Mitron App: 'సక్కగ ఉద్యోగం చేసుకో.. ఇలాంటి రిస్క్‌లెందుకు'

9 Sep, 2022 08:42 IST|Sakshi

శివాంక్‌ అగర్వాల్‌కు కవిత్వం వినడం ఇష్టం. అయితే స్టార్టప్‌ అనేది కవిత్వం విన్నంత ఈజీ కాదని అర్థమైంది. అనీష్‌ ఖండేల్‌వాల్‌కు జోక్స్‌ వింటూ నవ్వడం ఇష్టం. అయితే స్టార్టప్‌ అనేది నవ్వినంత కూల్‌ కాదని అతడికి అర్థమైంది. అంతమాత్రాన వీరు వెనక్కి తగ్గలేదు. నేర్చుకుంటూనే ముందుకు కదిలారు. ‘మిత్రన్‌’ అనే తమ కలను నెరవేర్చుకున్నారు... 

ముంబైలోని జవేరిబజార్‌కు చెందిన నగల వ్యాపారి అమిత్‌కు టిక్‌టాక్‌ లేకుండా పొద్దు గడిచేది కాదు. టిక్‌టాక్‌ నిషేధం తరువాత అతడిని బాగా ఆకట్టుకుంది మిత్రన్‌. 58 సంవత్సరాల అమిత్‌కు మాత్రమే కాదు ఎంతోమంది కాలేజి విద్యార్థులకు ఈ ఫ్రీ షార్ట్‌ వీడియా ప్లాట్‌ఫామ్‌ బాగా నచ్చేసింది.

కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్స్‌ అయిన అనీష్‌ ఖండేవాల్, శివాంక్‌ అగర్వాల్‌లు గురుగ్రామ్‌లోని ఒక ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలోనే షార్ట్‌–ఫామ్‌ వీడియో యాప్‌ ఐడియా తట్టింది.రాత్రనకా, పగలనకా రోజుల తరబడి ఈ యాప్‌ గురించి చర్చలు జరిపారు. విద్వేషం పంచే, హింసప్రేరేపిత కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదనుకున్నారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా సులభంగా కనెక్ట్‌ అయ్యేలా డిజైన్‌ చేయాలనుకున్నారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించకూడదు అనేది మరో గట్టి నిబంధన.

‘మిత్రన్‌’ పేరుతో యాప్‌ లాంచ్‌ చేశారు.

మొదట్లో యూజర్స్‌ వీడియోలు చూసే విధంగా మాత్రమే దీన్ని డిజైన్‌ చేశారు. దీనికి కారణం కంటెంట్‌ క్రియేట్‌ చేయడానికి వారు ఆసక్తిగా లేరు అనుకోవడమే. అయితే అప్‌లోడ్‌ ఫీచర్‌ను యాడ్‌ చేయాలంటూ రిక్వెస్ట్‌లు వెల్లువెత్తడంతో నెక్ట్స్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ ఫీచర్‌ను యాడ్‌ చేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో పుట్టి పెరిగిన శివాంక్‌ అగర్వాల్‌కు చిన్నప్పటి నుంచి కవిత్వం చదవడం, రాయడం అంటే ఇష్టం. తండ్రి ప్రొఫెసర్‌. అనిష్‌ ఝార్ఖండ్‌లోని చకులియలో పుట్టాడు. అక్కడే ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి చిన్నవ్యాపారి.

‘ఉద్యోగం చేసుకోకుండా రిస్క్‌ ఎందుకు’ అని వారి తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. పైగా వారి నుంచి ప్రోత్సాహం కూడా లభించింది.

‘బరిలో రకరకాల ఆటగాళ్లు ఉన్నారు. కొందరు పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు, కొందరు నాన్‌–ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలపై దృష్టి పెట్టారు. మేము మాత్రం రెండిటినీ మిక్స్‌ చేశాం.

పదిహేను కంటెంట్‌ విభాగాలను సృష్టించాం.ట్రెండింగ్‌ టాపిక్‌ మీద ఒపీనియన్‌ వీడియోలు క్రియేట్‌ చేసే అవకాశం ఇచ్చాం’ అంటున్నాడు ‘మిత్రన్‌’ సీయివో శివాంక్‌ అగర్వాల్‌. ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన ‘మిత్రన్‌’లో ఇప్పుడు యాభైమందికి పైగా పనిచేస్తున్నారు.టెక్, ప్రాడక్ట్, మార్కెటింగ్, ఆపరేషన్‌....ఇలా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.

‘మిత్రన్‌’ ఇన్‌స్టంట్‌ సక్సెస్‌ అయింది.అంతమాత్రన నల్లేరు మీద నడకలాంటి విజయమేమీ కాదు. తొలి అడుగులోనే షాక్‌ తగిలింది!

కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ‘మిత్రన్‌’ను తొలగించారు. కరెక్ట్‌ వే ఏమిటో తెలుసుకొని గూగుల్‌ టీమ్‌తో టచ్‌లోకి వచ్చి తప్పు సరిదిద్దుకున్నారు. ఇలాంటివి మరికొన్ని కూడా ఎదురయ్యాయి. అయితే ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు.

వీరి భవిష్యత్‌ ప్రణాళిక విషయానికి వస్తే...క్వాలిటీ వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌ రూపకల్పన, బ్రాండ్స్, క్రియేటర్స్‌ను ఒకే వేదిక మీదికి తీసుకురావడం...ఇలా ఎన్నో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు