కూతురి ఒడిలో అమ్మ

1 Aug, 2020 00:18 IST|Sakshi

ఏమయింది ఆ తల్లికి! మొండిగా, నిక్కచ్చిగా పెరిగింది. తల్లిదండ్రులపై కోపం. భర్తపై అసంతృప్తి. బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. బిడ్డనూ పట్టించుకోలేదు. బిడ్డే తల్లిని ఒడిలోకి తీసుకుంది! ‘బుకర్‌’ పోటీలో ఓ నవల ఇది. బహుమతికి వడపోత మొదలైంది. పదమూడు మందిలో... తొమ్మిది మంది రచయిత్రులే! ఒకరిని మించిన థీమ్‌ ఒకరిది. జడ్జిలకు పెద్ద పరీక్షే పెట్టారు. 

చిన్నప్పుడు తార మొండిగా ఉండేది. పెద్దయ్యాక, పెళ్లయ్యాక కూడా! అయితే కారణం ఉండేది ఆ మొండితనానికి. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని అతyì  నుంచి విడిపోయింది. ఒడిలో చిన్న బిడ్డ. అంత బిడ్డ ఉన్న తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఉండదు. సంపన్నులైన తన తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడానికి ఆశ్రమ జీవితం గడుపుతూ, పనిగట్టుకుని యాచకురాలిగా కొన్నాళ్లు గడుపుతుంది. తైల సంస్కారం ఉండదు, మంచి బట్టలు వేసుకోదు. కూతురు పెద్దదవుతుంటుంది. తారకూ వయసు మీద పడి అన్నీ మర్చిపోతుంటుంది. కూతురే ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన స్థితికి వస్తుంది.

తల్లి.. కూతురి ఒడిలో బిడ్డవుతుంది! తల్లి తనకేదైతే ‘కేరింగ్‌’ను ఇవ్వలేదో, అదే కేరింగ్‌ను కూతురు తన తల్లికి ఇవ్వవలసి వస్తుంది. ఆ తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ద్వేషాలే.. ‘బరన్ట్‌ షుగర్‌’ నవల. పోటీలో గెలిస్తే 50 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చే ‘బుకర్‌ ప్రైజ్‌’ రేస్‌లో ఉంది ‘బరన్ట్‌ షుగర్‌’! దుబాయ్‌లో ఉంటున్న అవనీ దోషీ ఈ పుస్తక రచయిత్రి. అవని కనుక ఈ ఏడాది విజేత అయితే.. అరుంధతీరాయ్, కిరణ్‌ దేశాయ్‌ల తర్వాత బుకర్‌ ప్రైజ్‌ పొందిన మూడో భారతీయురాలు అవుతారు. 
లండన్‌లోని ‘బుకర్‌ ప్రైజ్‌’ కమిటీ మంగళవారం విడుదల చేసిన తొలి వడపోత (లాంగ్‌ లిస్ట్‌) ఆంగ్ల భాషా నవలా రచయితల జాబితాలో (పుస్తకాల జాబితా అనాలి) 165 మందికి 13 మంది మిగిలారు. వారిలో ఒకరు అవనీ దోషీ. ఈ పదమూడు మందిలోంచి ఆరుగురిని రెండో విడతగా (షార్ట్‌ లిస్ట్‌) వడకడతారు. నవంబరులో అంతిమ విజేతను ప్రకటిస్తారు. అవని తొలి నవల ‘గర్ల్‌ ఇన్‌ ది వైట్‌ కాటన్‌’. గత ఏడాది ఆగస్టులో ఇండియాలో పబ్లిష్‌ అయింది. అందుకనే పోటీకి పంపించలేక పోయింది. యు.కె., ఐర్లండ్‌లలో ప్రచురణ అయిన నవలలను మాత్రమే బుకర్‌ కమిటీ పోటీకి స్వీకరిస్తుంది. ‘బరన్ట్‌ షుగర్‌’ అవని రెండో నవల. లండన్‌లోని పెంగ్విన్‌ బుక్స్‌ సంస్థ ఈ రోజు (జూలై 30) ఆ పుస్తకాన్ని విడుదల చేస్తోంది. ముందరి ఏడాది అక్టోబర్‌ 1 నుంచి.. అవార్డు ప్రకటించే ఏడాది సెప్టెంబర్‌ 30 లోపు వచ్చిన పుస్తకాలను బుకర్‌ కమిటీ పోటీకి పరిగణనలోకి తీసుకుంటుంది కనుక  ‘బరన్ట్‌ షుగర్‌’ పోటీలో చోటు చేసుకుంది.
 ఏడాది బుకర్‌ ప్రైజ్‌ లాంగ్‌ లిస్ట్‌లో ఒక విశేషం ఉంది. పోటీకి నిలిచిన పదమూడు మందిలో తొమ్మిది మంది మహిళా రచయితలే. అవనితో పాటు.. డయేన్‌ కుక్‌ (ది న్యూ వైల్డర్‌నెస్‌), ట్సిట్సీ డాన్‌గరేంబ్గా (దిస్‌ మార్నబుల్‌ బాడీ), హిలరీ మాంటెల్‌ (ది మిర్రర్‌ అండ్‌ ది లైట్‌), మాజా మాంగిస్ట్‌ (ది షాడో కింగ్‌), కైలీ రీడ్‌ (సచ్‌ ఎ ఫన్‌ ఏజ్‌) యాన్‌ టైలర్‌ (రెడ్‌హెడ్‌ బై ది సైడ్‌ ఆఫ్‌ ది రోడ్‌), సోఫీ వార్డ్‌ (లవ్‌ అండ్‌ అదర్‌ థాట్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌), పామ్‌ జాంగ్‌ (హౌ మచ్‌ ఆఫ్‌ దీజ్‌ హిల్స్‌ ఈజ్‌ గోల్డ్‌).. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ తొమ్మిది పుస్తకాలలో ‘ది మిర్రర్‌ అండ్‌ ది లైట్‌’కి కనుక ప్రైజ్‌ వస్తే.. పుస్తక రచయిత్రి హిలరీ మాంటెల్‌కి ఇది మూడో ‘బుకర్‌’ అవుతుంది. 2009లో, 2012లో ప్రైజ్‌ గెలుచుకున్న ‘ఉల్ఫ్‌ హాల్‌’, ‘బ్రింగ్‌ అప్‌ ద బాడీస్‌’ ఆమె రాసిన నవలలే. ఏమైనా ఈ ఏడాది పోటీ ‘టఫ్‌’గా ఉండబోతోంది. ఈ ‘నవ’లామణులు ఒకరిని మించిన థీమ్‌తో ఒకరు న్యాయ నిర్ణేతలకు గట్టి పరీక్షే పెట్టబోతున్నారు. 

నవలల సారాంశం
‘ది న్యూ వైల్టర్‌నెస్‌’ వాతావరణ మార్పులకు నివాసయోగ్యం కాని ప్రపంచం నుంచి కూతుర్ని కాపాడుకునే తల్లి కథ. ‘దిస్‌ మార్నబుల్‌ బాడీ’ జీవితానికి ఆశల రెక్కలు తొడుగుతుంది. ‘ది మిర్రర్‌ అండ్‌ ది లైట్‌’ ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి ముఖ్య సలహాదారు థామస్‌ క్రాంవెల్‌ చరమాంకం. ‘ది షాడో కింగ్‌’ ఒక సైనికాధికారి ఇంట్లోకి పనమ్మాయిగా వచ్చిన అనాథ.. నియమ నిబంధనలతో కూడిన తన కొత్త జీవితానికి అలవాటు పడలేకపోవడం. ‘సచ్‌ ఎ ఫన్‌ ఏజ్‌’.. తగని చోట తగిన విధంగా ఉంటే ఏం జరుగుతుందన్నది! ‘రెడ్‌హెడ్‌ బై ది సైడ్‌ ఆఫ్‌ ది రోడ్‌’ అసంఖ్యాకంగా అక్కచెల్లెళ్లు, అత్తమామల కుటుంబ సభ్యులతో విసురుగా మెసిలే ఒక మొరటు మనిషి హృదయ నైర్మల్యం. ‘లవ్‌ అండ్‌ అదర్‌ థాట్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పిల్లలు పుట్టడం ఎదురు కోసం చూస్తూ, భవిష్యత్తును అల్లుకుంటున్న ఓ జంట జీవితంలోని  హటాత్పరిణామం. ‘హౌ మచ్‌ ఆఫ్‌ దీజ్‌ హిల్స్‌ ఈజ్‌ గోల్డ్‌’ గూడు కోసం, అదృష్టం కోసం వెదకులాడే ఒక వలస కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన అనూహ్య ఘర్షణ.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా