వందే యువతరం

12 Aug, 2020 00:22 IST|Sakshi

కలల ఖనిజాలతో చేసిన ఆ యువకుడు మన దేశ భవిష్యత్తుకు నావికుడు – శేషేంద్ర శర్మ

నేడు అంతర్జాతీయ యువ దినోత్సవం 

ఈరోజు అంతర్జాతీయ యువ దినోత్సవం. మనలోని కార్యదీక్ష, కర్తవ్యనిర్వహణ, పోరాటపటిమలను మరోసారి గుర్తు తెచ్చి, పదునెక్కించి ముందుకు నడిపించే రోజు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్‌ యూత్‌ డే థీమ్‌: యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ గ్లోబల్‌ యాక్షన్‌.
‘మీ దృష్టిలో యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ అంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు వివిధ దేశాల నుంచి యంగ్‌లీడర్స్‌ అభిప్రాయాలను తీసుకొని వాటిని వీడియోలో పెట్టింది యూత్‌ ఆఫ్‌ యునెస్కో. ఆ వీడియో చూస్తున్నప్పుడు... వారి పేర్లు, దేశాల పేర్లు కనిపించవు. వినిపించవు.
‘యువత అంటే యువతే... భౌగోళిక సరిహద్దులు ఎందుకు? యువత అంటే ఒకే నామం, ఒకే ప్రపంచం’ అని యూత్‌ ఆఫ్‌ యునెస్కో అనుకుందో ఏమోగానీ యంగ్‌లీడర్స్‌ ఆలోచనలు ఆకట్టుకుంటాయి. వాటిలో నుంచి కొన్ని...
• ఎప్పుడూ చురుగ్గా ఉండడం. సమాజానికి సేవ చేయడం.
• విధాన నిర్ణయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం
• టెక్నాలజీ, సోషల్‌ మీడియాతో మమేకమై సమాజానికి ఉపయోగపడడం
• దేశాన్ని ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకోవడం, ఆ దిశగా కృషి చేయడం
• మిగతా వారిలాగే యువతను విశ్వసించాలి. వారి శక్తిసామర్థ్యాలకు వేదిక కలిపించాలి
• స్వచ్ఛందసంస్థల్లో చురుగ్గా పనిచేయాలి.
• మనల్ని మనం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రియాశీలం చేసుకోవాలి. వివిధ సమస్యల గురించి చర్చించి పరిష్కారమార్గాలు ఆలోచించాలి
• మార్పు అనేది ఈ తరంతో ఇప్పుడే మొదలు కావాలి
• యువత కంటే బాగా ఆలోచించేవారు కూడా యువతే.యువత శక్తిసామర్థ్యాలను వెలికితీయడానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ గ్రూప్‌లో వివిధ దేశాల నుంచి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఏడుమంది యువ పర్యావరణ ఉద్యమ కారులను ఎంపిక చేసింది. వారి సంక్షిప్త పరిచయం... 

ఎర్నెస్ట్‌ గిబ్సన్‌: ఫిజీ
‘‘నాయకత్వం అంటే ఇతరులలోని శక్తిసామర్థ్యాలను వెలికితీయడం’’ అంటున్న ఎర్నెస్ట్‌ గిబ్సన్‌ ‘350 ఫిజీ’ సమన్వయకర్త. ‘350 ఫిజీ’ అనేది పసిఫిక్‌ ఐలండ్స్‌ క్లైమెట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌. జనసమీకరణ ద్వారా సామాజిక సందేశాన్ని ఇవ్వడం 350 ఫిజీ లక్ష్యం. పర్యావరణ సంబంధిత అంశాలపై అవగాహన కలిగించడమే కాదు, పర్యావరణ ఉద్యమాలలో ఎలా భాగస్వామ్యం కావాలి అనేదానిపై గిబ్సన్‌ చురుగ్గా పనిచేస్తున్నాడు.

అర్చనా సోరెంగ్‌: ఇండియా
ఒడిశాలోని సుందర్‌ఘర్‌కు చెందిన అర్చనా సోరెంగ్‌కు ‘సంప్రదాయ జ్ఞానం’పై లోతైన అవగాహన ఉంది. తనకు తెలిసిన జ్ఞానాన్ని రచనలు, ఉపన్యాసాల రూపంలో యువతకు చేరువ చేస్తుంది. ఆమె రచనలు జాతీయ,అంతర్జాతీయ వెబ్‌సైట్లలో చోటుచేసుకున్నాయి. ‘‘తమకు ఉన్న అవగాహన, జ్ఞానం ఆధారంగా మన పూర్వీకులు అడవులను సంరక్షించారు. ముందుతరాల వారి కోసం అమూల్యమైన కానుకను అందించారు. ప్రస్తుతం ఆ బాధ్యత మనపై ఉంది’’ అంటున్న అర్చన ఆదిమజాతుల సంన్కృతి పరిరక్షణ విషయంలో విలువైన కృషి చేస్తోంది.

