నానమ్మ పిజ్జా సూపర్‌హిట్‌

17 Aug, 2020 00:01 IST|Sakshi

ఫిబ్రవరి వరకూ ఆమె ఒక సగటు అమ్మ, నానమ్మ. మే నాటికి అంట్రప్రెన్యూర్‌ అయిపోయింది. లాక్‌డౌన్‌లో తన కొడుకుల ఇళ్లకు పిజ్జా చేసి పంపిస్తే వాళ్లు ఆహా, ఓహో అన్నారు. హోమ్‌ కిచెన్‌ పెట్టించారు. ఇప్పుడు వారానికి 300 మంది ఆమె పిజ్జాలు తెప్పించుకుంటున్నారు. 67 సంవత్సరాల ముంబై గృహిణి నవ విజయగాథ ఇది.

ముంబై లోఖండ్‌వాలాలో నివసించే 67 సంవత్సరాల ప్రతిభా కానోయ్‌కు ఒకటే కోరిక. ‘నన్ను ఏదైనా పని చేసి డబ్బు సంపాదించనివ్వండ్రా’ అని. కలిగిన కుటుంబం. భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకులు ముంబైలోనే సెటిల్‌ అయ్యారు. ఆమె ఇంట్లో పని చేసే వారికే నెలకు పది, పన్నెండు వేలు జీతాలు ఇవ్వాలి. ‘అందరూ పని చేసి డబ్బు సంపాదిస్తున్నారు. నేనొక్కదాన్ని తిని కూచుంటున్నాను. నేను కూడా పని చేసి సంపాదిస్తాను’ అని ఆమె తరచూ అనేది. కాని భర్త, కొడుకులు ‘అంత అవసరం ఏముంది’ అని ఆమె మాట పడనివ్వలేదు. కాని కాలం కలకాలం ఒకేలా ఉండదు. అది కరోనాను తెస్తుంది.

మార్చిలో మొదలు
ప్రతిభా కానోయ్‌కు నలుగురు మనమలు ఉన్నారు. కొడుకులు తరచూ వాళ్లను బయటకు తీసుకెళతారు. లేదా ఇంటికి బయటి ఫుడ్‌ తెప్పించి పెడతారు. కాని మార్చిలో లాక్‌డౌన్‌ మొదలయ్యాక ప్రతిభా మనసు ఊరికే ఉండలేకపోయింది. ‘అయ్యో... పిల్లలు బయటి తిండిని తెప్పించుకోలేకపోతున్నారే’ అనుకుంది. తన ఇద్దరు కొడుకుల ఇళ్లకు తన ఇంటి నుంచి పిజా తయారు చేసి పంపించడం మొదలెట్టింది. కొడుకులు ఆ పిజా రుచి చూసి ఆశ్చర్యపోయారు. మనమలు అయితే లొట్టలు వేయసాగారు. ప్రతిభా కానోయ్‌ చేసేది వెజ్‌ పిజ్జాలు. అలాంటి పిజ్జాలు ముంబైలో తినలేదు అని వారు ప్రశంసించసాగారు.

మారిన మనసు
తల్లి వంట ప్రతిభను చూశాక కొడుకుల మనసు మారింది. ‘అమ్మా.. హోమ్‌ కిచెన్‌ పెట్టిస్తాం. ఇంటి నుంచే నువ్వు వ్యాపారం ప్రారంభించు. సొంతగా సంపాదించు’ అని ఏర్పాట్లు చేశారు. ఇద్దరు చెఫ్‌లు జీతానికి కుదిరారు. డెలివలి బోయ్స్‌ కూడా. ‘మమ్మీస్‌ కిచెన్‌’ అనే పేరుతో మే 2న ప్రతిభా పిజ్జా వ్యాపారం మొదలైంది. కొడుకులే ఆమె ప్రచారకర్తలు అయ్యారు. ‘మా అమ్మ పిజ్జాలు టేస్ట్‌ చేసి చెప్పండి’ అని ఫ్రెండ్స్‌ను కోరారు. ఫ్రెండ్స్‌ ఆర్డర్స్‌ పెట్టారు. ప్రతిభ చేసి పంపే పిజ్జాలను చూసి వహ్వా అన్నారు. రెండు మూడు నెలల్లో ఆమె వ్యాపారం ఎంత బిజీ అయ్యిందంటే ఇవాళ పిజ్జా కావాలంటే నిన్న ఆర్డర్‌ పెట్టాలి.

ఖాళీగా ఎందుకుండాలి?
‘నా భర్త భోజన ప్రియుడు. నాతోపాటు కలిసి వంట చేయడాన్ని ఇష్టపడేవాడు. చిన్నప్పుడు మా అక్క దగ్గర వంట నేర్చుకున్నాను. అలా వంటలో నేను నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడింది. పిజ్జాలో వాడే పదార్థాలు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుంటాను. వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి వినిగర్‌లో నానబెట్టి ఉపయోగిస్తాను. ఉదయం 9 గంటలకు నేను కిచెన్‌లోకి వెళితే సాయంత్రం వరకూ రోజుకు 30 నుంచి 50 వరకూ డెలివరీలు ఉంటాయి. శని, ఆదివారాలు 100 పైగా ఆర్డర్లు ఉంటాయి. 11 రకాల పిజ్జాలు తయారు చేస్తాం. 400 నుంచి 550 వరకూ చార్జ్‌ చేస్తాం.

నన్ను చూసి కొందరు ఇంత డబ్బుండి ఇదేం పని అనుకోవచ్చు. కాని ఎవరైనా సరే ఎందుకు ఖాళీగా ఉండాలి అంటాను. స్త్రీలు తమ ఆర్థిక స్వాతంత్య్రం తాము చూసుకోవాలి. అలాగే వయసైపోయిందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకుంటే వయసు ఎప్పటికీ అవదు. ఏ వయసులో అయినా జీవితాన్ని ఫుల్‌గా జీవించవచ్చు. 67 ఏళ్ల వయసులో సక్సెస్‌ సాధించి నా తోటి వయసు వారికి నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే’ అంది ప్రతిభ. ఎప్పుడైనా ముంబై వెళితే ఆమె చేతి పిజ్జాకు ఆర్డర్‌ పెట్టండి. – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు