పతాక ప్రతిష్ట

17 Aug, 2020 00:01 IST|Sakshi
ఎర్రకోటలో ప్రధానికి చేయూతగా మేజర్‌ శ్వేతా పాండే (కుడి)

స్కూల్‌లో ఫస్ట్‌. కాలేజ్‌లో ర్యాంక్‌ స్టూడెంట్‌. బీటెక్‌లో టాపర్‌. అకాడమీలో మెడలిస్ట్‌. ఆర్మీలో మేజర్‌. ఫ్లాగ్‌ ఆఫీసర్‌గా ఇప్పుడు.. పతాక ప్రతిష్ట!

స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు మేజర్‌ శ్వేతా పాండే. జెండా ఆవిష్కరణ సమయంలో ప్రధానికి సహాయంగా ఉండటం కోసం దేశ రక్షణ శాఖ కొద్ది రోజుల ముందే ఆమెను ఇండిపెండెన్స్‌ డే కి ‘ఫ్లాగ్‌ ఆఫీసర్‌’గా ఎంపిక చేసింది. సంప్రదాయంగా వస్తున్న ‘21–గన్‌’ గౌరవ వందనం స్వీకరిస్తూ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ జెండాను ఆవిష్కరిస్తున్నప్పుడు ఆయనకు చేదోడుగా ఉండటం అపూర్వమైన అవకాశమే. ఆ అవకాశం మేజర్‌ శ్వేతా పాండేకు దక్కింది.
రష్యా ‘విక్టరీ డే’ లో భారత పతాకంతో శ్వేత

రష్యా రాజధాని మాస్కోలో ఈ ఏడాది జూన్‌ 24న జరిగిన ఆ దేశపు ‘విక్టరీ డే’ 75వ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానంపై మన దేశం నుంచి వెళ్లిన భారత సైనిక దళానికి కూడా మేజర్‌ శ్వేతా పాండేనే నేతృత్వం వహించారు! మన త్రివర్ణ పతకాన్ని చేతబట్టి మన దళాన్ని పరేడ్‌ చేయించారు. ప్రస్తుతం ఆమె ఇండియన్‌ ఆర్మీలోని 505 బేస్‌ వర్క్‌షాప్‌ సైనిక అధికారి. బేస్‌ వర్క్‌షాప్‌లో ఆయుధాలు, యుద్ధవాహనాలు, ఇతర సాధన సంపత్తికి అవసరమైన మరమ్మతులు నిరంతరం జరుగుతుంటాయి. ఆ పనులను శ్వేతే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఆ విభాగంలో ఇ.ఎం.ఇ. (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌) ఆఫీసర్‌ ఆమె. ఈ ఏడాది జరిగిన రెండు విశేష కార్యక్రమాలలోనూ (రష్యా విక్టరీ డే, భారత్‌ ఇండిపెండెన్స్‌ డే) దళాధిపతిగా, ప్రధాని సహాయక అధికారిగా శ్వేతకు ప్రాముఖ్యం లభించడానికి కారణం.. ఆమె ప్రతిభా నిబద్ధతలే.

శ్వేతా పాండే 2012 మార్చిలో ఆర్మీలోకి వచ్చారు. చెన్నైలోని ‘ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ’లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే అధికారులు ఆమెలోని చురుకుదనాన్ని, క్రియాశీలతను గమనించారు. శిక్షణాకాలంలో నేర్చిన రక్షణవ్యూహాలలో శ్వేత అకాడమీలోనే టాపర్‌గా నిలిచి ‘గర్వాల్‌ రైఫిల్స్‌’ మెడల్‌ సాధించారు. ఇక స్కూలు, కాలేజీల్లోనయితే ప్రసంగాలలో, చర్చలలో ఆమె కనబరిచిన ప్రతిభకు దేశ విదేశాలకు చెందిన 75 పతకాలు, 250 వరకు ప్రశంసా పత్రాలు లభించాయి. బి.టెక్‌ (కంప్యూటర్‌ సైన్స్, ఆనర్స్‌) లో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యారు. ఆమెలోని ఈ సామర్థ్యాలన్నిటికీ పదును పెట్టింది లక్నోలోని ప్రతిష్టాత్మక ‘సిటీ మాంటిస్సోరీ స్కూల్‌’. శ్వేత తండ్రి రాజ్‌ రతన్‌ పాండే యు.పి. ప్రభుత్వ ఆర్థికశాఖలో అడిషనల్‌ డైరెక్టర్‌. తల్లి అమితా పాండే సంస్కృతం, హిందీ భాషల ప్రొఫెసర్‌. వాళ్లిద్దరి ప్రభావం కూడా శ్వేత కెరీర్‌పై ఉంది. శ్వేత పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ మిలటరీ ఇంజనీరింగ్‌ లో సి.బి.ఆర్‌.ఎన్‌. (కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్‌) కోర్సును కూడా పూర్తి చేశారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు