విశ్వాసికి దేవుడే విలువైన ఆస్తి 

2 Aug, 2020 00:03 IST|Sakshi

సువార్త

డబ్బు, ఆస్తులు మనకు గుదిబండలు కాకూడదు, అవి ఆకాశంలో స్వేచ్ఛగా, ఆనందంగా ఎగిరేందుకు తోడ్పడే రెక్కలు కావాలి. అబ్రాహాముది యూఫ్రటీసు మహానదికి అవతలి వైపున్న మెసొపొటేమియా దేశం. అది ఎంతో అందమైన భవనాలు, సంపన్నులు, యోధులుండే ప్రాంతం. ఒకప్పుడు ఎంతో ఎత్తైన బాబేలు గోపురాన్ని కట్టేందుకు పూనుకున్నది అబ్రాహాము పూర్వీకులే. అలాంటి భవనాలను, సంపన్నతను, శూరులైన తన స్వజనులను వదిలేసి, నాకు దేవుడు మాత్రమే చాలనుకుని, దేవుని ఆజ్ఞతో 1200 మైళ్ళ దూరం ప్రయాణించి వచ్చి కనాను దేశంలో గుడారాల్లో వినమ్రంగా, నిరాడంబరంగా నివసించిన గొప్ప విశ్వాసి అబ్రాహాము. ఆయన తనకున్న కొద్దిమంది సేవకులతోనే కనానులో ఒకసారి  నలుగురు రాజులను ఓడించిన మహా యోధుడు కూడా (ఆది 14:5–7). కనానులో దేవుడాయనకు గొప్ప ఆస్తినిచ్చినా అతిశయపడకుండా దేవుడే తన విలువైన ఆస్తి అని భావించిన నిగర్వి.

అబ్రాహాము ఒకసారి దేవునితో, నాకు వంశోద్ధారకుడు లేకపోతే, ఆస్తినంతా నా వద్ద బానిసగా ఉన్న ఏలీయాజరుకే ఇచ్చేస్తానన్నాడు (ఆది 15:20). నిజానికి తన సోదరుని కుమారుడైన లోతును అబ్రాహాము తన వెంట తెచ్చుకొని పెంచి పెద్దవాణ్ణి చేశాడు. అలాంటి తన రక్తసంబంధియైన లోతుకు తన ఆస్తి ఇవ్వాలనుకోవడం అందరూ చేసే లోకపరమైన ఆలోచనే. కాని తన రక్తసంబంధికి కాక తన బానిసకు ఆస్తినంతా ఇచ్చేయాలనుకోవడం అబ్రాహాములో పరిమళించిన క్రైస్తవం!!

‘క్రీస్తు యేసుది అయిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి’ అంటుంది బైబిల్‌ (ఫిలి 2:5). యేసు తన ఈ ‘గొప్ప మనసునే’ వెలలేని ఆస్తిగా మనకిస్తాడు. అదే మన జీవితాన్ని, కుటుంబాన్ని పరలోకానందంతో నింపుతుంది. మన నాణ్యతను తేల్చుకోవడానికి పెద్ద పరీక్షలు అఖ్ఖర్లేదు. ఇంట్లో మన పనివాళ్లను మనం చూసే పద్ధతిలోనే అది తేలిపోతుంది. పనివాళ్లను రాచిరంపాన పెట్టే యజమానులు పైకి ఎంత ప్రార్ధనాపరులు, పండితులు, విశ్వాసులైనా ఆంతర్యంలో వాళ్ళు దేవునికి విరోధులే!!. మన పనమ్మాయి, మన కార్‌ డ్రైవర్, మనమూ పరలోకంలో అంతా సమానులమై పక్కపక్కనే కూర్చుంటామన్న సత్యాన్ని గ్రహించిన రోజున మన జీవితాలు మారిపోతాయి.

గుడారంలో ఉంటూ కూడా అబ్రాహాము పరలోకానందంతో నివసించాడు. దేవుని మనసును అనుకరిస్తూ, అలవర్చుకొంటూ సమృద్ధియైన క్రైస్తవంతో జీవిస్తూ, ఆయన తన గుండెలోనే ఒక గొప్ప గుడి కట్టి తన ప్రభువును అందులో ప్రతిష్టించుకున్నాడు. ఈ గుడిలో ఆరాధనలు ఆగవు, ఈ గుడికి ‘లాక్‌ డౌన్‌’లో కూడా తాళాలు పడవు. విశ్వాసి గుండెగుడిలో నుండి పారే నిరంతర ‘ఆరాధనామృతధార’ జీవితాన్ని, లోకాన్ని ప్రేమతో, పవిత్రతతో, ఆనందంతో ముంచెత్తుతుంది. – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు