు పెట్టారా నీకు మీ అమ్మానాన్న’’ అని గోల్ఫ్‌ కోర్సులో ఒక్కరైనా అడగకుండా ఉండరు. ఆమె కోచ్‌ నోవా మాంట్‌గొమరీ అయితే మొదటే ఆ ప్రశ్న అడిగారు. అందుకు సమంజమైన కారణమే ఉంది. 48 ఏళ్ల అనీకా సోరెన్‌స్టామ్‌ జగత్ప్రసిద్ధ స్వీడిష్‌ గోల్ఫ్‌ క్రీడాకారిణి. ఆమె పేరులోని ‘అనీకా’ నే, అంతటి ప్లేయర్‌ కావాలని అణికకు కూడా పెట్టారని ఎవరైనా అనుకోవడం సహజమే.

ఆ ప్రశ్నకు నవ్వుతుంది అణిక. ‘‘అలా అనేం కాదు. అణిక అంటే దుర్గామాత. స్త్రీ శక్తి. ఆ పేరునే నాకు పెట్టారు’’ అని చెబుతుంది. ఇప్పుడీ ‘దుర్గమ్మ’ గోల్ఫ్‌లో తన శక్తిని చాటి 125 ఏళ్ల చరిత్ర గల ‘యు.ఎస్‌. ఉమెన్స్‌ అమెచ్యూర్‌ చాంపియన్‌షిప్‌’ కు ఆడిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. బుధవారం మేరిలాండ్, రాక్‌విల్‌లోని ‘ఉడ్‌మౌంట్‌ కంట్రీ క్లబ్‌’ తరఫున ఆడిన క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ఒక్క షాట్‌ తేడాతో ఓడిపోయినప్పటికీ, ‘ఆడటం’ అన్నది అణికను విజేతగా నిలబెట్టింది. 

అసలు అణిక కోసమే ఈ ‘తొలి’ అనే గుర్తింపు ఎదురు చూస్తున్నట్లుగా ఉందనుకోవాలి! 2016లో అప్పటికి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న అదితి అశోక్‌ ‘ఉమెన్‌ అమెచ్యూర్‌’ లో ఆడేందుకు అర్హత సాధించినప్పటికీ, ‘హీరో ఉమెన్స్‌ ఇండియన్‌ ఓపెన్‌’ను ఎంచుకుని, అక్కడ విజేతగా నిలిచింది. అప్పటి నుంచీ ఏ మహిళా ఇండియన్‌ గోల్ఫర్‌ కూడా యు.ఎస్‌. అమెచ్యూర్‌ వరకు రాలేదు. ఈ ఆగస్టు 3న జరిగిన టూ–స్ట్రోక్‌ ప్లే రౌండ్‌తో అణిక ఆ గుర్తింపును సాధించింది. 9న ఫైనల్స్‌. అయితే అంతవరకు వెళ్లలేకపోవడాన్ని వైఫల్యం అని కాకుండా, ఆమె ఎంతవరకు వెళ్లిందో అంతవరకే విజయంగా చూడాలి.

అణిక గత ఏడాదే ‘హీరో ఉమెన్స్‌ ఇండియన్‌ ఓపెన్‌’తో తొలిసారి వార్తల్లోకి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 15. హీరో ఉమెన్స్‌ అనేది యేటా జరిగే ‘లేడీస్‌ యూరోపియన్‌ టూర్‌’ ఈవెంట్‌. ఆ ఈవెంట్‌లో అణిక బెస్ట్‌ ఇండియన్‌ ప్లేయర్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఇరవై దేశాల క్రీడాకారిణులలో ఐదో స్థానం అంటే చిన్న సంగతేమీ కాదు. కూతురిలోని గోల్ఫ్‌ టాలెంట్‌ని గడప దాటించాలని అనుకున్న అణిక తండ్రి తన కుటుంబాన్ని నోయిడా నుంచి కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకి మార్చేశారు. అణిక తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటాయి. ఆయన సొనేల్‌. ఆమె పేరు సోనాల్‌. ఆట సరంజామా ఉండే గోల్ఫ్‌ కార్ట్‌లో కూతుర్ని కూర్చోబెట్టుకుని సొనేల్‌ స్వయంగా తనే గోల్ఫ్‌ కోర్సులో డ్రైవ్‌ చేస్తుంటారు. అంత ముద్దు కూతురంటే. 
 గోల్ఫ్‌ కార్ట్‌లో తండ్రి పక్కన అణిక

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా