శత చిత్ర పద్మం

3 Aug, 2020 02:58 IST|Sakshi

శత చిత్ర పద్మం అంటే... వంద చిత్రాల్లో నటించారని కాదు. శత వసంతాలు పూర్తి చేసుకున్నారామె. ఊరికే వందేళ్లు నిండితే కూడా ఇంత పెద్ద సెలబ్రేషన్‌ ఉండేది కాదేమో! ఆమెలో ఒక చిత్రకారిణి ఉన్నారు. ఒక వ్యాపారవేత్త ఉన్నారు. అంతకు మించి జీవితానికి సుపథం వేయగలిగిన గొప్ప తాత్వికవేత్త ఉన్నారు. 

చీర మీద చెట్టు
పద్మావతి నాయర్‌ (పద్మమ్‌) 1920లో కేరళ రాష్ట్రం, త్రిశూర్‌లో పుట్టారు. ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తారు. టీ తాగడం, న్యూస్‌ పేపర్‌ చదవడం పూర్తయిన తర్వాత తన స్నానపానాదులు, ఉపాహారం ముగించుకుని పదిన్నరకు ఉద్యోగానికి వెళ్లినంత కచ్చితంగా రోజూ తన డెస్క్‌కు చేరుతారు. ఒంటి గంట వరకు తన ప్రపంచంలో మునిగిపోతారామె. ఆమె ప్రపంచంలో చిలుకలుంటాయి, చెట్టు కొమ్మ మీద వాలిన జంట పక్షులుంటాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకుని విహరిస్తున్న కొంగలుంటాయి. పురి విప్పిన నెమళ్లుంటాయి. రేకులు విచ్చుకున్న పువ్వులుంటాయి. ఇవన్నీ చీర మీద రంగుల బొమ్మలుగా ఉండవచ్చు, వాల్‌ హ్యాంగింగ్స్‌గానూ ఉండవచ్చు. రోజూ పెయింటింగ్‌ కోసం మూడు గంటల సమయాన్ని కేటాయిస్తారామె.

వందేళ్ల వయసులో చేతి వేళ్లు పట్టు దొరకడం కష్టమే. బ్రష్‌ను కదలకుండా పట్టుకుని డిజైన్‌కు తగినట్లు స్ట్రోక్స్‌ ఇవ్వడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అదే మాట అన్నప్పుడు ఆమె నవ్వుతూ ‘‘నేను పెయింటింగ్స్‌ మొదలు పెట్టిందే అరవై దాటిన తర్వాత. అప్పటి నుంచి రోజూ వేస్తూనే ఉన్నాను. అలా వేస్తూ ఉండడమే వేళ్లకు శక్తి. అయితే టస్సర్‌ మీద పెయింటింగ్‌ చేయడం కొంచెం కష్టమే’’ అన్నారు. పెయింటింగ్‌ చేసిన చీరకు ఆమె పదకొండు వేల రూపాయలు చార్జ్‌ చేస్తారు. పద్మమ్‌ బామ్మ వేసిన పెయింటింగ్‌ దుపట్టా మూడు వేలు. ‘‘నేనింత వరకు నా ఖర్చులకు పిల్లల దగ్గర చేయి చాచలేదు. నేను మనుమలు, మనుమరాళ్ల పుట్టిన రోజులకు నా డబ్బుతోనే బహుమతులిస్తాను కూడా’’ అంటారామె ఒకింత గర్వంగా.

ఎవరికి వారే ఆధారం
పద్మావతి నాయర్‌ బాల్యం కేరళలోని త్రిశూర్‌ జిల్లాలోని వడకంచెర్రిలోనే గడిచింది. పదిమందిలో తొమ్మిదో సంతానం. ఫోర్డ్‌ మోటార్స్‌ ఉద్యోగి కేకే నాయర్‌ను పెళ్లి చేసుకుని 1945లో ముంబయికి వెళ్లారామె. వారికి ఐదుగురు పిల్లలు. ఆ పిల్లలందరి దుస్తులూ తానే మెషీన్‌ మీద కుట్టేవారు. ఆడపిల్లల దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌ కూడా చేసేవారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యేటప్పటికి అరవై దాటాయి. అప్పటి వరకు హాబీగా చేసిన పెయింటింగ్‌ కోసం పూర్తి సమయం కేటాయించారామె. తన సొంత సంపాదన మొదలు పెట్టింది కూడా అప్పుడే. మూడు దశాబ్దాలుగా విజయవంతంగా సాగుతోంది ఆమె పెయింటింగ్‌ కుటీర పరిశ్రమ. వందేళ్ల వయసులో కూడా డబ్బు సంపాదిస్తున్నాను. అవును, ఎందుకు సంపాదించకూడదు? అని ప్రశ్నిస్తారు పద్మమ్‌. ఆడపిల్లలనే కాదు ఎవరూ మరొకరి మీద ఆధారపడకూడదు. తమ మీద తాము ఆధారపడి జీవించాలి... అని ఆమె పేరెంటింగ్‌ ఫిలాసఫీ చెప్పారు.

పద్మమ్‌కి ఏడుగురు మనుమలు– మనుమరాళ్లు, నలుగురు ముని మనుమళ్లు–మనుమరాళ్లు. ఆమెకు రోజూ ఒంటి గంట వరకు పెయింటింగ్స్‌తో గడిచిపోతుంది. మధ్యాహ్నం కొంత విశ్రాంతి. సాయత్రం కొంత సేపు టీవీ చూసిన తర్వాత మనుమలు– మనుమరాళ్ల నుంచి వచ్చిన వాట్సప్‌ మెసేజ్‌లు చూసుకోవడం, వాటికి బదులివ్వడం ఆమె వ్యాపకం. పిల్లల సెలవు రోజుల్లో వాళ్లకు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాల్లో విస్తరించిన బంధువులందరినీ సోషల్‌ మీడియా వేదికగా పలకరిస్తుంది. స్నేహితులకు ఈ మెయిల్స్‌ చేస్తుంది. జీవితంలో ఏమున్నాయి? ఏమి లేవు? అని బేరీజు వేసుకుంటూ ఉంటే సంతోషాల కంటే కష్టనష్టాల తక్కెడ బరువెక్కుతుంది. ‘నా జీవితంలో నేనున్నాను’ అనుకుంటే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అదే ఆయుష్షును పెంచే ఔషధం. ఆనందంగా జీవించడానికి సాధనం. – మంజీర

>
మరిన్ని వార్తలు