నిస్రీన్‌ అల్‌ సయిమ్‌: సుడాన్‌
‘పర్యావరణ స్పృహకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని ఇతరులకు పంచడం కూడా అంతే ముఖ్యం’ అంటున్న నిస్రీన్‌  ‘సుడాన్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ క్లైమెట్‌ ఛేంజ్‌’ ఛైర్‌పర్సన్‌. ‘యూత్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌–సుడాన్‌’ సమన్వయకర్త. ‘పారిస్‌ అగ్రిమెంట్‌–2016’ను సుడాన్‌ ఎడాప్ట్‌ చేసుకోవడంలో కీలకపాత్ర పోషించింది.

వదిస్లావ్‌ కైమ్‌: మోల్దొవా
‘‘యువత నడుం బిగిస్తే చేయలేనిది అంటూ ఏమీలేదు. ముందుకు పోవడం తప్ప రాజీ పడటం అనేది ఉండదు. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మన భావాలను విశాలం చేసుకోవచ్చు’’ అంటున్న వదిస్లావ్‌ యువ ఆర్థికవేత్త. అంతర్జాతీయ వ్యాపారం, పర్యావరణం, వలసలపై లోతైన పట్టు ఉంది.  2018లో యంగ్‌ యూరోపియన్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. స్వీడన్‌ యూనివర్శిటీలో చదువుకుంటున్న  కైమ్‌ అక్కడి ‘యూత్‌ యాక్షన్‌హబ్‌’ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

సోఫియ కియని: అమెరికా
అమెరికన్‌ క్లైమెట్‌ యాక్టివిస్ట్‌. రచయిత్రి. స్కూల్‌రోజుల్లోనే పర్యావరణ ఉద్యమాల పట్ల ఆకర్షితురాలైంది. టెహరాన్‌లో ఉన్నప్పుడు ఒక రాత్రి ఆకాశం వైపు చూస్తే వాయు కాలుష్యం వల్ల చుక్కలేవీ కనిపించలేదు. ఇది ఆమెను బాగా కదిలించింది. పర్యావరణ కార్యక్రమాల్లో  చురుగ్గా పాల్గొనడానికి ఇలాంటి సంఘటనలు కారణమయ్యాయి. నేషనల్‌ స్ట్రాటజిస్ట్‌గా ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)కు ప్రస్తుతం సేవలు అందిస్తోంది.

నెతన్‌: ఫ్రాన్స్‌
‘‘పర్యావరణ పరిరక్షణ కోసం ఎలా పోరాడాలి అనేదే మన ముందు ఉన్న అతి పెద్ద సవాలు’’ అంటున్న నెతన్‌ ‘జెనరేషన్‌ క్లైమెట్‌ యూరప్‌’ వ్యవస్థాపకుడు. ‘యూత్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ యూరప్‌’కు అధికార ప్రతినిధి. గత సంవత్సరం బ్రసెల్స్‌లో ‘యూరోపియన్‌ డెవలప్‌మెంట్‌ డే’ పేరుతో కొన్ని రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరిగాయి. వాటిలో వంద వర్క్‌షాప్‌లు జరిగితే కీలకమైన ‘వాతావరణ మార్పులు’ అంశంపై కనీసం పది కూడా జరగలేదు. వీటిలో యువత ప్రాతినిధ్యమే లేదు. ఇలాంటి పరిస్థితి పోవాలని గట్టిగా గళమెత్తుతున్నాడు నెతన్‌.

పలోమ కొస్టా: బ్రెజిల్‌
మానవహక్కులు, పర్యావరణ ఉద్యమకారిణి. బ్రెజిల్‌ యువత మొదలుపెట్టిన  ‘క్లైమెట్‌ వర్క్‌గ్రూప్‌’కు సమన్వయకర్త. ‘అమెజాన్‌ అడవుల్లో మంటల వెనక రాజకీయాలు’ అంశంపై ఆమె చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘‘మన జీవితాలు, మన భూములు అమ్మకం కోసం కాదు. పర్యావరణ సమస్యలకు మార్కెట్‌ సొల్యూషన్స్‌ మార్గాలు కావు’’ అని హెచ్చరిస్తుంది.

మరిన్ని వార్తలు