పితృదేవతలు తరించే పక్షం మహాలయం

4 Sep, 2020 00:01 IST|Sakshi

మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా... తన మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి, అతని సంస్కారానికీ, సంçస్కృతికీ కారణం. అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తల్చుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనవి మహాలయపక్షం రోజులు.

చనిపోయినవారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేతరూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా... పూర్వీకులను తల్చుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్నీ మహాలయ పక్షమని అంటారు. మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు. ఇప్పటివరకూ మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట.

అంతేకాదు! మనకి రక్తసంబంధం లేని గురువులు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు. కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగకపోవచ్చు. అలాంటివారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడవ వచ్చు. మహాలయం పక్షంలోని ఒకో రోజుకీ ఒకో ప్రత్యేకత ఉంది. ఒకో కారణంతో చనిపోయినవారికి ఒకో రోజుని కేటాయించారు. క్రితం ఏడు చనిపోయినవారికీ, భర్త ఉండగానే చనిపోయినవారికీ, పిల్లలకీ, అర్ధంతరంగా చనిపోయినవారికీ... ఇలా ఒకొక్కరికీ ఒక్కో తిథినాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు. ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం వీడవచ్చని చెబుతారు. అందుకే ఆ అమావాస్య రోజుని ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు

భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం. దీనినే పితృపక్షం అని కూడా అంటారు. కాలం చేసిన పెద్దవారిని తలుచుకుని వారి పేరిట పితృకర్మలు, దానధర్మాలు చేస్తుంటారు. మహాలయ పక్షం ప్రాశస్త్యం గురించి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఓ సందర్భంలో ఇలా వివరించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ’ అని వేదోక్తి. తల్లిదండ్రులు దైవసమానులు. వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధకర్మలు చేయాలి. అయితే ‘‘మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్న పిండాలు, ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా..? చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా..? పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్లీ జన్మించి ఉంటే, వారి కోసం ఇవన్నీ చేయడం పిచ్చి పని’’ అని కొందరి వాదన.

‘‘పట్టణంలో చదువుకుంటున్న కుమారుడికి డబ్బు పంపించడానికి ఓ మోతుబరి రైతు పోస్టాఫీసుకి వెళ్లాడు. అక్కడి గుమాస్తాకు డబ్బులిచ్చి మనియార్డర్‌ ద్వారా తన కొడుక్కు పంపాల్సిందిగా కోరాడు. కాసేపటికి ఆ గుమాస్తా ‘మీ అబ్బాయికి డబ్బు పంపించాము.. రెండుమూడు రోజుల్లో అందుతుంద’ని చెప్పాడు. ఆ రైతుకు నమ్మకం కుదరలేదు. తానిచ్చిన పైకం ఇక్కడే ఉండగా.. డబ్బు తన అబ్బాయికి ఎలా అందుతుందో అర్థం కాలేదు. కానీ అతడి అబ్బాయికి డబ్బు చేరింది. పితృదేవతలకు పిండప్రదానం చేయడమూ ఇలాంటిదే. శాస్త్ర ప్రకారం శ్రాద్ధం శ్రద్ధగా నిర్వర్తిస్తే ఆ ఫలం పితృదేవతలకు అందేలా దేవతలు చేస్తారు.

వారు ఆవులుగా పుట్టినట్టయితే భోజనం గ్రాసం రూపంలో అందుతుంది. వారు ఏ లోకంలో ఉన్నా.. వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫలం అందుతుంది. పరాయి ఊళ్లో ఉన్న వ్యక్తికి డబ్బును చేరవేర్చే మార్గం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు.. మరో లోకంలో ఉన్న పెద్దలకు శ్రాద్ధఫలం దక్కే మార్గం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదా..? ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు నియమం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలు తెలిపేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది. (సెప్టెంబర్‌ 2, బుధవారం నుంచి 17 వరకు మహాలయపక్షం)  – డి.వి.ఆర్‌.

ఇది పితృపక్ష పుణ్యకాలం. పితృదేవతల రుణం  తీర్చుకునే క్రమంలో పితృకార్యాలని క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేసే వారికి తిరుగుండదని ధర్మం చెబుతోంది. విష్ణుపురాణంలోని 14వ అధ్యాయంలో, పితృదేవతార్చనను పార్వణ విధానంలో (అంటే బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టి) చేయలేని వారు, హిరణ్యశ్రాద్ధం చేయలేని వారు, పిండ ప్రదానాలు చేయలేనివారు, కనీసం ఎనిమిది నువ్వుగింజలు వేలికి అద్దుకొని నీరు విడిచినా సంతోషిస్తామని పితరులు పితృగీతలో చెప్పారు. గోసేవ చేసి ఒకరోజు ఆవు ఎంత తింటే అంత మేత ఎక్కడ నుంచైనా గడ్డి కోసుకు వచ్చి వేయమని చెప్పారు. మనసుకు సంతోషంగా, ఆర్థిక భారం లేకుండా ఎవరైనా ఒక పేదవాడికి ఒకరోజు భోజనద్రవ్యాలు లేదా ధనం ఇవ్వమని చెబుతోంది. లేకపోతే నల్ల చీమలకు లేదా కాకులకు ఆహారం ఇవ్వాలి. ఇలా ఏదో ఒక మార్గంలో మన విధిని ఆచరించి పితృదేవతల కృపకు పాత్రులవుదాం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు